దారికి రాని పనులు
ABN , Publish Date - Sep 21 , 2025 | 12:31 AM
నెల రోజుల్లో బీఎన్ రోడ్డు పనులను కొలిక్కి తీసుకు వస్తామని స్థానిక జిల్లా కోర్టుకు కాంట్రాక్టర్ ప్రతినిధి ఇచ్చిన హామీ నెరవేరలేదు. గడువు ముగిసినా ఒక్క గొయ్యి కూడా పూడ్చలేదు. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్న కాంట్రాక్టర్లపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
- నెల రోజుల్లో బీఎన్ రోడ్డు పనులు కొలిక్కి తీసుకు వస్తామని కోర్టుకు కాంట్రాక్టర్ హామీ
- గడువు ముగిసినా ఒక్క గుంత కూడా పూడ్చని వైనం
- ఉన్నతాధికారులు, న్యాయస్థానం ఆదేశాలు సైతం బేఖాతరు
- ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికుల విస్మయం
చోడవరం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): నెల రోజుల్లో బీఎన్ రోడ్డు పనులను కొలిక్కి తీసుకు వస్తామని స్థానిక జిల్లా కోర్టుకు కాంట్రాక్టర్ ప్రతినిధి ఇచ్చిన హామీ నెరవేరలేదు. గడువు ముగిసినా ఒక్క గొయ్యి కూడా పూడ్చలేదు. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్న కాంట్రాక్టర్లపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని గంధవరం, వెంకన్నపాలెం నుంచి అటు మాడుగుల మండలం గరికబంధ వరకు, ఇటు వడ్డాది నుంచి నర్సీపట్నం వరకు రహదారి పూర్తిగా దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఎన్ రోడ్డు పనులకు సంబంధించి ప్రస్తుత కాంట్రాక్టర్ టెండర్‌ను రద్దు చేయనంత వరకు కనీసం గోతులు పూడ్చడానికి నిధులు మంజూరుకావని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆర్‌అండ్‌బీ నిబంధనల ప్రకారం టెండర్ పనులు ప్రారంభమైన రోడ్డులో నిర్వహణ పనులకు మళ్లీ నిధులు మంజూరు చేసే అవకాశం ఉండదు. ఈ కారణంగా కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్ చేస్తే తప్ప, రోడ్డులో గోతులు కూడా పూడ్చేందుకు అవకాశం ఉండదు. బీఎన్ రోడ్డులో ఎన్‌డీబీ గ్రాంటు టెండరు రద్దు చేసినట్టయితే, కనీసం గోతుల మరమ్మతుల వరకైనా నిఽధులు తెచ్చి పనులు పూర్తి చేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి బీఎన్ రోడ్డు కాంట్రాక్టర్‌ను మార్చి, ఈ రోడ్డు అభివృద్ధి పనులు పట్టాలెక్కించే విధంగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
27కి న్యాయవాదుల కేసు వాయిదా
బీఎన్ రోడ్డు దుస్థితిపై స్థానిక న్యాయవాదులు దాఖలు చేసిన కోర్టు కేసు ఈ నెల 27కి వాయిదా పడింది. ఈ కేసుపై శనివారం విచారణ జరగాల్సి ఉండగా, జిల్లా జడ్జి కోర్టుకు సంబంధించిన సమావేశానికి హాజరైన కారణంగా ఈ నెల 27కి వాయిదా వేశారు. బీఎన్ రోడ్డు దుస్థితిపై స్థానిక న్యాయవాదులు కాండ్రేగుల డేవిడ్, భరత్‌భూషణ్, తదితరులు కోర్టులో కేసు వేయడం, దీనిపై కోర్టు ఆర్‌అండ్‌బీ ఎన్‌డీబీ చీఫ్ ఇంజనీరు, సంబంధిత కాంట్రాక్టర్ కోర్టు ముందు హాజరుకావాలని ఇచ్చిన నోటీసుల మేరకు, గత నెల 20న ఆర్ అండ్‌బీ ఎస్‌ఈతో పాటు, కాంట్రాక్టర్ తరఫున ప్రతినిధి హాజరైన సంగతి తెలిసిందే. నెల రోజుల వ్యవధిలో బీఎన్ రోడ్డు పనులను కొలిక్కి తీసుకు వస్తామని గత నెల కోర్టులో కాంట్రాక్టర్ హామీ ఇచ్చారు. దీనిపై కోర్టు ఈ నెల 20కి కేసు వాయిదావేసి, గడువు లోగా పనులు పూర్తి చేయకుంటే చర్యలు తీసుకోవడంతో పాటు హైకోర్టుకు లేఖ రాస్తామని హెచ్చరించారు. ఈ కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా పడడంతో ఏం జరగబోతోందననే ఆసక్తి అందరిలో ఉంది.