పేదల ఇళ్ల లేఅవుట్లలో దొంగలు
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:34 AM
మండలంలోని పలు గ్రామాల్లో వీఎంఆర్‌డీఏ అభివృద్ధి చేసిన ఎన్టీఆర్ నగర్ కాలనీల (నాడు జగనన్న కాలనీలు) లే-అవుట్లలో భవన నిర్మాణ సామగ్రిని యథేచ్ఛగా చోరీ చేస్తున్నారు. ఇసుక, సిమెంటు, ఇనుము, కంకర వంటి వాటిని దర్జాగా పట్టుకుపోతున్నారు.
రాత్రిపూట భవన నిర్మాణ సామగ్రి చోరీ
ఎన్టీఆర్ కాలనీల నుంచి ఇసుక, ఇనుము, సిమెంటు తీసుకుపోతున్న అక్రమార్కులు
ట్రాక్టర్ ఇసుక రూ.4 వేలు, లారీ లోఓడు రూ.8 వేలకు అమ్మకం
పట్టించుకోని అధికారులు
సబ్బవరం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో వీఎంఆర్‌డీఏ అభివృద్ధి చేసిన ఎన్టీఆర్ నగర్ కాలనీల (నాడు జగనన్న కాలనీలు) లే-అవుట్లలో భవన నిర్మాణ సామగ్రిని యథేచ్ఛగా చోరీ చేస్తున్నారు. ఇసుక, సిమెంటు, ఇనుము, కంకర వంటి వాటిని దర్జాగా పట్టుకుపోతున్నారు.
మండలంలోని పైడివాడ, పైడివాడఅగ్రహారం, ఎరుకునాయుడుపాలెం, అసకపల్లి, గాలిభీమవరం, గొల్లలపాలెం, నంగినారపాడు, గంగవరం గ్రామాల్లో వైసీపీ హయాంలో ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పేరిట జీవీఎంపీ పరిధిలోని పేదలకు స్థలాలతోపాటు ఇళ్లు నిర్మించిన ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్కరికి ఒక సెంటు చొప్పున ఆయా గ్రామాల్లో ఎనిమిదిచోట్ల లే-అవుట్లు వేశారు. 2022 ఏప్రిల్ 28న అప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డి పైడివాడఅగ్రహారం లే-అవుట్‌లో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులు సొంతంగా ఇళ్లు నిర్మించుకోవడం కష్టం అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఇందుకుగాను ప్రతి లబ్ధిదారు నుంచి రూ.35 వేల చొప్పున ప్రభుత్వం వసూలు చేయించింది. కానీ కాంట్రాక్టర్లు నాసిరకంగా పనులు చేయడంతోపాటు తీవ్ర జాప్యం చేశారు. గత ఏడాది ప్రభుత్వం మారేనాటికి ఎక్కడా ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తికాలేదు. అప్పటి ప్రభుత్వం బిల్లులు సరిగా చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఇళ్ల నిర్మాణ పనులను మధ్యలో ఆపేశారు. దీంతో కొంతమంది స్థానికులు సిమెంటు, ఇసుక, ఇనుము, కంకరను తస్కరించుకుపోయారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇళ్ల నిర్మాణ పనులు మళ్లీ మొదలయ్యాయి. కాలనీలను త్వరగా నిర్మించాలన్న ఉద్దేశంతో ఇసుకు, ఇనుము, కంకర, సిమెంటును పెద్ద మొత్తంలో సరఫరా చేస్తున్నది. వీటిని కాలనీల్లో పలచోట్ల డంపింగ్ చేస్తున్నారు. రక్షణ కోసం సెక్యూరిటీ గార్డులను నియిమించలేదు. దీంతో అక్రమార్కులు మళ్లీ బరితెగించారు. చీకటి పడిన తరవాత సిమెంటు, ఇసుక, ఇనుము, కంకరను ఎత్తుకుపోతున్నారు. సమీపంలోని తోటలు, ప్రైవేటు లేఅవుట్లలోకి తరలించి నిల్వచేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలతోపాటు దువ్వాడ మీదుగా గాజువాక, లంకెలపాలెం, అగనంపూడి ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ.4 వేలు, లారీ అయితే రూ.8-9 వేలకు అమ్ముతున్నారు. ఇళ్ల నిర్మాణం కోసం ఫ్లైయాష్‌తో ఇక్కడే ఇటుకలు తయారు చేస్తున్నారు. అక్రమార్కులు వీటిని కూడా చోరీ చేస్తున్నారు.