Share News

లే అవుట్‌లలో దొంగలు!

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:54 AM

నగర శివారులో సెంటు స్థలాల్లో నిర్మిస్తున్న ఇళ్లకాలనీలో కొన్నిచోట్ల దొంగలు పడ్డారు.

లే అవుట్‌లలో దొంగలు!

భారీగా ఇసుక, ఇనుము, సిమెంట్‌ మాయం

బయటపడితేనే పోలీసులకు ఫిర్యాదులు

అక్రమార్కులకు కిందిస్థాయి అధికారుల సహకారం

మెటీరియల్‌ నిల్వ లెక్కలు తేల్చాలని కలెక్టర్‌ ఆదేశం

రంగంలోకి హౌసింగ్‌ అధికారులు

విశాఖపట్నం/పద్మనాభం/ఆనందపురం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):

నగర శివారులో సెంటు స్థలాల్లో నిర్మిస్తున్న ఇళ్లకాలనీలో కొన్నిచోట్ల దొంగలు పడ్డారు. ఇనుము, ఇసుక, సిమెంట్‌ను అందినకాడికి ఎత్తుకుపోయారు. మరికొన్ని చోట్ల హౌసింగ్‌ సిబ్బంది, లేవుట్‌లలో సైట్‌ ఇంజనీర్లు, ఇతర సిబ్బంది ఏకమై కొంత ఇనుము, ఇసుక, సిమెంట్‌ అమ్ముకున్నారు. సుమారు రెండేళ్లుగా జరుగుతున్న మెటీరియల్‌ మాయంపై అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేసి చేతులు దులుపుకుంటున్నారు.

తాజాగా పద్మనాభం మండలంలోని తునివలస లేఅవుట్‌లో ఇసుకను పబ్లిక్‌గా ట్రాక్టర్‌తో తీసుకెళ్లిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ నేపథ్యంలో మొత్తం లేఅవుట్‌లలో ఇసుక, ఇనుము, సిమెంట్‌పై లెక్కలు తేల్చాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. విశాఖ, అనకాపల్లి పరిసరాల్లో 73 లేఅవుట్‌లలో సుమారు లక్ష ఇళ్లు నిర్మిస్తున్నారు. ప్రతి ఇంటికి 90 బస్తాల సిమెంట్‌, 20 టన్నుల ఇసుక, 435 కిలోల ఇనుము ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో 30 కంపెనీలకు బాధ్యతలు అప్పగించారు.

మెటీరియల్‌ గల్లంతు

ఆది నుంచీ లేఅవుట్‌లకు సరఫరాచేసిన ఇసుక, ఇనుము, సిమెంట్‌ రక్షణపై ఆయా నిర్మాణ సంస్థలు చర్యలు తీసుకోలేదు. దీంతో అవి దొంగలపాలయ్యాయి. పైడివాడ అగ్రహారంలో భారీగా సిమెంట్‌, ఇనుమును స్థానిక ప్రజాప్రతినిధి తరలించేశారు. ముదపాక లేఅవుట్‌ నుంచి ఇసుక, సిమెంట్‌ను సమీప గ్రామాల ప్రజలు తక్కువ ధరకు కొనుగోలుచేశారనే ఆరోపణలున్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చే ఇసుకలోడ్‌ లేఅవుట్‌కు వెళ్లి అక్కడి నుంచి తిరిగి సమీప గ్రామాలకు తరలిపోతోందని రామవరం ప్రాంతానికి చెందిన నాయకులు చెబుతున్నారు. పద్మనాభం మండలం విజయరాంపురం లేఅవుట్‌లో సుమారు 300 టన్నుల ఇనుము తక్కువగా ఉందని రెండు నెలల క్రితం ఇన్‌చార్జి ఏఈ హౌసింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటికీ లెక్కలు తేల్చలేదు. తాజాగా తునివలసలో ఇసుక ట్రాక్టర్‌తో తరలించడంపై ఫిర్యాదుచేయాలని ఈఈ సూరిబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. మెటీరియల్‌ తరలింపు బయటకు పొక్కితేనే పోలీసులకు ఫిర్యాదుచేయడం, సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు ఇస్తున్నారు. లేదంటే పట్టించుకోవడం లేదు.

అవసరానికి మించి వాడినా...

భారీగా ఇళ్లు నిర్మిస్తున్న సంస్థ అవసరానికి మించి ఇనుము వినియోగించినట్టు తేలినా అధికారులు స్పందించడం లేదు. ఇద్దరు ముగ్గురు ఏఈలు ఆయా లేఅవుట్‌లలో చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి. రాజకీయంగా పలుకుబడి ఉండడంతో ఉన్నతాధికారులు కూడా వారిపై చర్యలు తీసుకోలేదనే వాదన ఉంది. వర్షాకాలం కావడంతో అన్నిలేఅవుట్‌లలో నిర్మాణాలు, ఇసుక సరఫరా నిలిచిపోయింది. నిల్వ మేరకు పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మెటీరియల్‌ నిల్వ లెక్కలు తేల్చాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఇప్పటివరకు చేసిన నిర్మాణాలకు సరిపడా ఇసుము, ఇసుక, సిమెంట్‌ వినియోగించారా? తేడాలున్నాయా? ప్రభుత్వం సరఫరాచేసిన స్టాకులో ఎంత వినియోగించారు? తేల్చాలని ఆదేశించారు. దీంతో లేఅవుట్‌ల వారీగా లెక్కలు తేల్చేందుకు అఽధికారులు సన్నద్ధమవడంతో అక్రమార్కుల్లో ఆందోళన నెలకొంది. దీంతో వారంతా కాకిలెక్కలు వేసే పనిలో ఉన్నారని హౌసింగ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Updated Date - Sep 22 , 2025 | 12:54 AM