దొంగల హల్‌చల్
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:18 AM
జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. బ్యాంకులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. గతంలో అనకాపపల్లి పట్టణంలోని శ్రీవిశాఖ గ్రామీణ బ్యాంకులో భారీగా బంగారాన్ని ఎత్తుకెళ్లగా.. తాజాగా గురువారం మధ్యాహ్నం కెనరా బ్యాంకులోకి చొరబడి తుకుకులతొ హల్‌చల్ చేశారు. బ్యాంకు సిబ్బందిని, ఖాతాదారులను బెదిరించి లూటీ చేసేందుకు విఫలయత్నం చేశారు. ఈ సంఘటన అనకాపల్లి పట్టణంలో తీవ్ర కలకలం రేపింది.
తుపాకులతో బెదిరించి బ్యాంకులో చోరీకి విఫలయత్నం
సిబ్బంది అలారం మోగించడంతో పరారీ
గతంలో ఇదే తరహాలో బ్యాంకుల్లో చోరీలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. బ్యాంకులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. గతంలో అనకాపపల్లి పట్టణంలోని శ్రీవిశాఖ గ్రామీణ బ్యాంకులో భారీగా బంగారాన్ని ఎత్తుకెళ్లగా.. తాజాగా గురువారం మధ్యాహ్నం కెనరా బ్యాంకులోకి చొరబడి తుకుకులతొ హల్‌చల్ చేశారు. బ్యాంకు సిబ్బందిని, ఖాతాదారులను బెదిరించి లూటీ చేసేందుకు విఫలయత్నం చేశారు. ఈ సంఘటన అనకాపల్లి పట్టణంలో తీవ్ర కలకలం రేపింది.
సినీఫక్కీలో ద్విచక్ర వాహనాలపై ఏడుగురు అగంతకులు గురువారం మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో పట్టణంలోని రింగ్‌రోడ్డులో ఉన్న కెనరా బ్యాంకు వద్దకు చేరుకున్నారు. వీరిలో ఒక వ్యక్తి లోపలికి వెళ్లి బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలని అక్కడున్న ఓ ఉద్యోగిని కోరాడు. అయితే సమయం పడుతుందని ఉద్యోగి చెప్పారు. ఇదే సమయంలో మరో ఇద్దరు అగంతకులు బ్యాంకు లోపలికి వచ్చి పరిశీలిస్తున్నారు. పది నిమిషాల వ్యవధిలో మరో ముగ్గురు రెండు తుపాకులతో బ్యాంకులోపలికి ప్రవేశించారు. వీరిలో ఒక వ్యక్తి కౌంటరులోకి వెళుతున్న క్యాషియర్ చొక్కా కాలర్ పట్టుకొని బెదిరించాడు. మరోవైపు అగంతకులు బ్యాంకు మేనేజర్ సౌజన్యను కూడా తుపాకీ చూపించి బెదిరించారు. వెంటనే మేనేజర్ కేకలు వేయడమే కాకుండా ఆమెతో పాటు సిబ్బంది టేబుల్ వద్ద ఉన్న అలారాన్ని మోగించారు. అలారం మోతతో అప్పటికే బ్యాంకులో ఉన్న ఖాతాదారులు ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందారు. దీంతో అగంతకులు బ్యాంకు నుంచి బయటకు పరుగు తీశారు. అప్పటికే మరో ఇద్దరు బయట ఉన్నారు. అంతా కలిసి మూడు ద్విచక్ర వాహనాలపై రైల్వేస్టేషన్ వైపు వేగంగా వెళ్లిపోయారు. తరువాత బ్యాంకు అధికారులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా మార్గాల్లో వున్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు.
వరుస చోరీలతో ఆందోళన...
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాగా వున్నప్పుడు ఉండగా 2018వ సంవత్సరంలో పట్టణంలోని ఏపీ గ్రామీణ వికాస బ్యాంకులో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. అంతర్ రాష్ట్ర దొంగల ముఠా రాత్రి వేళ బ్యాంకులోకి చొరబడి గ్యాస్‌కట్టర్లతో లాకర్లను తెరిచి సుమారు 110 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. పోలీసులు ఇప్పటి వరకు ఈ కేసులో సుమారు 60 తులాల బంగారాన్ని మాత్రమే రికవరీ చేశారు. జిల్లాల విభజన తరువాత 2022 ఏప్రిల్‌లో కశింకోట మండలం నర్సింగబిల్లి ఎస్‌వీజీబీకి హెల్మెట్ ధరించిన అగంతకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి, బ్యాంకులోకి చొరబడ్డాడు. బ్యాంకు సిబ్బందిని పిస్టల్‌తో బెదిరించి రూ.3.3 లక్షల నగదును దోచుకెళ్లాడు. ఈ కేసులో పోలీసులు ఎటువంటి పురోగతి సాధించలేకపోయారు. ఇక పట్టణంలో తాళాలు వేసి వున్న ఇళ్లే లక్ష్యంగా చోరీలు జరుగుతున్నాయి. 2023 ఏప్రిల్ 6న పట్టణంలో ఆర్‌అండ్‌బీ బంగ్లా వెనుక తాళం వేసివున్న ఒక ఇంటిలో ఏడు తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.70 వేల నగదును దొంగలు దోచుకెళ్లారు. దీనిపై బాధితులు పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ ఈ కేసులో ఇంతవరకు ఎటువంటి పురోగతి సాధించలేదు. మూడు నెలల కిందట పట్టణంలో సాయినగర్‌లో తాళాలు వేసివున్న పలు ఇళ్లల్లో దొంగలు చొరబడి చీరలు పట్టుకుపోయారు. పోలీసులు అప్రమత్తమై రాత్రి గస్తీని ముమ్మరం చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.