బార్‌లా తెరిచేశారు!
ABN , Publish Date - Aug 10 , 2025 | 01:07 AM
మండలంలోని పలు మద్యం దుకాణాల వద్ద చూస్తే ఇవి మద్యం షాపులా?, లేక బార్‌లా? అనే సందేహం కలుగుతుంది. పలు చోట్ల మద్యం షాపుల నిర్వాహకులు షెడ్లు, టెంట్లు ఏర్పాటు చేయడంతో మందుబాబులు బహిరంగంగానే మద్యం తాగుతున్నారు. ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
- నిబంధనలు పాటించని మద్యం షాపుల వ్యాపారులు
- దుకాణాల పక్కనే షెడ్లు, టెంట్ల ఏర్పాటు
- బహిరంగంగా మద్యం సేవిస్తున్న మందుబాబులు
- అటుగా వెళ్లే మహిళలు, బాలలకు తప్పని ఇబ్బందులు
- గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులు
- పట్టించుకోని ఎక్సైజ్, పోలీసు అధికారులు
ఎస్.రాయవరం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు మద్యం దుకాణాల వద్ద చూస్తే ఇవి మద్యం షాపులా?, లేక బార్‌లా? అనే సందేహం కలుగుతుంది. పలు చోట్ల మద్యం షాపుల నిర్వాహకులు షెడ్లు, టెంట్లు ఏర్పాటు చేయడంతో మందుబాబులు బహిరంగంగానే మద్యం తాగుతున్నారు. ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని ఎస్.రాయవరం రెండు, ధర్మవరం అగ్రహారం ఒకటి, వ్యాపార కేంద్రమైన అడ్డరోడ్డు తిమ్మాపురం పరిధిలో ఒకటి, పెదగుమ్ములూరు పరిధిలో ఒకటి, గుడివాడలో ఒకటి, పెదఉప్పలంలో ఒకటి.. మొత్తం ఏడు మద్యం షాపులు ఉన్నాయి. వాస్తవానికి ప్రభుత్వం పర్మిట్ గదులకు అనుమతి ఇస్తే వాటిలో మద్యం తాగవచ్చు. కానీ మద్యం షాపుల వద్ద బహిరంగంగా మద్యం సేవించడం నిబంధనలకు విరుద్ధం. నిబంధనలను అతిక్రమించే షాపులపై చర్యలు తీసుకునే అధికారం ఎక్సైజ్ పోలీసులకు ఉంది. అలాగే బెల్టు షాపులు నిర్వహించకుండా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవచ్చు. కానీ మండలంలో ఇవేవీ అమలు కావడం లేదు.
షెడ్లు, టెంట్లు ఏర్పాటు చేసి మరీ...
అడ్డరోడ్డు తిమ్మాపురం, పెదగుమ్ములూరు, గుడివాడ, పెదఉప్పలం, ధర్మవరం అగ్రహారం, ఎస్.రాయవరం గ్రామాల్లో ఉన్న ఏడు మద్యం షాపులు ప్రధాన రహదారుల పక్కనే ఉండడంతో వాటి పక్కనే షెడ్లు, టెంట్లు, బడ్డీలను షాపుల నిర్వాహకులు ఏర్పాటు చేశారు. దీంతో మందుబాబులు బహిరంగంగానే మద్యం సేవిస్తున్నారు. దీని వలన అటుగా వెళ్లే మహిళలు, బాలలు ఇబ్బంది పడుతున్నారు. అంతే కాకుండా అన్ని గ్రామాల్లో బెల్టు షాపులను దర్జాగా నిర్వహిస్తున్నారు. గెడ్డపాలెం గ్రామంలో రూ.4 లక్షలు, గోకులపాడులో రూ.4.7 లక్షలు, పెట్టిగోళ్లపల్లిలో రూ.2.8 లక్షలకు బెల్టు షాపులు నిర్వహించుకునేలా బహిరంగ వేలం పాటలు నిర్వహించినట్టు తెలిసింది. మద్యం షాపుల వ్యాపారులు బెల్టు షాపుల నిర్వాహకులకు సీసాపై రూ.20 పెంచి అమ్మితే, వారు ఎంఆర్‌పీపై రూ.50లు పెంచి మందుబాబులకు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా మండలంలోని పలు దాబాల్లో కూడా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ విషయాన్ని పాయకరావుపేట ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా, బహిరంగంగా ఎవరైనా మద్యం సేవిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఎంఆర్‌పీ కన్నా అధిక ధరకు మద్యం విక్రయిస్తే మద్యం షాపులపై కేసులు నమోదు చేస్తామన్నారు.