ప్లాట్లు కొట్టేస్తున్నారు!
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:50 AM
ఉక్కు నిర్వాసిత కాలనీల్లో ఖాళీగా ఉన్న స్థలాలను కొందరు కబ్జా చేస్తున్నారు.
ఉక్కు నిర్వాసిత కాలనీల్లో స్థలాల కబ్జా
తప్పుడు డాక్యుమెంట్లతో విక్రయం
ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఉక్కు భూ సేకరణ విభాగం
విశాఖపట్నం/గాజువాక, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి):
ఉక్కు నిర్వాసిత కాలనీల్లో ఖాళీగా ఉన్న స్థలాలను కొందరు కబ్జా చేస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి జీవీఎంసీ నుంచి ప్లాన్ అప్రూవల్ తీసుకుంటున్నారు. వడ్లపూడి నిర్వాసిత కాలనీలోని సర్వే నంబరు 13లో రమాదేవి మహిళా మండలికి ఉపాధి కార్యక్రమాల నిర్వహణకుగాను ఉక్కు భూసేకరణ అధికారులు స్థలం కేటాయించారు. ఇందులో కమ్యూనిటీ హాలు నిర్మించగా, మిగిలినది ఖాళీగా ఉంది. ఉత్తరంగా రోడ్డు, దానికి ఆనుకుని పార్కింగ్, ఇతర అవసరాలకు కొంత స్థలాన్ని విడిచిపెట్టారు. అయితే స్థానికంగా కొందరు నకిలీపత్రాలు సృష్టించి ఆ స్థలం కబ్జా చేశారు. మూడు ప్లాట్లు వేసి విక్రయించేశారు. అధికారులను నమ్మించేందుకు ఓ మహిళ పేరిట నకిలీ పట్టా సృష్టించారు.
ఉక్కు కాలనీలు ఏర్పాటైన తరువాత నిర్వాసితుల కుటుంబంలో ఒకరికే స్థలం ఇచ్చారు. అయితే నకిలీపత్రాలు సృష్టించిన వ్యక్తికి ఒకేచోట మూడు ప్లాట్లు ఎలా కేటాయించారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీపత్రాలతో విక్రయించిన ప్లాట్ల నంబర్లు ఇంకో చోట ఉన్నట్టు చెబుతున్నారు. ఈ వ్యవహారం వెనుక రిటైర్డు పోలీస్ కానిస్టేబుల్ హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. గతంలో వడ్లపూడిలో మూడెకరాల భూమి కబ్జాకు స్కెచ్ వేసి బెడిసికొట్టడంతో వెనకడుగు వేసిన మాజీ కానిస్టేబుల్, ఈ ప్రాంతంలో పలు కబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. పోలీసులు, రెవెన్యూ, జీవీఎంసీ, ఉక్కు భూసేకరణ విభాగంలో పలువురిని మేనేజ్ చేసి సర్వే నంబరు 13లో మూడు చోట్ల నిర్మాణాలు చేపట్టారని చెబుతున్నారు.
ఫిర్యాదు చేసినా...
అక్రమ నిర్మాణంపై రమాదేవి మహిళా సంఘం ప్రతినిధులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని వాపోతున్నారు. దీనిపై 87వ వార్డు కార్పొరేటర్ బొండా జగన్ మూడు నెలల క్రితం కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. రమాబాయి మహిళా మండలికి కేటాయించిన స్థలంలో రోడ్డు, దానికి ఆనుకుని స్థానికుల అవసరాలకు ఇచ్చిన స్థలానికి కొంతమంది తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి చేపట్టిన నిర్మాణాలు నిలుపుదల చేయాలని కోరారు. అయినప్పటికీ అధికారులెవరూ స్పందించలేదు.
తప్పులపైనా చర్యల్లేవ్
ఇదిలావుండగా వడ్లపూడి సెక్టార్-1లో నిర్వాసితుడు (ఆర్ నంబరు 767)కి ఇవ్వాల్సిన ప్లాటు నంబరు కాకుండా 680 మంజూరుచేస్తూ గతంలో ఉక్కు భూ సేకరణ విభాగం అధికారులు ఎండార్స్‌మెంట్ ఇచ్చారు. రికార్డుల్లో నిర్వాసితుడికి 1559 ప్లాటు కేటాయించినట్టు నమోదుచేసిన అధికారులు క్షేత్రస్థాయిలో 680 ప్లాటు ఇచ్చారు. దీనిపై ఎన్ని వినతులు ఇచ్చినా సమస్య పరిష్కరించలేదు. నిర్వాసిత కాలనీల్లో ప్లాట్లు కబ్జాకు నకిలీపత్రాలు సృష్టిస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చినా సంబంధిత భూసేకరణ విభాగం స్పందించడం లేదనే వాదన వినిపిస్తోంది. గాజువాక పరిధిలో నిర్వాసిత కాలనీల్లో ప్లాట్లు, సామాజిక అవసరాలకు గుర్తించిన స్థలాలపై సర్వే చేసి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.