- సర్టిఫికెట్‌కు రూ.15 వేలు నుంచి రూ.20 వేల వరకూ వసూలు చేస్తున్నట్టు ప్రచారం
ABN , Publish Date - Jul 14 , 2025 | 01:06 AM
గత వైసీపీ ప్రభుత్వంలో చోటా నాయకులు గ్రామాల్లో విచ్చలవిడిగా కొందరికి సదరం సర్టిఫికెట్లు ఇప్పించి దివ్యాంగ పింఛన్లు మంజూరు చేయించారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం బోగస్ పింఛన్లను ఏరివేయాలని నిర్ణయించి సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయిస్తోంది. దీనిని దళారులు తమకు అనుకూలంగా మార్చుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. అనకాపల్లి కేంద్రంగా ఈ దందా కొనసాగుతోంది.
- వైకల్యం లేకున్నా ఉన్నట్టుగా ధ్రువీకరణ
- అనకాపల్లి కేంద్రంగా వ్యవహారం
- బోగస్ దివ్యాంగ పింఛన్లను ఏరివేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు
చోడవరం, జూలై 13(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో చోటా నాయకులు గ్రామాల్లో విచ్చలవిడిగా కొందరికి సదరం సర్టిఫికెట్లు ఇప్పించి దివ్యాంగ పింఛన్లు మంజూరు చేయించారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం బోగస్ పింఛన్లను ఏరివేయాలని నిర్ణయించి సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయిస్తోంది. దీనిని దళారులు తమకు అనుకూలంగా మార్చుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. అనకాపల్లి కేంద్రంగా ఈ దందా కొనసాగుతోంది.
ఎటువంటి శారీరక, మానసిక లోపం లేకపోయినా గత వైసీపీ ప్రభుత్వంలో కొందరికి చోటా నాయకులు డాక్టర్లపై ఒత్తిడి తెచ్చి సదరం సర్టిఫికెట్లను ఇప్పించారు. నకిలీ దివ్యాంగ పింఛనుదారులను గుర్తించి వారి సర్టిఫికెట్లను రద్దు చేయాలని గతంలోనే దివ్యాంగుల సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం బోగస్ దివ్యాంగ పింఛనుదారుల ఏరివేత కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా సదరం శిబిరాలను నిర్వహించి సదరం సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టింది. దివ్యాంగుల వైకల్యం నిర్ధారించేందుకు గ్రామ పంచాయతీల వారీగా పింఛనుదారులను ఆస్పత్రికి పిలిచి సంబంధిత వైద్య నిపుణులతో మరోసారి తనిఖీలు నిర్వహిస్తోంది. ఇదే అదునుగా దళారులు రంగ ప్రవేశం చేశారు. సదరం సర్టిఫికెట్లకు ఆమోద ముద్ర వేయిస్తామని బోగస్ దివ్యాంగ పింఛనుదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.
అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో తంతు
అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరం శిబిరాల్లో దళారుల ప్రమేయం పెరిగిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల చోడవరం మండలంలోని రెండు పంచాయతీలకు నిర్వహించిన వెరిఫికేషన్ కార్యక్రమంలో దళారుల ద్వారా డాక్టర్లకు ముడుపులు ఇచ్చి కొందరు బోగస్ వైకల్యం సర్టిఫికెట్ తెచ్చుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.15 వేలు నుంచి రూ.20 వేలు వరకూ వసూలు చేస్తున్నట్టు సమాచారం. నిజమైన దివ్యాంగులు కూడా తమ సర్టిఫికెట్లు ఎక్కడ రద్దవుతాయోనన్న భయంతో దళారులకు ముడుపులు చెల్లించుకుంటున్నారని తెలిసింది. సదరం సర్టిఫికెట్ల పరిశీలన ప్రహాసనం గా మారిందని, దీనిపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని స్థానిక ప్రజాప్రతినిధులు అంటున్నారు.