గ్రావెల్ అక్రమ తవ్వకాలకు అడ్డే లేదు
ABN , Publish Date - Jul 14 , 2025 | 12:59 AM
మండలంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలకు అడ్డే లేకుండా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో చెలరేగిపోయిన అక్రమార్కులు కూటమి ప్రభుత్వం వచ్చినా తగ్గడం లేదు. ఇటీవల అంతకాపల్లి, గాలిభీమవరం గ్రామాల పరిధిలో యథేచ్ఛగా రేయింబవళ్లు గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
- గత వైసీపీ ప్రభుత్వంలో చెలరేగిపోయిన అక్రమార్కులు
- కూటమి ప్రభుత్వం వచ్చినా మార్పు లేదు
- యథేచ్ఛగా తవ్వి తరలించేస్తున్నా పట్టించుకోని అధికారులు
సబ్బవరం, జూలై 13(ఆంధ్రజ్యోతి): మండలంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలకు అడ్డే లేకుండా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో చెలరేగిపోయిన అక్రమార్కులు కూటమి ప్రభుత్వం వచ్చినా తగ్గడం లేదు. ఇటీవల అంతకాపల్లి, గాలిభీమవరం గ్రామాల పరిధిలో యథేచ్ఛగా రేయింబవళ్లు గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
మండలంలోని అంతకాపల్లి, గాలిభీమవరం గ్రామాల పరిధిలో ఇటీవల గ్రావెల్ అక్రమ తవ్వకాలు పెరిగిపోయాయి. గాలిభీమవరం సర్వే నంబరు 134లో ములకల కొండ ఉంది. ఈ కొండ చుట్టూ గతంలో జగనన్న కాలనీకి ఇళ్లు మంజూరు చేశారు. అప్పటి నుంచి కొండ చుట్టూ తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అక్రమార్కులకు అడ్డుకట్ట పడుతుందని అందరూ ఆశించారు. అయితే ఏమాత్రం మార్పు లేదు. ఇటీవల కొండకు దక్షిణ భాగంలో కొండవాలు ప్రాంతాన్ని కలుపుకొని రైల్వే లైన్‌కు గతంలో స్థలం కేటాయించారు. ఆ స్థలంలో కూడా గ్రావెల్ తవ్వేశారు. అక్కడ ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో కూడా అక్రమార్కులు గ్రావెల్‌ను తవ్వుకుపోయారు. అసకపల్లి, గాలిభీమవరం, దేవీపురం, అంతకాపల్లి, గ్లొలపాలెం, రాయపుఅగ్రహారం, పైడివాడ అగ్రహారం, గుల్లేపల్లి, ఎల్లుప్పి, తదితర గ్రామాల్లో మట్టి, గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి.
ఇళ్ల బేస్‌మెంట్ల వరకు తవ్వకాలు
గత వారం రోజులు నుంచి నంగినారపాడు రెవెన్యూ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీ(జగనన్న కాలనీ) లేఅవుట్‌ను ధ్వంసం చేసి మట్టిని తరలించేస్తున్నారు. దీంతో గతంలో ఇళ్ల నిర్మాణానికి ఏర్పాటు చేసిన బేస్‌మెంట్లు గాల్లో వేలాడుతున్నాయి. అక్కడ ఇళ్ల నిర్మాణానికి పనికి రాకుండా చేసేశారు. దాదాపు 20 నుంచి 30 ప్లాట్ల బేస్‌మెంట్లు ఇదే పరిస్థితిలో ఉన్నాయి.
అంతకాపల్లి రెవెన్యూ పరిధిలో..
అంతకాపల్లి రెవెన్యూ పరిధి ఒమ్మవానిపాలెం సమీపంలో ప్రభుత్వ భూమిలో పట్టపగలే ఎక్స్‌కవేటర్లతో గ్రావెల్‌ను అక్రమంగా తవ్వేస్తున్నారు. ఈ గ్రావెల్‌ను కోటపాడు రోడ్డు నుంచి అయ్యన్నపాలెం, గుల్లేపల్లి మీదుగా తరలించేస్తున్నారు. ఇటీవల అధికారులు అసకపల్లిలో కట్టడి చేస్తే దేవీపురంలో తవ్వకాలు మొదలు పెట్టారు. దేవీపురం నుంచి బలిజపాలెం మీదుగా గ్రావెల్ తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. డిమాండ్, దూరాన్ని బట్టి డంపర్ గ్రావెల్‌ను రూ.6 నుంచి రూ.8 వేలకు విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గట్టి నిఘా పెట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.