Share News

దేవుడి మాన్యాలకు రక్షణ కరువు!

ABN , Publish Date - Sep 02 , 2025 | 01:26 AM

జిల్లాలో ఆలయాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి.

దేవుడి మాన్యాలకు రక్షణ కరువు!

జిల్లాలో 3,008 ఎకరాల దేవదాయ శాఖ భూములు అన్యాక్రాంతం

నకిలీ పత్రాలతో పాగా వేస్తున్న అక్రమార్కులు

మొక్కుబడి చర్యలతో దేవదాయ శాఖ కాలక్షేపం

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఆలయాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. రాజకీయ నాయకుల అండదండలతో తమ పలుకుబడి ఉపయోగించి భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. ఆలయాల భూములకు సంబంధించిన రికార్డులను తారుమారు చేస్తూ ఆయా భూముల్లో పాగా వేస్తున్నారు. నకిలీ పత్రాలను సృష్టించి ఆలయ భూములకు నిజమైన హక్కుదారులం తామే అంటూ కోర్టులను ఆశ్రయించి సొంతం చేసుకొనే ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరికొందరు కబ్జాదారులు ఆలయాల భూములకు తమ పేరున నకిలీ రికార్డులు సృష్టించి బయట వ్యక్తులకు అమ్ముకుంటున్నారు.

జిల్లాలో దేవదాయ శాఖ పరిధిలో చిన్నా, పెద్ద ఆలయాలు కలిపి మొత్తం 720 ఉండగా వీటికి సంబంధించి 287 గ్రామాల్లో 5,746 ఎకరాల భూములు ఉన్నాయి. అనకాపల్లి, ఎలమంచిలి, మాడుగుల, దేవరాపల్లి, మునగపాక, నక్కపల్లి మండలాల్లో దేవదాయ శాఖకు ఎక్కువ భూములు ఉన్నాయి. దేవదాయ శాఖ రికార్డుల ప్రకారం జిల్లాలో 3,008 ఎకరాలు అన్యాక్రాంతం అయినట్టు ఫిర్యాదులు నమోదయ్యాయి. సుమారు 1,350 ఎకరాలను కౌలుకు ఇచ్చినట్టుచెబుతున్నారు. మాడుగులలో పలు దేవాలయాలకు వందలాది ఎకరాల భూములు ఉన్నట్టు రికార్డులు చూపుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఈ భూములు అన్యాక్రాంతం అయినట్టు ఇటీవల వెలుగులోకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దేవదాయ శాఖకు చెందిన సుమారు 200 ఎకరాలకు సంబంధించి ఆక్రమణదారులకు దొడ్డిదారిన పట్టాలు జారీ చేశారు. దీనిపై కొందరు కూటమి నేతలు ఫిర్యాదు చేయడంతో విచారణ జరుగుతున్నది.

అనకాపల్లి మండలం సత్యనారాయణపురం సర్వే నంబర్‌ 633/2 లో ఒక ఎకరా 94 సెంట్లు, సర్వే నంబరు 633/3లో ఐదు ఎకరాల 23 సెంట్ల ఆలయ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో బోర్డు ఏర్పాటు చేశారు. అనకాపల్లి పట్టణంలోని ఎన్టీఆర్‌ ఆస్పత్రికి సమీపంలో పూల్‌బాగ్‌ సర్వే నంబర్‌ 66లో 29 ఎకరాల 79 సెంట్ల భూమి విశాఖపట్నంలోని అంబికా బాగ్‌ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి 1957లో చెముడు ఎస్టేట్‌ మహారాణి వైరిచర్ల చంద్రమణి దానం చేశారు. కోట్లాది రూపాయల విలువ చేసే ఈ భూములను గతంలో కౌలుకు తీసుకున్న వ్యక్తులు సొంతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ భూములపై స్థానికులు కొందరు ఇనాం కోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిపై దేవదాయ శాఖ కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో స్టేటస్‌కో ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయినప్పటికీ ఆక్రమణదారులు ఆ భూమిలోకి చొరబడే ప్రయత్నాలు చేస్తుండడంతో దేవదాయ శాఖ అధికారులు, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

దేవరాపల్లి మండలం మారేపల్లిలో దేవదాయ శాఖకు చెందిన 23 ఎకరాల 15 సెంట్ల భూమిని కొందరు నకిలీ పత్రాలు సృష్టించి, ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి విక్రయించారు. సదరు వ్యాపారి ఈ భూముల్లో లేఅవుట్‌ వేసి, ప్లాట్‌లు అమ్ముకోగా, సీపీఎం నాయకులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో న్యాయస్థానం స్టేటస్‌కో ఉత్తర్వులు జారీ చేసింది. రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో దేవదాయ శాఖకు చెందిన భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఆలయ భూములను స్థానిక నేత ఒకరు, ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు అమ్మేయడంపై ఫిర్యాదులు అందడంతో విచారణ జరుగుతున్నది.

పట్టించుకోని అధికారులు

అనకాపల్లి జిల్లాలో దేవదాయ శాఖకు వేల ఎకరాల భూములు వున్నాయి. కోట్లా రూపాయల విలువ చేసే ఈ భూముల పరిరక్షణను ఆ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భూములకు సంబంధించి సరైన రికార్డులు లేకపోవడం కబ్జాదారులకు వరంగా మారుతున్నది. ఆలయాల భూముల పరిరక్షణకు ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. నిబంధనల ప్రకారం ఆలయ భూములను కౌలుకు తీసుకున్న వ్యక్తులు, గడువు తీరిన తరువాత భూములను ఖాళీ చేసి అధికారులకు అప్పగించాలి. లేనిపక్షంలో సెక్షన్‌ 83 ప్రకారం ఆయా రైతులకు నోటీసులు జారీచేసి భూములను స్వాధీనం చేసుకోవాలి. కానీ అన్యాక్రాంతమైన ఆలయాల భూముల వద్ద అధికారులు మొక్కుబడిగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు.

ఫిర్యాదులపై స్పందిస్తున్నాం

కేఎల్‌ సుధారాణి, దేవదాయ శాఖ జిల్లా అధికారిణి

ఆలయాల భూముల అన్యాక్రాంతం అయినట్టు ఫిర్యాదులు అందిన వెంటనే స్పందిస్తున్నాం. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ భూముల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నాం. మాడుగులలో ఆలయ భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేశారన్న ఫిర్యాదులతపై విచారణ జరుగుతున్నది. దేవదాయ శాఖ భూములకు రెవెన్యూ హక్కులు ఇవ్వడానికి అవకాశం లేదు. ఆలయాల భూముల విషయంలో ప్రస్తుతం కోర్టుల్లో 11 కేసులు నడుస్తున్నాయి.

Updated Date - Sep 02 , 2025 | 01:26 AM