Share News

పేదల కాలనీల్లో ప్లానింగ్‌ నిల్‌!

ABN , Publish Date - Jul 23 , 2025 | 01:05 AM

పేదలందరికీ ఇళ్లు అంటూ జగన్‌ ప్రభుత్వం సెంటు భూమిలో చేపట్టిన గృహ నిర్మాణం ఎందుకూ కొరగాని విధంగా తయారైంది.

పేదల కాలనీల్లో ప్లానింగ్‌ నిల్‌!

  • కానరాని మౌలిక సదుపాయాలు

  • తాగునీరు, కాలువలు, రహదారులు, విద్యుత్‌ కనెక్షన్లపై ప్రణాళిక శూన్యం

  • ముందు వెనుకా చూడకుండా ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన వైసీపీ ప్రభుత్వం

  • ఇప్పుడు అన్ని శాఖలను సమన్వయం చేసేందుకు కూటమి ప్రభుత్వం యత్నం

  • సామాజిక అవసరాలకు కనిపించని భూ కేటాయింపులు

  • నగరానికి 30, 40 కిలోమీటర్ల దూరంలో ఇళ్లు

  • దాంతో అక్కడ ఉండేందుకు ఆసక్తి చూపని అత్యధికులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పేదలందరికీ ఇళ్లు అంటూ జగన్‌ ప్రభుత్వం సెంటు భూమిలో చేపట్టిన గృహ నిర్మాణం ఎందుకూ కొరగాని విధంగా తయారైంది. ముందస్తు ప్రణాళిక లేకుండా వేలాది ఎకరాల్లో వేసిన లేఅవుట్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఏదోవిధంగా కూటమి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నా వాటికి మౌలిక వసతులు కల్పించడం పెద్ద సవాల్‌గా మారింది. కనీస అవసరాల గురించి ఆలోచించకుండా చేపట్టిన ఈ ఇళ్లల్లో ఉండేందుకు అత్యధికులు ఆసక్తి చూపడం లేదు.

విశాఖపట్నం జిల్లాలో లక్ష మంది పేదలకు సెంటు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం దాదాపు 5,500 ఎకరాలను సమీకరించింది. శివారు ప్రాంతాలైన పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం తదితర మండలాల్లో తోటలను తొలగించి, కొండలను కొట్టి 65 లేఅవుట్లను వేసింది. వాటిలో అతి పెద్ద లేఅవుట్లు భీమిలి నియోజకవర్గంలో ఉన్నాయి. హనుమంతవాక జంక్షన్‌ నుంచి 42 కి.మీ. దూరానున్న ఆనందపురం మండలం తంగేడుబిల్లిలో 700 ఎకరాల్లో ఒకేచోట 16 వేల ఇళ్లు నిర్మాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు. విశాఖ నుంచి 55 కి.మీ. దూరానున్న పద్మనాభం మండలం నరసాపురంలో ఎనిమిది వేల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. విశాఖ నుంచి 35 కి.మీ. దూరానున్న సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో 11 వేల ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఇలా అనేక లేఅవుట్లు వేశారు.

పేదలకు గృహ నిర్మాణ పథకాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం వ్యాపారంగానే పరిగణించింది. ఇళ్ల నిర్మాణ బాధ్యతలను ఆ పార్టీకి చెందిన వారికే అప్పగించింది. దాంతో నాణ్యత లేకుండా పోయింది. చాలా లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి వేసిన పునాదుల కింద నుంచి అప్పట్లో వర్షంనీరు ప్రవహించింది. పునాదులు గాలిలో వేలాడాయి. వాటిపైనే నిర్మాణాలు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని పూర్తిచేసి పేదలకు అందించే బాధ్యతను తీసుకుంది. పథకం పేరును ‘ఎన్‌టీఆర్‌ హౌసింగ్‌-పేదలందరికీ ఇళ్లు..పీఎంఏవై’ అని మార్చింది.

లేఅవుట్లలో కేటాయింపులు ఏవి?

ఎవరైనా లేఅవుట్‌ వేస్తే అందులో సామాజిక అవసరాలకు అవసరమైన భూములు కేటాయించాలని వీఎంఆర్‌డీఏ చెబుతుంది. అంటే విద్యాలయాలు, ఆస్పత్రులు, గ్రంథాలయాలు, కళ్యాణ మండపాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు...ఇలా అందరికీ ఉపయోగపడే వాటి కోసం తగిన భూములు మార్కింగ్‌ చేయాలి. సెంటు ఇళ్ల కాలనీల లేఅవుట్లను వీఎంఆర్‌డీఏనే స్వయంగా వేసింది. కానీ అందులో ‘సామాజిక అవసరాలు’ అంటూ కొద్దిగా ఖాళీ స్థలాలు చూపించిందే తప్ప ఎక్కడెక్కడ ఏమి రానున్నాయో?...స్పష్టంగా పేర్కొనలేదు.

ఏ బాధ్యత ఎవరిదనేది దానిపై కనీస చర్చ శూన్యం

ఇళ్ల నిర్మాణం పూర్తిచేసిన తరువాత ఆ కాలనీలకు రహదారులు, తాగునీరు, మురుగునీటి కాలువలు, విద్యుత్‌ సదుపాయం వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంది. ఒక్కో కాలనీలో పెద్ద పంచాయతీ, ఒక మోస్తరు మునిసిపాలిటీ ఉన్నంత జనాభా ఉంటారు. ఎటువంటి మౌలిక వసతులు లేకుండా లబ్ధిదారులకు అక్కడకు వెళ్లి ఉండాలంటే చాలా కష్టం. తాగునీటికి ఏ శాఖ నుంచి నిధులు వెచ్చించాలి?, ఎవరు బాధ్యత తీసుకోవాలనే దానిపై జగన్‌ సీఎంగా ఒక్క రోజు కూడా చర్చించలేదు. అధికారులు కూడా ఆ విషయం చెప్పలేదు. అలాగే మురుగునీరు పారుదల వ్యవస్థ ఎలా నిర్వహిస్తారో స్పష్టత లేదు. ఇళ్లు మాత్రం కట్టి ఇస్తామని గృహ నిర్మాణ శాఖ చెబుతోంది. మిగిలినవి కలెక్టర్‌తో మాట్లాడి లైన్‌ డిపార్టుమెంట్లతో చేయించాల్సి ఉంటుందని అంటున్నారు. జ్వరం వస్తే మందు వేసే దిక్కులేని చోట ఎలా ఉండగలమని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. మౌలిక వసతుల కోసం కూటమి ప్రభుత్వం పెద్ద కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవన్నీ సమకూరిస్తే తప్ప లబ్ధిదారులు అక్కడకు వెళ్లే అవకాశం లేదు. ఈ పనులు ఎంత వేగంగా చేపడతారనే దానిపైనే ఎన్‌టీఆర్‌ కాలనీల గృహ ప్రవేశాలు ఆధారపడి ఉన్నాయి.

రాకపోకలకు నెలకు రూ.6 వేల ఖర్చు

పేదలకు ఇళ్లు నిర్మించేందుకు నగరంలో భూములు లేకపోవడం వల్ల శివారుల్లో కాలనీలు నిర్మించారు. ఇవి సగటున నగరానికి 30 కి.మీ. దూరాన ఉన్నాయి. అక్కడికి వెళ్లి రావడానికి సరైన ప్రజా రవాణా వ్యవస్థలు లేవు. పేదలు అక్కడి నుంచి రోజూ నగరంలోకి పనుల కోసం వచ్చి వెళ్లాలంటే మనిషికి రూ.200 ఖర్చు అవుతుంది. అంటే నెలకు రూ.6 వేలు. అదే భార్యాభర్తలు ఇద్దరూ పనులు చేసుకునేవారైతే వారికి నెలకు రూ.12 వేలు ఆటో చార్జీలకే అవుతుంది. దానికి బదులు రూ.6 వేలు పెట్టి నగరంలోనే ఇల్లు అద్దెకు తీసుకుంటే వారికి ఇంకో రూ.6 వేలు మిగులుతుంది. రానుపోను సమయం మిగులుతుంది. పిల్లలకు చదువులకు సౌకర్యంగా ఉంటుంది. అందుకని అత్యధికులు అక్కడికి వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు.

Updated Date - Jul 23 , 2025 | 01:05 AM