డెక్‌కు బోలెడు డిమాండ్
ABN , Publish Date - Sep 14 , 2025 | 01:12 AM
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) విశాఖ మహా నగరాభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) సిరిపురం జంక్షన్‌లో నిర్మించిన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ భవనం (ది డెక్)లో కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన స్పేస్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది.
అందులో స్పేస్ కోసం పోటాపోటీ
ఖాళీగా ఉన్న ఒక్క ఫ్లోర్‌కు రంగంలో మూడు సంస్థలు...
అమరావతి నుంచి సిఫారసులు
19న వేలం నిర్వహించాలని వీఎంఆర్‌డీఏ నిర్ణయం
ఎవరు ఎక్కువ ఇస్తే వారికే దక్కే అవకాశం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖ మహా నగరాభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) సిరిపురం జంక్షన్‌లో నిర్మించిన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ భవనం (ది డెక్)లో కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన స్పేస్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఆఫీస్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలంటూ పలు పేరొందిన సంస్థలు సీఎం పేషీ నుంచి రికమెండేషన్ చేయించుకుంటున్నాయి. అయితే ఉన్నది ఒక్కటే ఫ్లోర్ కావడం, దానికి తీవ్రమైన పోటీ ఏర్పడడంతో అధికారులు చేసేదేమీ లేక బహిరంగ వేలం పెట్టాలని నిర్ణయించారు. ఈ నెల 19న వేలం నిర్వహించి ఎవరు నిబంధనలన్నీ పాటించి, ఎక్కువ మొత్తం ఇవ్వడానికి ముందుకు వస్తారో వారికే ఇవ్వాలని భావిస్తున్నారు. దీనికి 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, వీఎంఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచామని చెబుతున్నారు.
కీలకమైనవన్నీ అక్కడే..
ది డెక్‌ను 12 అంతస్థులుగా నిర్మించారు. కింద మూడు బేస్‌మెంట్లు, గ్రౌండ్ ఫ్లోర్, ఏడు అంతస్థులు, టెర్రస్ కలిపి మొత్తం పన్నెండు ఉన్నాయి. బేస్‌మెంట్‌తో పాటు పైన రెండో అంతస్థును పార్కింగ్‌కు కేటాయించారు. వాటిలో 440 కార్లు, 250 ద్విచక్ర వాహనాలు పెట్టుకోవచ్చు. మూడో అంతస్థును జార్జియా యూనివర్సిటీ తీసుకుంది. అదే అంతస్థులో డెక్ ఉంది. దానిని కూడా యూనివర్సిటీ కోసమే తీసుకున్నారు. నాలుగో అంతస్థును బెల్ సంస్థ ఐటీ కార్యాలయం కోసం ఒప్పందం చేసుకుంది. ఐదో అంతస్థులో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేశారు. ఆరు, ఏడు అంతస్థులను దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎం కార్యాలయం కోసం కేటాయించారు.
ఖాళీగా ఉన్నది ఒకటే ఫ్లోర్
ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ 28,993 చ.అ. విస్తీర్ణం ఖాళీగా ఉంది. అదేవిధంగా ఏడో అంతస్థులో టెర్రస్ ఇంకా ఎవరికీ ఇవ్వలేదు. అక్కడ రెస్టారెంట్‌కు ఇవ్వాలనేది ఆలోచన. ఇక మిగిలిన ఒకే ఒక ఫ్లోర్‌ను నక్కపల్లిలో స్టీల్‌ప్లాంటును ఏర్పాటుచేస్తున్న ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ తమ కార్యాలయం కోసం ఇవ్వాలని కోరింది. తమకు కావాలని బెంగళూరుకు చెందిన డిజిటల్ సొల్యూషన్స్ ఐటీ కంపెనీ కోవలెన్స్ అమరావతి నుంచి చెప్పించింది. అదేవిధంగా మరో ఫార్మా కంపెనీ కూడా అదే ఫ్లోర్ కావాలని రికమెండేషన్ చేయించుకుంది. ఒకరికి ఇస్తే మిగిలిన ఇద్దరికి మొండి చేయి చూపించినట్టవుతుందని, బహిరంగ వేలం నిర్వహిస్తామని, ఎవరికి కావాలంటే వారు పాడుకోవాలని వీఎంఆర్‌డీఏ తేల్చి చెప్పింది. ఈ నెల 19న ఖరారవుతుంది.