Share News

ప్రతి చోటా లెక్కలేనితనమే...!

ABN , Publish Date - Dec 29 , 2025 | 12:37 AM

నగరంలో గాలినాణ్యత క్షీణతకు కారణాలపై కాలుష్యనియంత్రణమండలి అధికారుల చేపట్టిన తనిఖీల్లో అనేక ఉల్లంఘనలు వెలుగులోకి వస్తున్నాయి.

ప్రతి చోటా  లెక్కలేనితనమే...!

  • కాలుష్య నియంత్రణలో అన్ని ప్రమాణాలకు పాతర

  • విశాఖ పోర్టులో ఎటుచూసినా ధూళి కాలుష్యం

  • కోరమాండల్‌లో ఆరు లక్షలకు చేరిన జిప్సమ్‌ నిల్వ

  • హిందూజాలో ఉక్కిరిబిక్కిరిగా బొగ్గు కాలుష్యం

  • కాలుష్య నియంత్రణ మండలి అధికారుల తనిఖీల్లో వెల్లడైన ఉల్లంఘనలు

విశాఖపట్నం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి):

నగరంలో గాలినాణ్యత క్షీణతకు కారణాలపై కాలుష్యనియంత్రణమండలి అధికారుల చేపట్టిన తనిఖీల్లో అనేక ఉల్లంఘనలు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖ పోర్టు, దానికి అనుబంధంగా ఉన్న కార్గోహ్యాండ్లింగ్‌ యూనిట్లలో పలుచోట్ల కనీస ప్రమాణాలు పాటించడంలేదని గుర్తించారు. బొగ్గు, ఇతర సరుకుల గుట్టలపై టార్పాలిన్లు కప్పి ధూళి ఎగరకుండా చూడాల్సిన సంస్థలు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్టు తేలింది. గాలి నాణ్యత క్షీణతకు కారమైన ధూళి కాలుష్యం అరికట్టడంలో లెక్కలేని తనం కనిపిస్తోందనే ఆరోపణలు నిజమేనని తేలింది.

విశాఖ పోర్టు, అనుబంధ సంస్థలు, హెచ్‌పీసీఎల్‌, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌, అదానీ గంగవరం, విశాఖ ఉక్కు కర్మాగారం, హిందూజా పవర్‌ ప్లాంట్లలో ఉల్లంఘనలను గుర్తించిన అధికారులు ఇప్పటివరకు ఐదు సంస్థలకు నోటీసులు ఇచ్చారు. సోమ, మంగళవారాలు మరో రెండుమూడు సంస్థలకు నోటీసులు ఇవ్వనున్నారు. వారం రోజులుగా చేపడుతున్న తనిఖీల్లో గుర్తించిన అంశాల్లో కొన్ని..

విశాఖ పోర్టులోని రోస్‌హిల్స్‌ ఎదురుగా యార్డులో బొగ్గు నిల్వలపై కొన్నింటికి టార్పాలిన్లు కప్పారు. కొన్నింటిని విడిచిపెట్టడంతో రోస్‌హిల్స్‌పై చర్చి, మసీదు, గుడి పరిసరాలు నల్లగామారాయి. యార్డుకు ఆనుకున్న ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వీజీసీడీ బెర్తు ఏరియాలో ఇనుము గనుల నిల్వలపై టార్పాలిన్ల రక్షణ లేదు. స్టాకు యార్డులో ధూళి కమ్మేసింది. వైజాగ్‌ సీపోర్టు, రెయిన్‌ సీఐఐ కార్బన్‌ వైజాగ్‌ లిమిటెడ్‌ కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోలేదు. పోర్టు పరిఽధిలో ఎక్కువ కాలుష్యం వెలువడడంతో నగరంలో గాలి నాణ్యతపై తీవ్ర ప్రభావం పడిందని తనిఖీల్లో తేలింది. అయితే విశాఖ పోర్టులో ఎగుమతి, దిగుమతుల నుంచి కాలుష్యం అరికట్టే కార్యకలాపాల ప్రక్రియను ఆధునికీకరిస్తున్నారు. క్లోజ్డ్‌ షెడ్ల నిర్మాణం, నౌక నుంచి నేరుగా షెడ్లలోకి సరకు దిగుమతయ్యేలా డిజైన్‌ చేశారు. ఒక భారీస్థాయి షెడ్‌ 2026 డిసెంబరు నాటికి అందుబాటులోకి వస్తుందంటున్నారు.

కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌లో ఎరువుల తయారీ నుంచి బైప్రోడక్టుగా వచ్చే జిప్సమ్‌ నిల్వలు ప్రస్తుతం ఆరు లక్షల టన్నులకు చేరింది. పరిమితి ఎత్తువరకు మాత్రమే నిల్వలుండాలి. కానీ అంతకుమించి పేరుకుపోయినట్టు వెల్లడైంది. గతంలో రోడ్లు, సిమెంట్‌ పరిశ్రమలకు జిప్సమ్‌ను వినియోగించేవారు. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ల నుంచి వెలువడే జిప్సమ్‌ మేలు రకం కావడంతో సిమెంట్‌ పరిశ్రమలు కోరమాండల్‌ నుంచి కొనుగోలు తగ్గించారు. ఈ నేపథ్యంలో కంపెనీలోనే జిప్సమ్‌ బోర్డులు తయారుచేయాలని యాజమాన్యం నిర్ణయించింది. అప్పటివరకు నిల్వలు తగ్గించకపోతే కాలుష్యం పెరుగుతుంది.

హిందూజా పవర్‌ప్లాంట్‌లో ధూళి కాలుష్యం తీవ్రత పరిమితి దాటింది. యాష్‌ తరలింపు, బొగ్గు రవాణా వాహనాలు నిబంధనలు పట్టించుకోవడంలేదు. యాష్‌ రవాణా చేస్తున్న సంస్థలు, లారీలపై టార్పాలిన్లు వేయకపోడంతో ధూళి ఆందోళనకర స్థాయికి చేరింది. నియంత్రణపై పీసీబీ హెచ్చరించినా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో రెండు నెలల క్రితం పర్యావరణ పరిహారం చెల్లించాలని నోటీస్‌ ఇచ్చింది. అయినా తీరు మారలేదని గుర్తించారు. దీంతో మరో నోటీస్‌ ఇవ్వాలని నిర్ణయించారు.

Updated Date - Dec 29 , 2025 | 12:37 AM