Share News

కలకలం రేపిన జడ్పీటీసీ హత్యోదంతం

ABN , Publish Date - Oct 22 , 2025 | 12:56 AM

రోలుగుంట మండలం ఎంకే పట్నం పంచాయతీ శివారు ఛటర్జీపురంలో వివాదాస్పద భూములకు సంబంధించి కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజుకు, స్థానిక గిరిజనులకు మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వాస్తవంగా ఈ భూములను స్థానిక గిరిజనులు చాలా ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నారు. సుమారు పదేళ్లపాటు రెవెన్యూ రికార్డుల్లో సాగుదారులుగా వీరి పేర్లే వున్నాయి.

కలకలం రేపిన జడ్పీటీసీ హత్యోదంతం
వివాదాస్పద భూముల్లోని అరటి తోటలో నూకరాజు మృతదేహం

భూ వివాదమే కారణం

ఛటర్జీపురంలో 10.83 ఎకరాలను అనాదిగా సాగు చేసుకుంటున్న గిరిజనులు

రెండు దశాబ్దాల క్రితం తెరపైకి హక్కుదారుల పేర్లు

విశాఖకు చెందిన ముగ్గురికి విక్రయం

ఐదేళ్ల తరువాత మరోసారి చేతులు మారిన భూమి

మరో ఇద్దరితో కలిసి కొనుగోలు చేసిన కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజు

2016లో తహసీల్దారుకు మొరపెట్టుకున్న గిరిజనులు

క్షేత్రస్థాయిలో విచారించి.. సాగుదారులుగా పేర్లు నమోదు

అప్పటి నుంచి గిరిజనులకు, నూకరాజుకు మధ్య గొడవలు

రోలుగుంట/కొయ్యూరు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): రోలుగుంట మండలం ఎంకే పట్నం పంచాయతీ శివారు ఛటర్జీపురంలో వివాదాస్పద భూములకు సంబంధించి కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజుకు, స్థానిక గిరిజనులకు మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వాస్తవంగా ఈ భూములను స్థానిక గిరిజనులు చాలా ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నారు. సుమారు పదేళ్లపాటు రెవెన్యూ రికార్డుల్లో సాగుదారులుగా వీరి పేర్లే వున్నాయి. కానీ రెండేళ్ల క్రితం ఒక రెవెన్యూ అధికారి వీరి పేర్లను రికార్డుల నంచి తొలగించేశారు. అప్పటికే రెండుసార్లు ఈ భూములు చేతులు మారాయి. సుమారు నాలుగేళ్ల నుంచి వారా నూకరాజుకు, స్థానిక సాగుదారులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ తీవ్రమై నూకరాజు హత్యకు దారితీశాయి. వివాదాస్పద భూములకు సంబంధించి ‘ఆంధ్రజ్యోతి’ సేకరించిన సమాచారం మేరకు వివరాలిలా వున్నాయి.

రోలుగుంట మండలం ఎంకేపట్నం రెవెన్యూ పరిధిలోని ఛటర్జీపురం సర్వే నంబరు 139లో సుమారు 30 ఎకరాల భూమి వుంది. ఇది ఎంకేపట్నం గ్రామానికి చెందిన కొత్తరాజుకు చెందినదని స్థానికులు చెబుతున్నారు. ఇందులో 10.83 ఎకరాలను ఛటర్జీపురం గ్రామానికి చెందిన గిరిజనులు చాలా కాలంగా సాగుచేసుకుంటున్నారు. కొత్తరాజుకు సంతానం లేకపోవడంతో ఆయన మేనల్లుళ్లు అయిన చెంచులాడ కృష్ణంరాజు, చెంచులాడ సత్యనారాయణరాజు, చెంచులాడ శివరామరాజు, చెంచులాడ వెంకటరాజు, చెంచులాడ సత్య సింహాద్రి వీర వెంకట రాజులకు చెందేటట్టు వీలునామా రాసినట్టు చెబుతున్నారు. తరువాత 2005లో ఈ ఐదుగురు కలిసి సర్వే నంబరు 139లో గిరిజనుల సాగులో వున్న 10.83 ఎకరాలను విశాఖపట్నానికి చెందిన ఆడారి నాగ అప్పలరాజు, యల్లపు శ్రీనివాసరావు, దాడి వెంకటరమణలకు (డాక్యుమెంట్‌ నంబర్‌ 2980/2005) విక్రయించారు. కానీ కొనుగోలుదారులు భూమిని తమ ఆధీనంలోకి తీసుకోలేదు. స్థానిక గిరిజనులు యథావిధిగా సాగు చేసుకుంటున్నారు.

ఇదిలావుండగా 2015 డిసెంబరు 9వ తేదీన ఆడారి నాగ అప్పలరాజు, యల్లపు శ్రీనివాసరావు, దాడి వెంకటరమణలు ఈ భూమిని వారా నూకరాజు, ఇంజారపు సూర్య ప్రకాశ్‌, మాకిరెడ్డి వెంకట కనకమహాలక్ష్మిలకు (డాక్యుమెంట్‌ నంబరు 5346/2015) విక్రయించారు. ఈ సమయానికి కూడా గిరిజనులు సాగులో వున్నారు. అప్పటికే రెండోసారి చేతులు మారడంతో.. తమకు సాగు హక్కు కల్పించాలంటూ గిరిజనులు రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ, తరచూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 2016లో ఇక్కడ తహశీల్దారుగా పనిచేసిన పెంటకోట అప్పలనాయుడు, వీరి విజ్ఞప్తులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఛటర్జీపురం గిరిజనులే సాగులో వున్నట్టు నిర్ధారించి, వెబ్‌ల్యాండ్‌లో 13వ కాలమ్‌లో వీరి పేర్లు నమోదు చేశారు. దీంతో గిరిజనులు ఆందోళన విరమించారు. కానీ ఈ సమాచారం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి చేరలేదు. కాగా నాలుగేళ్ల క్రితం వారా నూకరాజు, పైల విజయరాణి (జీపీఏ హోల్డర్‌), మాకిరెడ్డి వెంకట కనకమహాలక్ష్మి భూమిని సర్వే నంబర్లు 139, 139/1, 139/2గా సబ్‌డివిజన్‌ చేయించుకున్నారు. తరువాత 04.10.2021న తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన మల్లాది రామరెడ్డికి విక్రయించారు. అనంతరం ఆయన ఈ భూముల్లో వున్న గిరిజనులను తొలగించి, తనకు అప్పగించాలని వారా నూకరాజుపై ఒత్తిడి తెచ్చారు. ఈ సందర్భంగా నూకరాజుకు, సాగుదారులకు మధ్య గొడవ జరిగింది. 2022లో అప్పటి తహశీల్దార్‌ వెంకటేశ్వరరావు వెబ్‌ల్యాండ్‌లో సాగుదారుల కాలమ్‌లో ఉన్న గిరిజనుల పేర్లను తొలగించి, మల్లాది రామిరెడ్డి పేరు చేర్చారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో సొమ్ము చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. మళ్లీ వారా నూకరాజు డాక్యుమెంట్‌ నంబరు 508/2023 ద్వారా 19.01.2023న 4.9 ఎకరాలు, డాక్యుమెంట్‌ నంబరు 509/2023 ద్వారా 4.93 ఎకరాలు.. మొత్తం 9.83 ఎకరాలను మల్లాది రామిరెడ్డి ఉంచి కొనుగోలు చేశాడు. ఒకసారి అమ్మిన భూమిని రెండేళ్లకే తిరిగి వారా నూకరాజు కొనుగోలు చేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది. తాను కొనుగోలు చేసిన భూమిని ఆధీనంలోకి తెచ్చుకోవడానికి నూకరాజు ప్రయత్నించగా.. సాగుదారులు ఎదురుతిరిగారు. తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. తరువాత నూకరాజుకు, సాగుదారులైన గిరిజనులకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భూములను గిరిజనులే సాగు చేసుకుంటున్నారు. నూకరాజు ఈ ఏడాది మార్చిలో నాలుగు ఆటోల్లో 20 మందిని ఛటర్జీపురం తీసుకెళ్లి గిరిజనులు సాగుచేసుకుంటున్న అరటి, జామ, ఇతర పంటలను నరికివేయించాడు. ఈ సందర్భంగా గిరిజనులు దాడి చేయడంతో నూకరాజుకు, ఆయన కుమారుడు కన్నబాబుకు గాయాలయ్యాయి. పోలీసులు అక్కడకు వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు నర్సీపట్నం కోర్టులో నడుస్తున్నది. తరువాత నూకరాజు రెండు, మూడుసార్లు గిరిజనులను బెదిరించడంతో వారు ఈ విషయాన్ని తహశీల్దారు దృష్టికి తీసుకెళ్లారు. ఎవ్వరూ ఆ భూముల్లోకి వెళ్లవద్దని, పంటలను సైతం అలాగే వుంచేయాలని తహశీల్దారు ఆదేశించారు. ఇరువర్గాలను బైండోవర్‌ చేశారు. మరోవైపు నూకరాజు తన భూములను తనకు అప్పగించాలంటూ కలెక్టర్‌, తహశీల్దార్‌కు పలుమార్లు అర్జీలు అందజేశారు. ఈ నేపథ్యంలో సోమవారం నూకరాజు, మరో పది మందితో కలిసి వివాదాస్పద భూముల వద్దకు వెళ్లి, సాగుదారులైన గిరిజనులతో గొడవకు దిగారు. దీంతో వారు ఎదురుదాడి చేసి, తీవ్రంగా గాయపరడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. నూకరాజు పదేళ్ల నుంచి ఏ భూమి కోసం గిరిజనులతో గొడవలు పడుతున్నాడో.. చివరకు అదే భూమిలో ప్రాణాలు వదలడం యాధృచ్ఛికం!

కాగా ఈ భూ వివాదానికి సంబంధించి డిప్యూటీ తహశీల్దార్‌ శివను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. ఇటీవల క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టామని, భూమికి సంబంధించి గిరిజనుల వద్ద ఎటువంటి రికార్డులు లేవని, వారు సాగులో మాత్రమే ఉన్నారని చెప్పారు. 2023లో అప్పటి తహశీల్దార్‌ వెంకటేశ్వరరావు వెబ్‌ల్యాండ్‌లో నుంచి గిరిజనుల పేర్లు తొలగించారన్నారు. సర్వే నంబరు 139కి సంబంధించి రికార్డుల్లో వారా నూకరాజు పేరు వుందని, 7.39 ఎకరాల భూమిని ఆయనకు అప్పగించడానికి రికార్డులు తయారుచేశామని చెప్పారు. మిగతా 2.44 ఎకరాలకు సంబంధించి కోర్టు వివాదంలో ఉన్నందున కోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

Updated Date - Oct 22 , 2025 | 12:56 AM