జడ్పీ బడ్జెట్ రూ.1,631.96 కోట్లు
ABN , Publish Date - Dec 27 , 2025 | 01:07 AM
జిల్లా ప్రజా పరిషత్ స్థాయీ సంఘ సమావేశం ఈ ఆర్థిక (2025-26) సంవత్సరం సవరణ బడ్జెట్‌ను, 2026-27 సంవత్సరం అంచనా బడ్జెట్‌ను ఆమోదించింది.
స్థాయీ సంఘ సమావేశంలో ఆమోదం
విశాఖపట్నం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి):
జిల్లా ప్రజా పరిషత్ స్థాయీ సంఘ సమావేశం ఈ ఆర్థిక (2025-26) సంవత్సరం సవరణ బడ్జెట్‌ను, 2026-27 సంవత్సరం అంచనా బడ్జెట్‌ను ఆమోదించింది. చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన శుక్రవారం జరిగిన స్థాయీ సంఘ సమావేశంలో సవరించిన బడ్జెట్‌ను, అంచనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. జడ్పీ సాధారణ సమావేశంలో చర్చించే ముందు బడ్జెట్‌ను స్థాయీ సంఘ సమావేశంలో ప్రవేశపెడతారు. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2026-27లో రూ.1631.96 కోట్ల ఆదాయం వస్తుందనే అంచనాతో బడ్జెట్ రూపొందించారు. జడ్పీకి సొంతంగా రూ.24.34 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.20 కోట్లు, ఇంకా ఇతర శాఖలు ప్రధానంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖల నుంచి రూ.1587.61 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. దీని నుంచి రూ.1612.96 కోట్లు వ్యయం అవుతుందని బడ్జెట్‌లో పొందుపరిచారు. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ, వ్యయాలకు సంబంధించి గత ఏడాది రూపొందించిన లెక్కలను స్వల్పంగా సవరించారు. దీని ప్రకారం ఆదాయం రూ.1,626.92 కోట్లు, ఖర్చు రూ.1601.54 కోట్లుగా చూపించారు.
వాహనదారులపై కెమెరా కన్ను
నిబంధనలు ఉల్లంఘిస్తే ఆటోమేటిక్‌గా చలాన్ జారీ
మాధవధార, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి):
నగరం మొత్తం సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయినట్టు రవాణా శాఖ ఉప కమిషనర్ ఆర్‌సీహెచ్ శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించారు. ఇకపై వాహనాల కదలికలన్నీ ఆటోమేటిక్‌గా ఏఐ ఆధారిత ఆటోమేటిక్ కెమెరాల్లో రికార్డవుతాయన్నారు. ఆ సీసీ ఫుటేజీ రవాణా శాఖ వెబ్‌సైట్‌కు లింక్ చేసి ఉంటుందని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్టయితే సహాయ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ లాగిన్ ద్వారా చలానాలు జారీ అవుతాయని పేర్కొన్నారు. చలానాలో ఉండే ‘ప్లేస్ ఆఫ్ చెకింగ్’ వద్ద స్థలం నమోదవుతుందన్నారు. వాహనదారులు పూర్తి అప్రమత్తంగా రోడ్లపై వాహనాలు నడుపుతూ, సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.
కైలాసగిరిపై రైలుకు బ్రేకులు ఫెయిల్
విశాఖపట్నం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి):
కైలాసగిరిపై వీఎంఆర్‌డీఏ పర్యాటకుల కోసం నడుపుతున్న రైలుకు శుక్రవారం ఉదయం బ్రేకులు ఫెయిలయ్యాయి. దాంతో రైలు వెనక్కి జారుకుంటూ వెళ్లిపోయింది. దాంతో అందులోని పర్యాటకులు కేకలు వేశారు. చుట్టుపక్కల వారు అప్రమత్తమై దానిని ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో రైలులో వంద మంది వరకూ ఉన్నారు. ఇది పర్యాటక సీజన్ కావడంతో విశ్రాంతి లేకుండా రైలును నడుపుతున్నారు. దాంతో నిర్వహణ కొరవడి బ్రేకులు ఫెయిల్ అయినట్టు సమాచారం.
సికింద్రాబాద్‌కు ఫస్ట్ ఏసీ చార్జీ రూ.2,595
బెంగళూరుకు రూ.3,430
అమలులోకి పెరిగిన రైల్వే టికెట్ చార్జీలు
విశాఖపట్నం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి):
రైల్వే చార్జీల పెంపు గురువారం నుంచి అమలులోకి వచ్చింది. ఆర్డినరీ రైళ్లలో 215 కిలోమీటర్లు దాటితే కిలోమీటరుకు ఒక పైస చొప్పున, ఎక్స్‌ప్రెస్‌ల రైళ్లకైతే నాన్ ఏసీ (స్లీపర్), ఏసీ కోచ్‌లలో కిలోమీటరుకు 2 పైసలు చొప్పున పెంచిన సంగతి తెలిసిందే.
కొత్త చార్జీలు ప్రకారం....
విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే రైళ్లకు కొత్త చార్జీలు పరిశీలిస్తే....స్లీపర్ క్లాస్‌కు రూ.435, థర్డ్ ఏసీకి రూ.1,120, సెకండ్ ఏసీకి రూ.1,565, ఫస్ట్ ఏసీకి రూ.2,595 చెల్లించాల్సి ఉంటుంది.
విశాఖ నుంచి చెన్నై రైళ్లకు కొత్త చార్జీలు పరిశీలిస్తే...స్లీపర్ క్లాసుకు రూ.465, థర్డ్ ఏసీకి రూ.1,190, సెకండ్ ఏసీకి రూ.1,665 చార్జీగా చెల్లించాల్సి ఉంటుంది. విశాఖ నుంచి బెంగళూరు వెళ్లే రైళ్లకు స్లీపర్ అయితే రూ.550, థర్డ్ ఏసీకి రూ.1,435, సెకండ్ ఏసీకి రూ.2,045, ఫస్ట్ ఏసీకి రూ.3,430 చార్జీ అవుతుంది.
అలాగే విశాఖ నుంచి హౌరా వెళ్లే రైళ్లలో స్లీపర్ క్లాస్‌కు రూ.505, థర్ట్ ఏసీకి రూ.1,290, థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌కు రూ.1,200, సెకండ్ ఏసీకి రూ.1,810, ఫస్ట్ ఏసీ కోచ్‌కు రూ.3,020 చెల్లించాల్సి ఉంది.
31వ తేదీనే పింఛన్లు పంపిణీ
విశాఖపట్నం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి):
నూతన సంవత్సరం కావడంతో జనవరి ఒకటో తేదీన పంపిణీ చేయాల్సిన సామాజిక భద్రతా పింఛన్లను ఈనెల 31వ తేదీనే అందజేస్తామని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తారు. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది తమ పరిధిలో పింఛన్ల సొమ్ము 31వ తేదీ ఉదయమే పింఛన్‌దారులకు అందిస్తారన్నారు. ఇందుకు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. పింఛన్ సొమ్ము ఈనెల 30వ తేదీన డ్రా చేయడానికి చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ పీడీని ఆదేశించామన్నారు. పింఛన్ల పంపిణీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సమన్వయంతో పనిచేయాలన్నారు.