తీరంలో ఘోరం
ABN , Publish Date - Nov 23 , 2025 | 01:08 AM
సముద్ర స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్థులు కెరటాల తాకిడికి గల్లంతవ్వగా, మరో ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకు చేరారు.
సముద్రంలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
స్నానానికి దిగి కెరటాల తాకిడికి కొట్టుకుపోయిన వైనం
మద్దిలపాలెం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి):
సముద్ర స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్థులు కెరటాల తాకిడికి గల్లంతవ్వగా, మరో ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం నగరంలోని వుడా పార్కు వెనుక బీచ్‌లో జరిగింది. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక బుల్లయ్య కళాశాలలో డిగ్రీ మైక్రో బయాలజీ మూడో సంవత్సరం చదువుతున్న నరేంద్రపురపు శ్రీఆదిత్య (20), మానేపల్లి తేజస్ (20), మరో ఆరుగురితో కలిసి శనివారం సాయంత్రం వుడా పార్కు వెనుక ఉన్న బీచ్ లైట్‌హౌస్ వద్దకు వెళ్లారు. కాసేపు బీచ్‌లో సరదాగా గడిపారు. శ్రీఆదిత్య, తేజస్‌లతో పాటు మరో ఇద్దరు సముద్ర స్నానానికి దిగారు. నలుగురు స్నానం చేస్తుండగా అలల తాకిడికి లోపలకు కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. శ్రీఆదిత్య, తేజస్‌లు అలల్లో చిక్కుకుని గల్లంతయ్యారు. కళ్ల ఎదుటే స్నేహితులు సముద్రం లోపలకు కొట్టుకుపోవడంతో సహచరులు కన్నీరు మున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక మత్స్యకారుల బోట్లు, కోస్ట్‌గార్డు బోట్లతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 11 గంటల సమయానికి కూడా విద్యార్థుల ఆచూకీ లభించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
‘మై రెస్టారెంట్’లో నిల్వ ఆహారం
30 కిలోల వరకూ గుర్తించిన ఆహార భదత్ర, ప్రమాణాల శాఖ అధికారులు
చికెన్ ఫ్రై, రొయ్యల కూర, ఫిష్ ఫ్రై, పన్నీరు,
మష్రూమ్ (పుట్టగొడుగులు) కూరలు...
కేసు నమోదు
విశాఖపట్నం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి):
కస్టమర్ల ఆరోగ్యం ఏమైపోతే తమకేంటి అన్నట్టుగా నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. రోజుల తరబడి నిల్వ ఉన్న ఆహారాన్ని వేడి చేసి వడ్డిస్తున్నాయి. ఆహార భదత్ర, ప్రమాణాల శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటికే ఈ విషయం వెల్లడైంది. తాజాగా శనివారం మధ్యాహ్నం ఇసుకతోట సమీపంలోని ‘మై రెస్టారెంట్’లో తనిఖీలు నిర్వహించగా సుమారు రూ.30 వేలు విలువజేసే 30 కిలోల నిల్వ ఆహారాన్ని గుర్తించారు. ఇందులో చికెన్ ఫ్రై, లెగ్ పీస్‌లు, రొయ్యల కూర, ఫిష్ ఫ్రై, పన్నీరు, మష్రూమ్ (పుట్టగొడుగులు) కూరలు ఉన్నాయి. వీటిని రెండు, మూడు రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి వినియోగదారుల ఆర్డర్‌ను బట్టి వేడి చేసి వడ్డిస్తున్నట్టు అధికారుల తనిఖీల్లో తేలింది. ఈ నిల్వ ఆహారాన్ని అధికారులు ధ్వంసం చేయడంతోపాటు సదరు రెస్టారెంట్‌పై కేసు నమోదుచేశారు. ఇకపోతే, కిచెన్‌లో వాతావరణం కూడా అత్యంత దారుణంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. తనిఖీలు నిర్వహించిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అప్పారావు మాట్లాడుతూ రెస్టారెంట్‌లో భారీగా నిల్వ చేసిన ఆహారాన్ని గుర్తించామన్నారు. సుమారు 30 కిలోల ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి వినియోగదారులకు వేడి చేసి వడ్డిస్తున్నట్టు గుర్తించామన్నారు. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. నగర పరిధిలోని అనేక హోటళ్లలో ఇదే తరహాలో నిల్వ ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారని, కాబట్టి వినియోగదారులు హైజీన్ ఫుడ్ ఇస్తున్నదీ లేనిదీ చూసుకోవాలని సూచించారు. ఏమైనా అనుమానం ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
‘సమగ్ర శిక్ష’లో సెక్టోరియల్ పోస్టుల భర్తీకి కసరత్తు
55 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన స్కూలు అసిస్టెంట్లు/ఎస్జీటీలకు అవకాశం
విశాఖపట్నం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని సమగ్ర శిక్ష విభాగంలో ఖాళీగా ఉన్న సెక్టోరియల్ అధికారుల నియామకానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇటీవల ఇద్దరు సెక్టోరియల్ అధికారులు మాతృ శాఖ (విద్యాశాఖ)కు వెళ్లిపోయారు. మరో రెండు పోస్టులు రెండేళ్ల నుంచి ఖాళీగా ఉన్నాయి. దీంతో కార్యాలయంలో పని ఒత్తిడి పెరిగింది. అదేవిధంగా పాఠశాలల్లో పథకాల అమలు తీరు పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో కమ్యూనిటీ మొబిలేషన్ ఆఫీసర్ (సీఎంవో), అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ (ఏపీవో), బాలికా అభివృద్ధి అధికారి (జీసీడీవో), సహిత విద్యా సమన్వయకర్త (ఐఈ కో-ఆర్డినేటర్) పోస్టుల నియామకానికి జిల్లా కలెక్టర్ అనుమతించారు.
ఉమ్మడి జిల్లాలో పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తూ 55 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన స్కూలు అసిస్టెంట్లు/ఎస్జీటీలు ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష ఏపీసీ జె.చంద్రశేఖరరావు తెలిపారు. విశాఖ జిల్లాలోని 11 మండలాల్లో పనిచేసే టీచర్లకు తొలుత ప్రాధాన్యం ఇస్తామన్నారు. సీఎంవో, ఏపీవో పోస్టుల్లో ఫారెన్ సర్వీస్ నిబంధనల మేరకు నియమిస్తామని, జీసీడీవో, ఐఈ కో-ఆర్డినేటర్ పోస్టులను డిప్యూటేషన్‌పై తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
కూరగాయల ధరలు తగ్గించండి
టోకు వర్తకులకు అధికారుల సూచన
విశాఖపట్నం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి):
రైతుబజార్లలో కూరగాయల ధరలు బాగా పెరిగినందున వాటిని తగ్గించి విక్రయించడానికి సహకరించాలని టోకు వర్తకులను వ్యవసాయ మార్కెటింగ్ శాఖాధికారులు కోరారు. జ్ఞానాపురం హోల్‌సేల్ మార్కెట్‌లో శనివారం వర్తకులతో సమావేశమయ్యారు. కూరగాయల ధరల పెరుగుదలపై చర్చించారు. వర్షాల కారణంగా పంటలన్నీ పోయాయని, ఎక్కడెక్కడి నుంచో తెప్పిస్తున్నామని, వాటికి రవాణా ఖర్చులు అధికంగా అవుతున్నాయని వర్తకులు చెప్పారు. మదనపల్లెలోనే టమాటా కిలో రూ.50 టోకున అమ్ముతున్నారని వివరించారు. ఇప్పటివరకూ కిలోకు ఎంత లాభం వేసుకుంటున్నారో అందులో సగం తగ్గించుకొని సరకులు సరఫరా చేయాలని అధికారులు సూచించారు. జనవరి నెల వరకూ కొత్త పంటలు మార్కెట్‌కు వచ్చే అవకాశం లేనందున అంతవరకు సహకరించాలని కోరారు. ప్రభుత్వం తరఫున టమాటా కొనుగోలు చేసే అవకాశాలు కూడా పరిశీలిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో గోపాలపట్నం కార్యాలయం అధికారులతోపాటు పలు రైతుబజార్ల ఈఓలు కూడా పాల్గొన్నారు.