తీరంలో ఘోరం
ABN , Publish Date - Sep 15 , 2025 | 01:26 AM
రుషికొండబీచ్‌కు కొద్ది దూరంలో సముద్రస్నానాలకు దిగిన ఇద్దరు విద్యార్థులు కెరటాల ఉధృతికి గల్లంతయ్యారు. మరో ఇద్దరు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలిలా ఉన్నాయి...
రుషికొండ వద్ద సంద్రంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు
ప్రమాదం నుంచి బయటపడిన మరో ఇద్దరు
సాగర్‌నగర్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి):
రుషికొండబీచ్‌కు కొద్ది దూరంలో సముద్రస్నానాలకు దిగిన ఇద్దరు విద్యార్థులు కెరటాల ఉధృతికి గల్లంతయ్యారు. మరో ఇద్దరు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలిలా ఉన్నాయి...
పోతినమల్లయ్యపాలెం సాంకేతిక కళాశాల ప్రాంతంలో నివాసం ఉంటున్న నలుగురు విద్యార్థులు ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో రుషికొండ బీచ్‌కు వచ్చారు. అక్కడ కాసేపు సరదాగా గడిపి సముద్ర స్నానాలకు ఉపక్రమించారు. అయితే పోలీసులు, లైఫ్‌గార్డులు అలర్ట్ చేయడం, హెచ్చరికలు జారీ చేస్తుండడంతో అక్కడికి కాస్త దూరంలో స్నానానికి ఉపక్రమించారు. సముద్రంలో దిగి స్నానం చేస్తుండగా ఒక్కసారిగా ఎగసిపడిన అలల తాకిడికి చెల్లాచెదురయ్యారు. వీరిలో చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మామిడిశెట్టి శ్యామన్‌సాయి (14), శ్రీకృష్ణ స్కూల్‌లో పది విద్యార్థి మండల సంజయ్ (15) కెరటాల తాకిడికి గల్లంతయ్యారు. బోయపాలెం ఈస్ట్రన్ విశాఖ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ముకల సాగర్ (15), ఎంవీపీ శ్రీచైతన్య స్కూల్‌లో పదోతరగతి చదువుతున్న తెన్ను బాలాదిత్య (15) సురక్షితంగా బయటపడ్డారు. కాగా గల్లంతైన వారి కోసం లైఫ్‌గార్డులు, మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు. వారి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీరానికి చేరుకుని, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.