రేషన్ డీలర్ల ఇష్టారాజ్యం
ABN , Publish Date - Jul 20 , 2025 | 01:26 AM
ముస్లింతాటిచెట్లపాలెం ప్రాంతంలో ఉంటున్న కార్డుదారులకు సంబంధించి రేషన్ డిపో (నంబరు 0387033) సంఘం ఆఫీస్ జంక్షన్ ఎదురు రోడ్డులో అమ్మవారి గుడి వద్ద ఉంది.
ఉండాల్సిన చోట కాకుండా వేరొక చోట నిర్వహణ
ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్డుదారులు
తమ డిపోలో కాకుండా సమీపంలో ఉన్న మరో డిపోలో బియ్యం, పంచదార తీసుకోవలసిన పరిస్థితి
నేతలు, సంఘాల ప్రతినిధుల అండదండలతో అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తున్న కొంతమంది డీలర్లు
విశాఖపట్నం/అక్కయ్యపాలెం/మహారాణిపేట (ఆంధ్రజ్యోతి):
ముస్లింతాటిచెట్లపాలెం ప్రాంతంలో ఉంటున్న కార్డుదారులకు సంబంధించి రేషన్ డిపో (నంబరు 0387033) సంఘం ఆఫీస్ జంక్షన్ ఎదురు రోడ్డులో అమ్మవారి గుడి వద్ద ఉంది. అలాగే జగ్గారావు బ్రిడ్జి సమీపంలో ఉండాల్సిన రేషన్ డిపో (నంబరు 0387014) శంకరమఠం రోడ్డులో ఉంది. ఎన్జీవో కాలనీలో నిర్వహించాల్సిన డిపో (నంబర్ 0387015) కూడా అదే ప్రాంగణంలో ఉంది.
రేషన్ డిపోలు దూరంగా ఉండడంపై కార్డుదారులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సచివాలయాలు/క్లస్టర్‌కు అనుసంధానం చేసిన చోట కాకుండా మరోచోట డిపోల నిర్వహణతో కార్డుదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో తమ డిపోలో కాకుండా సమీపంలో ఉన్న మరో డిపో నుంచి బియ్యం, పంచదార తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముస్లింతాటిచెట్లపాలెంలో ఉన్న కార్డుదారులకు సంబంధించిన డిపో సంఘం ఆఫీస్ రోడ్డులో నిర్వహిస్తున్నారు. దీంతో ముస్లింతాటిచెట్లపాలెం కార్డుదారులు సమీపంలో గల ఇతర డిపోల నుంచి సరుకులు తెచ్చుకుంటున్నారు. కురుపాం మార్కెట్‌లో ఒకే ప్రాంతంలో నాలుగు డిపోలు ఉన్నాయి. నాలుగు షాపులు ఒకేచోట ఉండకూడదని జిల్లా పౌరసరఫరాల అధికారి పలుమార్లు ఆదేశించినా చెకింగ్ ఇన్‌స్పెక్టర్లు, డీలర్లు అవేవీ పట్టించుకోవడం లేదు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు తరువాత సచివాలయాలకు రేషన్ డిపోలు అనుసంధానం చేశారు. అంటే సచివాలయ పరిధిలోని కార్డుదారులకు అందుబాటులో రేషన్ డిపో ఉండాలి. కొన్నాళ్లు ఈ వ్యవస్థ బాగానే కొనసాగినా, ఎండీయూలు వచ్చిన తరువాత డిపో డీలర్లకు పనిలేకుండా పోయింది. దీంతో డిపోలను మారుమూల ప్రాంతాలకు తరలించేశారు. ఎండీయూల రద్దుతో మరోసారి డిపోల ప్రాధాన్యం పెరిగింది. ఎండీయూ రద్దు నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కార్డుదారులకు అందుబాటులోనే డిపోలు నిర్వహించాలని ఆదేశించారు. అయితే కొందరు డీలర్లు మాత్రం అధికారుల ఆదేశాలు పాటించారు. మరికొందరు యథావిధిగా తమకు అనుకూలంగా ఉండే చోట్ల మాత్రమే డిపోలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోర్టబిలిటీ అవకాశం ఉండడంతో కార్డుదారులు చాలామంది తమకు సమీపంలోని మరో సచివాలయంతో మ్యాప్ అయిన డిపో నుంచి సరుకులు తెచ్చుకుంటున్నారు. దీంతో కొన్ని డిపోల్లో 100 శాతం సరుకుల పంపిణీ జరుగుతుండగా, కొన్ని డిపోల్లో 90 శాతం అంత కంటే తక్కువ శాతం సరుకులు పంపిణీ అవుతున్నాయి. 100 శాతం సరుకులు పంపిణీచేసిన డీలర్లు తమ ప్రాంతంలో ఇంకా కార్డుదారులున్నారని వినతి మేరకు అదనపు కోటా బియ్యం పొందగలుగుతున్నారు. డిపోలు ఒకచోట... కార్డుదారులు మరోచోట ఉన్నప్పటికీ జిల్లాలో ఈ నెల 96 శాతానికిపైగా సరుకుల పంపిణీ జరిగింది. కాగా డిపోలు అందుబాటులో ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదని కార్డుదారులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ విషయమై డీలర్లకు పౌర సరఫరాల శాఖ గత నెలలో నోటీసులు జారీచేసింది. డిపోలు తప్పనిరిగా సచివాలయం/క్లస్టర్‌తో మ్యాపింగ్ అయిన ప్రాంతంలో ఉండాలని ఆదేశించింది. అయినా కొన్ని డిపోలు ఇంకా మార్చుకునేందుకు డీలర్లు ససేమిరా అంటున్నారు. ఇటువంటి డిపోలకు చౌకడిపోల సంఘనేతలు, అధికార పార్టీ నేతలు అండగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమస్యను జిల్లా పౌరసరఫరాల అధికారి వి.భాస్కర్ వద్ద ప్రస్తావించగా సచివాలయంతో మ్యాపింగ్ అయిన చోట మాత్రమే డిపోలు ఉండాలన్నారు. అందుకు భిన్నంగా ఉన్న డిపోలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.