బడి బ్యాగు బరువు తగ్గింది
ABN , Publish Date - Jun 16 , 2025 | 12:35 AM
స్కూల్ బ్యాగులో ప్రతి సబ్జెక్టుకి ఒక పాఠ్య పుస్తకం తీసుకు వెళ్లే రోజులు పోయాయి. ప్రభుత్వం సెమిస్టర్ విధానం తీసుకు వచ్చి భాషా పాఠ్యాంశాలు.. తెలుగు, హిందీ, ఆంగ్లం కలిపి ఒక పాఠ్య పుస్తకంగా చేయడంతో విద్యార్థులకు పుస్తకాల మోత తగ్గింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 9వ తరగతి వరకు రెండు, మూడు సబ్జెక్టులు కలిపి ఒక పాఠ్య పుస్తకం చేయడంతో విద్యార్థుల బ్యాగు కొంత తేలికైంది.

- సెమిస్టర్ విధానంలో పాఠ్య పుస్తకాల ముద్రణ
- 1, 2 తరగతులకు ఒక పాఠ్య పుస్తకం, ఒక వర్క్ బుక్
- 3, 4, 5 క్లాసులకు తెలుగు, ఆంగ్లం కలిపి ఒక పుస్తకం
- లెక్కలు, ఈవీఎస్ కలిపి ఒక పుస్తకం, ఒక వర్క్ బుక్
- భాషా పాఠ్యాంశాలు తెలుగు, ఆంగ్లం, హిందీ కలిపి ఒక పాఠ్య పుస్తకం
నర్సీపట్నం, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): స్కూల్ బ్యాగులో ప్రతి సబ్జెక్టుకి ఒక పాఠ్య పుస్తకం తీసుకు వెళ్లే రోజులు పోయాయి. ప్రభుత్వం సెమిస్టర్ విధానం తీసుకు వచ్చి భాషా పాఠ్యాంశాలు.. తెలుగు, హిందీ, ఆంగ్లం కలిపి ఒక పాఠ్య పుస్తకంగా చేయడంతో విద్యార్థులకు పుస్తకాల మోత తగ్గింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 9వ తరగతి వరకు రెండు, మూడు సబ్జెక్టులు కలిపి ఒక పాఠ్య పుస్తకం చేయడంతో విద్యార్థుల బ్యాగు కొంత తేలికైంది. ఇప్పటి వరకు భాషా పాఠ్యాంశాల (తెలుగు, ఆంగ్లం, హిందీ) పుస్తకాలు విడివిడిగా ముద్రించేవారు. ఇప్పుడు మూడు పాఠ్య పుస్తకాలకు బదులు ఒక పాఠ్య పుస్తకంతో సరిపోతుంది. దీని వల విద్యార్థిపై ఒత్తిడి తగ్గుతుంది. తేలిక పడిన స్కూల్ బ్యాగ్‌తో హాయిగా పాఠశాలకు వెళ్ల గలుగుతారు. ఉదాహరణకు 3 నుంచి 5 తరగతులకు తెలుగు, ఆంగ్లం కలిపి ఒక టెక్ట్స్ బుక్, గణితం, ఈవీఎస్ కలిపి ఒక టెక్ట్స్ బుక్, ఒక వర్క్ బుక్ కలిపి.. కేవలం మూడు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ తీసుకు వెళితే సరిపోతుంది.
పాఠ్య పుస్తకాల వివరాలు ఇలా...
- 1, 2 తరగతులకు సంబంధించి ఒక సెమిస్టర్‌కి తెలుగు, లెక్కలు, ఇంగ్లీషు కలిపి ఒక పాఠ్య పుస్తకం, ఒక వర్క్ బుక్ ఇచ్చారు.
- 3, 4, 5 క్లాసులకు తెలుగు, ఇంగ్లీషు కలిపి ఒక పాఠ్య పుస్తకం, లెక్కలు, ఈవీఎస్ (పర్యావరణ అఽధ్యయనం) కలిపి ఒక పాఠ్య పుస్తకంగా చేశారు. దీంతో పాటు ఒక వర్క్ బుక్ ఇచ్చారు.
- 6, 7 తరగతిలో తెలుగు, హిందీ, ఆంగ్లం కలిపి ఒక పాఠ్య పుస్తకంగా చేశారు. లెక్కలు, సైన్స్, సోషల్ పాఠ్య పుస్తకాలు విడివిడిగా ఇచ్చారు.
- 8, 9 తరగతులకు తెలుగు, హిందీ, ఆంగ్లం కలిపి ఒక పాఠ్య పుస్తకంగా, భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం కలిపి ఒకటి, లెక్కలు ఒక పాఠ్య పుస్తకం, సోషల్ సైన్స్ (భూగోళ శాస్త్రం, రాజకీయ శాస్త్రం, చరిత్ర, అర్థిక శాస్త్రం) ఒక పాఠ్య పుస్తకంగా ఇచ్చారు. 9వ తరగతికి అదనంగా ఆంగ్ల పదాలు, వ్యక్తీకరణకు సంబంధించి ఒక వర్క్ బుక్ ఇచ్చారు.
- 10వ తరగతిలో తెలుగు, హిందీ, ఆంగ్లం, లెక్కలు, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సోషల్ సైన్స్‌లో చరిత్ర, భూగోళ, రాజకీయ, ఆర్థిక శాస్త్రం పాఠ్య పుస్తకాలు విడివిడిగా ఇచ్చారు. 9, 10 తరగతులకు హిందీలో ఎన్‌సీఆర్‌టీ పాఠ్యాంశాలు తొలగించి స్టేట్ సిలబస్ (ఎస్‌సీఆర్‌టీ) అందుబాటులోకి తెచ్చారు.