Share News

కల్యాణం కమనీయం

ABN , Publish Date - Nov 04 , 2025 | 01:35 AM

గోవింద నామస్మరణతో నర్సీపట్నం ఎన్టీఆర్‌ మినీ స్టేడియం సోమవారం రాత్రి మార్మోగింది.

కల్యాణం కమనీయం

నర్సీపట్నంలో అంగరంగ వైభవంగా శ్రీనివాసుని వివాహ మహోత్సవం

స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు దంపతులు

కనులారా వీక్షించి తరించిన భక్తులు

నర్సీపట్నం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):

గోవింద నామస్మరణతో నర్సీపట్నం ఎన్టీఆర్‌ మినీ స్టేడియం సోమవారం రాత్రి మార్మోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకుముందు మేళతాళాలు, కోలాటాలు, భజన భృందాలతో శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవ విగ్రహాలను శ్రీవారి సేవకులు పెదబొడ్డేపల్లి నుంచి ఎన్టీఆర్‌ మినీ స్టేడియం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక వేదికపై టీటీడీ అర్చకులు కృష్ణశాస్త్రి 6.55 గంటలకు స్వామి వారి కల్యాణ వేడుకలకు శ్రీకారంచుట్టారు. శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, పద్మావతి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుపతి నుంచి వచ్చిన అర్చకుల బృందం, వేద పండితులు మంత్రోచ్ఛరణలతో స్వామి వారి కల్యాణం జరిపించారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు తిరుమలలో శ్రీనివాసుని కల్యాణాన్ని స్వయంగా తిలకించిన అనుభూతి పొందారు. అన్నమయ్య కీర్తనలు, స్వామి భక్తి గీతాల ఆలాపనతో స్టేడియంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ దంపతులు, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబు, డీసీసీబీ పర్సన్‌ఇన్‌చార్జి కోన తాతారావు, దాడి రత్నాకర్‌, చింతకాయల రాజేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 01:35 AM