పేదింట సాహితీ కెరటం
ABN , Publish Date - Jun 20 , 2025 | 12:40 AM
అతను పుట్టింది ఓ నిరు పేద మత్స్యకార కుటుంబంలో. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక చదివించే స్థోమత లేదని తల్లిదండ్రులు చెప్పడంతో హైదరాబాద్ చేరుకున్నాడు. ఓ బార్‌లో ఏడాది పాటు పని చేశాడు. ఆ డబ్బులతో అక్కడి జవహర్‌లాల్‌నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తిచేశాడు. ఖాళీ సమయంలో కలం పేరుతో మూడు నవలలు రాశాడు. అందులో ‘మైరావణ’ నవలకు ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య యువ పురస్కారం దక్కింది. తన రెండవ నవలకే ప్రతిష్ఠాత్మక పురస్కారం రావడం ఆనందంగా ఉందంటున్నాడు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడరాంబిల్లి మత్స్యకార గ్రామానికి చెందిన సూరాడ ప్రసాద్.
- మత్స్యకార గ్రామం నుంచి ఎదిగిన యువ రచయిత ప్రసాద్
- రాసింది కేవలం మూడు నవలలు
- కేంద్ర సాహిత్య యువ పురస్కారానికి ఎంపిక
అచ్యుతాపురం రూరల్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): అతను పుట్టింది ఓ నిరు పేద మత్స్యకార కుటుంబంలో. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక చదివించే స్థోమత లేదని తల్లిదండ్రులు చెప్పడంతో హైదరాబాద్ చేరుకున్నాడు. ఓ బార్‌లో ఏడాది పాటు పని చేశాడు. ఆ డబ్బులతో అక్కడి జవహర్‌లాల్‌నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తిచేశాడు. ఖాళీ సమయంలో కలం పేరుతో మూడు నవలలు రాశాడు. అందులో ‘మైరావణ’ నవలకు ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య యువ పురస్కారం దక్కింది. తన రెండవ నవలకే ప్రతిష్ఠాత్మక పురస్కారం రావడం ఆనందంగా ఉందంటున్నాడు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడరాంబిల్లి మత్స్యకార గ్రామానికి చెందిన సూరాడ ప్రసాద్.
సూరాడ చంద్రరావు, నూకరత్నం దంపతులకు 2000 డిసెంబరు 12న ప్రసాద్ జన్మించాడు. స్వగ్రామం వాడనర్సాపురం అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల వాడరాంబిల్లిలో అమ్మమ్మ వద్ద ఉంటూ 2016లో పదవ తరగతి పూర్తిచేశాడు. 2018లో ఎలమంచిలి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీయడిట్ పూర్తిచేశాడు. ఇక చదివించే స్థోమత తమకు లేదని తల్లిదండ్రులు చెప్పేశారు. అయితే ప్రసాద్ తన భవిష్యత్తును వెతుక్కుంటూ హైదరాబాద్ చేరుకున్నాడు. అక్కడ సంవత్సరం పాటు బార్‌లో పనిచేశాడు. ఆ సంపాదనతో 2019లో హైదరాబాద్‌లో గల జేఎన్‌టీయూలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చేరి 2024లో పూర్తిచేశాడు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రం బరోడాలో మహారాజా సాయాజీరావు యూనివర్సిటీలో ఎంఏ ఆర్కియాలజీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు.
మత్స్యకారుల చరిత్రకు అద్దం పట్టే ‘మైరావణ’
చిన్నతనంలో వాడనర్సాపురం గ్రామంలో వరుసకు బాబాయి అయిన సూరాడ గోవింద ఫైన్ ఆర్ట్స్‌లో, సినీ గాయకుడిగా మంచి పేరు సాధించడంతో తాను కూడా అలా సెలబ్రిటీగా మారాలనే ప్రసాద్‌కు ఉండేది. హైస్కూల్ నుంచి పుస్తకాలు చదవడంలో పాటుగా ఆర్ట్‌లు వేయడం, నటించడం, మిమిక్రీ చేయడం వంటివి చేసేవాడు. ఆ సమయంలో ఏదో ఒక కథను రాస్తూ తోటి విద్యార్థులకు వినిపించే వాడు. హైదరాబాద్‌లో బార్‌లో పనిచేసే సమయంలో రచనలు చేయడం మొదలుపెట్టాడు. ప్రసాద్ సూరి కలం పేరిట రచనలు చేశాడు. తొలిగా మై నేమ్ ఈజ్ చిరంజీవి అనే నవల రాశాడు. చాయా పబ్లికేషన్ ద్వారా విడుదల చేసిన ఈ నవల అందరికీ నచ్చడంతో అదే ఉత్సాహంతో మైరావణ నవలను రాశాడు. స్వగ్రామంలో పెద్దలు చెప్పిన పూర్వీకుల చరిత్రను కథగా మలిచాడు. మత్స్యకార కుటుంబ జీవన విధానంతో పాటు తమ వాడబలిజ కుటుంబాలు ఎలా ఆవిర్భవించాయి అనే విషయాన్ని కథగా, ఫిక్షనల్ క్యారక్టర్‌లను చూపించి పాఠకులను కట్టి పడేశాడు. తమ పూర్వీకులు బర్మా, రంగూన్‌లో బతికారని, నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మించే సమయంలో కూలీలుగా వలస వచ్చారని, మొట్టమొదటిసారిగా మైలపిల్లి మైరావుడు వల తయారు చేశాడని, అప్పటి నుంచి తాము చేపలు పట్టడం ప్రారంభించామని తెలుసుకున్న ప్రసాద్ అదే కథను కల్పిత పాత్రలతో మైరావణ నవల రాశాడు.
ఎంతో ఆనందంగా ఉంది
- సూరాడ ప్రసాద్ (కలం పేరు ప్రసాద్ సూరి), మైరావణ రచయిత
నేను కేవలం మూడు నవలలే రాశాను. మొదటిది మై నేమ్ ఈజ్ చిరంజీవి, రెండోది మైరావణ, మూడవది బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. నేను కేంద్ర సాహిత్య యువ పురస్కారానికి ఎంపికయ్యానని తెలిసి ఎంతో ఆనందపడ్డాను. గ్రామంలో, కుటుంబంలో నన్ను ప్రోత్సహించేవారు లేకపోయినా సరే, నా తెగింపే నన్ను ఇంత వరకూ తీసుకువచ్చింది. డిగ్రీ చదివే సమయంలో కాలేజీలో చాలామంది నన్ను ప్రోత్సహించి, ఆర్థికంగా కూడా సహకరించారు. నాతో పాటు అనేకమంది ఈ సాహిత్య పురస్కారానికి పోటీ పడ్డారు. నా అదృష్టం కొద్దీ నన్ను ఈ పురస్కారం వరించింది. ప్రభుత్వం యువ రచయితలను మరింత ప్రోత్సహిస్తే రానున్న కాలంలో గొప్ప రచనలు ముందుకు వస్తాయి.