Share News

గంగపుత్రుల కన్నెర్ర

ABN , Publish Date - Oct 13 , 2025 | 12:31 AM

బల్‌డ్రగ్‌ పార్కు వద్దంటూ మండలంలోని రాజయ్యపేట కేంద్రంగా 29 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న మత్స్యకారుల ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. తమ మనుగడ కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ పోలీసులు అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గంగపుత్రుల కన్నెర్ర
జాతీయ రహదారిపై బైఠాయించిన మత్స్యకారులు 12ఎన్‌కేపీ9: హైవేపై నిలిచిపోయిన వాహనాలు

బల్క్‌డ్రగ్‌ పార్కు వద్దంటూ రోడ్డెక్కిన మత్స్యకారులు

రాజయ్యపేట నుంచి నక్కపల్లికి ర్యాలీ

జాతీయ రహదారిపై బైఠాయింపు

ఆర్డీవో, డీఎస్పీ నచ్చజెప్పినా ససేమిరా

ఇరువైపులా కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

తీవ్ర ఇబ్బందులు పడిన ప్రయాణికులు

ఆర్డీవో సమాచారంతో కలెక్టర్‌, ఎస్పీ రాక

15న రాజయ్యపేట వచ్చి మాట్లాతానని విజయకృష్ణన్‌ హామీ

నాలుగు గంటల అనంతరం ఆందోళన విరమణ

నక్కపల్లి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): బల్‌డ్రగ్‌ పార్కు వద్దంటూ మండలంలోని రాజయ్యపేట కేంద్రంగా 29 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న మత్స్యకారుల ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. తమ మనుగడ కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ పోలీసులు అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజయ్యపేట నిరసన శిబిరం నుంచి ఆదివారం మధ్యాహ్నం అనూహ్యంగా వందల సంఖ్యలో మత్స్యకారులు నడుచుకుంటూ నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్న నక్కపల్లికి బయలుదేరారు. దారిలో పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఆగలేదు. మహిళలు, పోలీసులను నెట్టుకుంటూ ముందుకు సాగారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఉపమాక హైవే జంక్షన్‌కు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఇరువైపులా వాహనాలు ఆగిపోవడం మొదలైంది. అధికారులు, పోలీసులు ఎంత నచ్చజెప్పినా ఆందోళన విరమించలేదు. మత్స్యకార మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించిన అడ్డరోడ్డు సీఐ రామకృష్ణ, నక్కపల్లి ఎస్‌ఐ సన్నిబాబును సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బల్క్‌డ్రగ్‌ పార్కు అనుమతులను రద్దు చేయాలని, అంతవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు జాతీయ రహదారిపై అటు తుని, ఇటు అడ్డరోడ్డు వైపు వాహనాలు పెరిగిపోతున్నాయి. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సమాచారం అందుకున్న నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణ, డీఎస్పీ పి.శ్రీనివాసరావు ఇక్కడకు వచ్చారు. ఆందోళన చేస్తున్న మత్స్యకారులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా వారు ససేమిరా అన్నారు. బల్క్‌ డ్రగ్‌ పార్కుపై కమిటీ వేస్తానని స్థానిక ఎమ్మెల్యే, హోం మంత్రి అయిన వి.అనిత చెప్పారని ఆర్డీవో తెలపగా.. ఆ కమిటీతో తమకు పనిలేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు. కలెక్టర్‌ వచ్చి తమకు సమాధానం చేప్పే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. దీంతో ఆర్డీవో రమణ, కలెక్టర్‌ విజయకృష్ణన్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. అనంతరం కలెక్టర్‌ మీతో మాట్లాడతారని ఆర్డీవో చెప్పగా, మత్స్యకారులు వినిపించుకోలేదు. కలెక్టర్‌ ఇక్కడకు రావాల్సిందేనని పట్టుబట్టారు. అప్పటికే సుమారు మూడు గంటల నుంచి మత్స్యకారులు ఆందోళన చేస్తుండడంతో అటు అన్నవరం, ఇటు తాళ్లపాలెం సమీపం వరకు దాదాపు 60 కి.మీ.ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌ సిన్హా సాయంత్రం 5.45 గంటలకు నక్కపల్లి వచ్చారు. బల్క్‌డ్రగ్‌ పార్కు అనుమతులు రద్దు చేయాలని, ఈ విషయంలో ఆందోళన చేస్తున్న తమకు మద్దతు ఇచ్చే వారిని నిర్బంధించకూడదని, అక్రమ కేసులు ఎత్తివేయాలని, తమపట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ ఎస్పీ మాట్లాడుతూ, నాలుగు గంటల నుంచి వాహనాలు ఆగిపోవడం వల్ల ప్రయాణికులు.. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఆందోళనను విరమించాలని కోరారు. పోలీసులకు సంబంధించి విచారణ చేసి తప్పని తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 15వ తేదీన రాజయ్యపేట వచ్చి మత్స్యకారులందరితో సమావేశమై మాట్లాడతామని చెప్పారు. దీంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు. సాయంత్రం ఆరు గంటల తరువాత వాహనాల రాకపోకలు పునరుద్ధరణ అయ్యాయి. వైసీపీ నేత వీసం రామకృష్ణ, సీపీఎం నేత ఎం.అప్పలరాజు, జడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, తదితరులు మత్స్యకారులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు.

బీసీవై నేతను నిర్బంధించడమే కారణమా?

వాస్తవానికి బీసీవై పార్టీ నేత రామచంద్రయాదవ్‌ హైకోర్టు అనుమతితో ఆదివారం మధ్యాహ్నం రాజయ్యపేట రావాల్సి వుంది. అయితే ఎస్పీ అనుమతి ఇవ్వకపోవడంతో ఆయనను విశాఖలోని ఒక హోటల్‌లో పోలీసులు నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న మత్స్యకారులు ఆగ్రహం చెందారు. రాజయ్యపేట నుంచి మూకుమ్మడిగా బయలుదేరి నక్కపల్లి వచ్చారు. దారిలో పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నా.. ఖాతరు చేయలేదు.

Updated Date - Oct 13 , 2025 | 12:31 AM