సంప్రదాయ విత్తనాల వినియోగం పెరగాలి
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:22 PM
జిల్లాలోని గిరిజన రైతులు దేశీయ విత్తనాల వినియోగాన్ని మరింతగా పెంచాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ సూచించారు.
గిరిజన రైతులకు కలెక్టర్ సూచన
పాడే రు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గిరిజన రైతులు దేశీయ విత్తనాల వినియోగాన్ని మరింతగా పెంచాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ సూచించారు. మండలంలోని డోకులూరు గ్రామంలో ఆదర్శ రైతు కృష్ణారావు ఏర్పాటు చేసిన బయో ఇన్‌పుట్ సెంటర్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి సేద్యాన్ని విస్తరించేందుకు ఎంతో అవకాశం ఉందని, ఆ దిశగా గిరిజన రైతులు కృషి చేయాలన్నారు. అందుకు గాను ప్రధానంగా రసాయన రహిత సేద్య పద్ధతి పాటించడంతో పాటు దేశీయ విత్తనాల వినియోగం పెరగాలన్నారు. జిల్లాను శతశాతం సేంద్రీయ ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి డోకులూరులోనే తొలి అడుగుపడాలన్నారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన దేశీయ విత్తనాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. దేశీయ విత్తనాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా రైతులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. కొత్తగా నియమితులైన ఇంటర్నల్ కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్లతో కలెక్టర్ ముచ్చటించి, జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు కృషి చేయాలని ఆకాంక్షించారు. అలాగే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించి, ప్రతి గ్రామంలో రైతులు సేంద్రీయ సేద్యాన్ని అవలంబించేలా అందరూ కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సాధికారత సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ తమర్భ బాబూరావునాయుడు మాట్లాడుతూ ప్రకృతి సేద్యంలో నేల ఆరోగ్యం, బయో ఇన్‌పుట్‌ల వినియోగం, తదితర అంశాలను ఈసందర్భంగా ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో రైతు సాధికారత సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎల్.భాస్కరరావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్ నందు, పలువురు రీసోర్సు పర్సన్లు, రైతులు, పాల్గొన్నారు.