పట్టాలెక్కనున్న మెట్రో రైలు ప్రాజెక్టు
ABN , Publish Date - Apr 11 , 2025 | 01:28 AM
విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు నాలుగేళ్లలో పూర్తికావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. విజయవాడలో దీనిపై ఆయన గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్నందున రెండింటికీ పరిష్కారం లభించేలా డబుల్ డెక్కర్ మోడల్‌లో మెట్రో ట్రాక్‌ల నిర్మాణం జరగాలన్నారు. తొలి దశలో 46.23 కి.మీ. ట్రాక్ వేస్తామని, ఇది మూడు కారిడార్లలో ఉంటుందని ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు వివరించారు.

నాలుగేళ్లలో పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
తొలి దశలో మూడు కారిడార్లు...
46.23 కిలోమీటర్ల ట్రాక్
రెండో దశలో కొమ్మాది-భోగాపురం విమానాశ్రయం కారిడార్
మొదటి దశ నిర్మాణానికి రూ.11,498 కోట్లు అవసరం
100 శాతం గ్రాంటు కేంద్రాన్ని
కోరుతున్నామన్న చంద్రబాబునాయుడు
డబుల్ డెక్కర్ మోడల్‌లో నిర్మాణం
వీఎంఆర్‌డీఏ భవనంలోకి మెట్రో రైలు కార్యాలయం
విశాఖపట్నం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు నాలుగేళ్లలో పూర్తికావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. విజయవాడలో దీనిపై ఆయన గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్నందున రెండింటికీ పరిష్కారం లభించేలా డబుల్ డెక్కర్ మోడల్‌లో మెట్రో ట్రాక్‌ల నిర్మాణం జరగాలన్నారు. తొలి దశలో 46.23 కి.మీ. ట్రాక్ వేస్తామని, ఇది మూడు కారిడార్లలో ఉంటుందని ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు వివరించారు. రెండో దశలో నాలుగో కారిడార్ కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు ఉంటుందన్నారు. మొదటి దశ నిర్మాణానికి రూ.11,498 కోట్లు అవసరమని చెప్పగా, దీనికి 100 శాతం గ్రాంటు కేంద్రాన్ని కోరుతున్నామని, సానుకూల నిర్ణయం వస్తుందని సీఎం చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తంచేశారు. విశాఖ జిల్లా నుంచి హాజరైన అధికారులు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు మొత్తం 99.8 ఎకరాలు అవసరం కాగా అందులో కేవలం తొమ్మిది ఎకరాలు మాత్రమే ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉందని, మిగిలిన భూమి అంతా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందినదేనని వివరించారు. భూసేకరణకు సుమారు రూ.882 కోట్లు అవసరం అవుతుందని వెల్లడించారు. తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకూ నిర్మించే కారిడార్‌లోనే ఎక్కువ ప్రైవేటు స్థలం సేకరించాల్సి ఉంటుందనే అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. ఆ మార్గంలో ఏడు మెట్రో స్టేషన్లు ఉంటాయని అధికారులు వివరించారు. అక్కడ షాపింగ్ మాల్స్ నిర్మించడం ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. భూసేకరణ త్వరగా పూర్తిచేసి, మిగిలిన పనులు కూడా చేపట్టడానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. అలాగే ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ కార్యాలయాన్ని అమరావతి నుంచి విశాఖపట్నం తీసుకువచ్చి, డాబాగార్డెన్స్‌లోని ఎల్‌ఐసీ భవనంలో ఏర్పాటు చేశారని, దానికి అద్దె రూపంలో ఎక్కువ వ్యయం అవుతున్నందున, తక్కువ అద్దెకు వచ్చే సిరిపురం వీఎంఆర్‌డీఏ భవనంలోకి మార్చాలని సూచించారు. దీనికి ఏర్పాట్లు చేశామని వీఎంఆర్‌డీఏ కమిషనర్ విశ్వనాథన్ సీఎంకు చెప్పారు.