మారని ఏయూ తీరు!
ABN , Publish Date - Aug 13 , 2025 | 01:03 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారుల తీరు మారడం లేదు.
దూర విద్య విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహణ
ఈసారి కూడా ప్రైవేటు కళాశాలల్లోనే!
65 కాలేజీల ఎంపిక
విద్యార్థుల నుంచి కొన్ని కళాశాలల యాజమాన్యాలు
డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఎప్పటినుంచో ఆరోపణలు
ఈ క్రమంలో ప్రభుత్వ కళాశాలల్లో నిర్వహించాలని ఇటీవల నిర్ణయం
...కానీ కార్యరూపం దాల్చని వైనం
అక్కడ పనిచేసే సిబ్బందిని మార్చే
విషయంలోనూ వెనక్కి తగ్గిన అధికారులు
విశాఖపట్నం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారుల తీరు మారడం లేదు. దూర విద్య ప్రాక్టికల్స్ ఈసారి కూడా ప్రైవేటు కళాశాలల్లోనే నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. బీఎస్సీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 18 నుంచి వచ్చే నెల మొదటి వారం వరకూ ప్రాక్టికల్స్ నిర్వహణకు ఇటు శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం వరకు 65 కాలేజీలను ఎంపిక చేశారు.
దూరవిద్య పరీక్షలు, ప్రాక్టికల్స్ నిర్వహణ కేంద్రాలుగా ఉన్న పలు కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ వ్యవహారంపై పత్రికల్లో కథనాలు రావడంతో ఉన్నతాధికారులు ఆరా తీశారు. అనేకచోట్ల మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్టు తేల్చారు. దీంతో దూర విద్య పరీక్షా కేంద్రాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాలని భావించారు. తొలుత ప్రాక్టికల్స్ నిర్వహించే బాధ్యతను ప్రభుత్వ కాలేజీలకు మాత్రమే అప్పగించాలని నిర్ణయించారు. అయితే, ఆ దిశగా ఇప్పటివరకూ అధికారులు చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రైవేటు కాలేజీలకే ప్రాక్టికల్స్ నిర్వహణ బాధ్యతను అప్పగించారు. ఈ విధంగా ఆయా కాలేజీలు భారీగా దండుకునే అవకాశాన్ని వర్సిటీ అధికారులు కల్పిస్తున్నారు.
వసూళ్లే లక్ష్యం..
ప్రాక్టికల్స్ పేరుతో విద్యార్థుల నుంచి భారీగా వసూలు చేసేందుకు ఎగ్జామ్ సెంటర్ల నిర్వహకులు సిద్ధమవుతున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకూ వసూలు చేయనున్నట్టు చెబుతున్నారు. విద్యార్థులు చెల్లించే మొత్తాన్ని బట్టి తరగతులకు, ప్రాక్టికల్స్‌కు హాజరు కావాల్సిన అవసరం లేకుండానే సదరు కాలేజీ యాజమాన్యాలు తతంగం నడిపిస్తాయి. గతంలో దూర విద్య పరీక్షలకు సంబంధించిన ప్రాక్టికల్స్‌ను ప్రభుత్వ కాలేజీల్లోనే నిర్వహించేవారు. ఆ తరువాత ప్రైవేటు కాలేజీలకు అప్పగించారు. ప్రైవేటుకు మార్చిన తరువాత ప్రాక్టికల్స్ ప్రక్రియ తూతూమంత్రంగా సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో వర్సిటీ ఆదాయానికి గండి పడుతోంది. ప్రాక్టికల్స్ నిర్వహణకు వర్సిటీ నుంచి ఆయా కాలేజీలకు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.50 వేలు నుంచి రూ.3 లక్షల వరకూ యూనివర్సిటీ చెల్లిస్తుంది. ఈ ఖర్చును తగ్గించుకునేందుకు, సక్రమంగా ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు ప్రభుత్వ కాలేజీలకు ఈ బాధ్యతలను అప్పగించడం ముఖ్యమని పలువురు సూచిస్తున్నారు. మరోవైపు దూరవిద్య కేంద్రంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఉద్యోగులను మార్చాలని వైస్ చాన్సలర్ భావించారు. ముఖ్యంగా కోర్సులు నిర్వహంచని విభాగాలకు చెందిన వారిని వెనక్కి పంపించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఫైల్ కూడా రెడీ చేశారు. కొందరు అధికారులు సంతకాలు కూడా పూర్తయ్యాయి. మళ్లీ ఏమైందో తెలియదు గానీ సదరు సిబ్బందిని అక్కడే కొనసాగిస్తున్నారు. దీనివెనుక మర్మమేమిటో అర్థం కావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఏళ్ల నుంచి పాతుకుపోయిన ఉద్యోగులను మారిస్తే దూర విద్య ప్రక్షాళన సాధ్యమవుతుందని పలువురు పేర్కొంటున్నారు.