Share News

తగ్గని గెడ్డల ఉధృతి

ABN , Publish Date - Sep 28 , 2025 | 11:08 PM

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో ఆదివారం సైతం గెడ్డల ఉధృతి కొనసాగింది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని జిల్లా వ్యాప్తంగా అల్పపీడన ప్రభావం కొనసాగుతున్నది.

తగ్గని గెడ్డల ఉధృతి
చింతూరు- వరరామచంద్రపురం మండలాల మధ్య గల వంతెన పైనుంచి ప్రవహిస్తున్న సోకిలేరు వాగు

వరద నీటితో పొంగి ప్రవహిస్తున్న వాగులు

చింతూరు డివిజన్‌లోని నాలుగు మండలాల్లో ముంపు ప్రభావం

మారుమూల గ్రామాల్లో స్తంభించిన జనజీవనం

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచన

పాడేరు/చింతూరు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో ఆదివారం సైతం గెడ్డల ఉధృతి కొనసాగింది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని జిల్లా వ్యాప్తంగా అల్పపీడన ప్రభావం కొనసాగుతున్నది.

ఇటీవల కురిసిన వర్షాలకు పాడేరు, జి.మాడుగుల మండలాల్లోని మత్స్యగెడ్డ ఉగ్రరూపం దాల్చింది. పాడేరు మండలంలోని మత్స్యగెడ్డ, రాయిగెడ్డ, చిలకలమామిడి గెడ్డ, పాడేరు, పెదబయలు మండలాలకు సరిహద్దున ఉన్న పరదానిపుట్టు గెడ్డ, జి.మాడుగుల మండలంలోని కోడిమామిడి గెడ్డ, మత్స్యగెడ్డ, ముంచంగిపుట్టు మండలంలో బూసిపుట్టు, లక్ష్మీపురం, రంగబయలు ప్రాంతాల్లోని గెడ్డలు, డుంబ్రిగుడలోని చాపరాయిగెడ్డ, సంపంగిగెడ్డ, లోచలిగెడ్డ వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, జీకేవీధి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లోని గెడ్డలకు అవతల ఉన్న పల్లెల్లోని గిరిజనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఏజెన్సీలో గత కొన్ని రోజులుగా వర్షాలు కొనసాగుతుండడంతో పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి.

ముంపు మండలాలపై దృష్టి

జిల్లాలోని చింతూరు రెవెన్యూ డివిజన్‌లోని వరద ముంపునకు గురయ్యే చింతూరు, ఎటపాక, వీఆర్‌ పురం, కూనవరం మండలాల్లో వరదల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా చింతూరు పరిసరాల్లోని శబరి, గోదావరి నదులు పొంగి ప్రవహిస్తుండడంతో సరిహద్దులోని ఒడి శా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన జాతీయ రహదారులపై సైతం వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నది. పదుల సంఖ్యలో పల్లెలు వరద ముంపులోనే ఉన్నాయి. పాడేరు డివిజన్‌ పరిధిలోని ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల మండలాల్లో అధిక వర్షాలతో చింతూరు డివిజన్‌లోని గోదావరి, శబరి నదులు ఉగ్రరూపం దాల్చడంతో వరద ముంపు ప్రభావం అధికంగా ఉంది. దీంతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు.

Updated Date - Sep 28 , 2025 | 11:08 PM