Share News

గిరి మహిళలు ఉబ్బితబ్బిబ్బు

ABN , Publish Date - Aug 16 , 2025 | 10:43 PM

ఉచిత బస్సు ప్రయాణంపై మన్యంలోని మహిళా లోకం ఆనందం వ్యక్తం చేస్తోంది. స్ర్తీశక్తి పథకాన్ని శుక్రవారం సాయంత్రం ప్రారంభించడంతో శనివారం ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సంపూర్ణంగా అందుబాటులోకి వచ్చింది. దీంతో గిరి మహిళలు శనివారం నుంచి ఉచిత ప్రయాణాన్ని సాగించి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గిరి మహిళలు ఉబ్బితబ్బిబ్బు
పాడేరు నుంచి వివిధ ప్రాంతాలకు వెళుతున్న మహిళా ప్రయాణికులు

ఆర్టీసీ బస్సుల్లో తొలి రోజు ఉచిత ప్రయాణంపై ఆనందం

అన్ని రూట్లలో ఉచిత ప్రయాణానికి అవకాశంతో మరింత లబ్ధి

(ఆంధ్రజ్యోతి- పాడేరు, పాడేరురూరల్‌)

సూపర్‌ సిక్స్‌ పథకాల్లో ఒకటైన స్రీశక్తి పథకం కింద మహిళలు ఉచిత బస్సు ప్రయాణానికి విశేష స్పందన వస్తోంది. తొలి రోజు బస్సుల్లో ప్రయాణించిన మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఏజెన్సీలోని అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ ప్రాంతాలకు చెందిన గిరిజనులు విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు ఎక్కువగా వెళుతుంటారు. చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు ప్రాంతీయులు నర్సీపట్నం, తుని ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు ప్రాంత ప్రజలు చోడవరం, అనకాపల్లి, విశాఖపట్నం వెళుతుంటారు. ఈ క్రమంలో గిరిజన ప్రాంతం నుంచి ఆయా ప్రాంతాలకు రాకపోకలు సాగించే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతగానో ఉపయోగపడుతోంది. ఉదాహరణకు ముంచంగిపుట్టు మండలానికి చెందిన పలువురు పిల్లలు విశాఖపట్నం మధురవాడ ప్రాంతంలో చదువుకుంటున్నారు. పిల్లలను చూడాలనుకునే తల్లులు నేరుగా ముంచంగిపుట్టు నుంచి మధురవాడ వెళ్లే బస్సులో ఉచితంగా రాకపోకలు సాగించవచ్చును. ఇలా ఏజెన్సీ నుంచి ఇతర మండలాలతో పాటు ఉమ్మడి విశాఖపట్నం ప్రాంతాల్లోనూ ఉచితంగానే రాకపోకలు సాగించే అవకాశం రావడంతో గిరి మహిళలు ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. వారపు సంతలకు వెళ్లే గిరిజన మహిళలకు ఉచిత ప్రయాణంతో మరింత ఊరటగా ఉంటుంది.

ఘాట్‌మార్గం ఆంక్షలు సడలింపుతో సంతోషం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో ఘాట్‌ మార్గాల్లో అవకాశం లేదనే విషయం తెలుసుకున్న గిరిజన మహిళలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈక్రమంలో మన్యంలోని పరిస్థితులను ‘ఆంధ్రజ్యోతి’ ‘స్త్రీశక్తికి అడ్డంకి’ శీర్షికన ప్రచురించిన కథనానికి ప్రభుత్వం స్పందించింది. ఘాట్‌ మార్గం అనే ఆంక్షలను తొలగించింది. దీంతో ఏజెన్సీలోని మహిళలకు ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేసే అవకాశం దక్కడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆర్‌టీసీ అధికారుల ప్రతిపాదనలతో స్థానిక డిపోకు 10 నుంచి 15 బస్సులు అదనంగా ప్రభుత్వం సమకూర్చితే మన్యంలో పూర్తిస్థాయిలో స్త్రీశక్తి పథకం అమలవుతుందని పలువురు అంటున్నారు.

ఇచ్చిన మాట నేరవేర్చిన చంద్రన్న

గల్లంగి జయంతి, జాంకారవలస, డుంబ్రిగూడ మండలం

ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేస్తూ చంద్రన్న మాట నిలబెట్టుకున్నారు. మన్యంలో స్త్రీశక్తి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత బస్సు ప్రయాణం గిరిజన ప్రాంత మహిళలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని సక్రమంగా అమలు చేయడంతో కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలను, ఆదరాభిమానాలను పొందుతుంది.

ఆనందంగా ఉంది..

లకే తేజావతి, వర్తనాపల్లి, పాడేరు మండలం

గిరిజన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు ఎంతో ఆనందంగా ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు పడే గిరిజన ప్రాంత మహిళలకు ఎక్కడికి వెళ్లిన ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు. పథకాల అమలులో కూటమి ప్రభుత్వం చొరవ చూపడం శుభపరిణామం.

మహిళల పక్షపాతి కూటమి ప్రభుత్వం

నిక్కుల గంగమ్మ, సీతగుంట, పెదబయలు మండలం

అల్లూరి జిల్లాలో అన్ని రూట్‌లకు ఉచిత బస్సులను ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం మహిళల పక్షపాతిగా నిరూపించుకుంది. మహిళల సంక్షేమానికి ఏడాదికి మూడు గ్యాస్‌ సిలెండర్లు, డ్వాక్రా రుణాలు అందించారు. ఇప్పుడు ఎక్కడికి అయినా వెళ్లడానికి మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించి మహిళల హృదయాల్లో చంద్రబాబు చెరగని ముద్ర వేసుకున్నారు.

Updated Date - Aug 16 , 2025 | 10:43 PM