Share News

గ్రామ సింహాల బెడద

ABN , Publish Date - Sep 05 , 2025 | 01:05 AM

అచ్యుతాపురం, మోసయ్యపేట, వెదురువాడ పంచాయతీలు, పూడి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ పరిసరాల్లో గ్రామ సింహాలు స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా ప్రధాన రహదారులు, వీధుల్లో గుంపులుగా సంచరిస్తున్నాయి. పక్కనే వున్న మునగపాక మండలంలోని పలు గ్రామాల్లో కుక్కల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు.

గ్రామ సింహాల బెడద
అచ్యుతాపురం ప్రధాన రహదారిలో గుంపుగా చేరిన కుక్కలు

ప్రధాన రహదారులు, వీధుల్లో గుంపులుగా సంచారం

నానాటికీ పెరిగిపోతున్న శునకాల సంతతి

రోడ్లపైకి రావడానికి భయపడుతున్న జనం

అచ్యుతాపురం/ అచ్యుతాపురం రూరల్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): అచ్యుతాపురం, మోసయ్యపేట, వెదురువాడ పంచాయతీలు, పూడి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ పరిసరాల్లో గ్రామ సింహాలు స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా ప్రధాన రహదారులు, వీధుల్లో గుంపులుగా సంచరిస్తున్నాయి. పక్కనే వున్న మునగపాక మండలంలోని పలు గ్రామాల్లో కుక్కల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో అక్కడి నుంచి పలు కుక్కలు అచ్యుతాపురం మండలంలోకి వచ్చేస్తున్నాయి. రహదారులపై గుంపులుగా సంచరిస్తుండడంతో ఎక్కడ తమపై దాడి చేస్తాయోనని చిన్నారులు, వృద్ధులు, మహిళలు భయపడుతున్నారు. పంచాయతీ సిబ్బంది గతంలో ఏడాదికి ఒకసారి కుక్కలను పట్టి, దూరంగా కొండప్రాంతాల్లోకి తీసుకెళ్లి విడిచిపెట్టేవారు. అయితే దీనిపై కొన్ని స్వచ్ఛంద సంస్థలు కోర్టులో పిటిషన్‌ వేయడంతో పంచాయతీ సిబ్బంది అప్పటి నుంచి కుక్కల పట్టివేతను నిలుపుదల చేశారు. దీంతో గ్రామాల్లో కుక్కల సంతతి విపరీతంగా పెరిగిపోతున్నది. రాత్రిపూట విధులకు హాజరయ్యే ఉద్యోగులు, అదే విధంగా విధులు ముగించుకుని ద్విచక్ర వాహనాలపై ఇళ్ల వెళ్లే ఉద్యోగులు కుక్కల గుంపులను చూసి భయపడుతూ ప్రయాణం సాగిస్తున్నారు. వీధి కుక్కలు కరిస్తే.. ర్యాబిస్‌ వ్యాధిబారిన పడే ప్రమాదం వుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగా కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని ఐద్వా మండల కన్వీనర్‌ ఆర్‌.లక్ష్మి గురువారం ఎంపీడీఓ చిన్నారావుకు వినతిపత్రం అందించారు.

Updated Date - Sep 05 , 2025 | 01:06 AM