ఈదురు గాలుల బీభత్సం
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:01 PM
ఎలమంచిలి పట్టణంలో ఆదివారం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటల వరకు ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.
ఎలమంచిలిలో పలు చోట్ల నేలకొరిగిన చెట్లు, విరిగిపడిన విద్యుత్ స్తంభాలు
గంటన్నర పాటు భారీ వర్షం
రహదారులు జలమయం
జనజీవనానికి అంతరాయం
సబ్బవరంలోనూ అదే పరిస్థితి
ఎలమంచిలి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి పట్టణంలో ఆదివారం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటల వరకు ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఎక్కడికక్కడే విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు పడ్డాయి. గంటన్నర పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రధానంగా లైను కొత్తూరు ప్రధాన రోడ్డు, పెదపల్లి జంక్షన్ సమీపంలో హైవేపై చెట్లు పడిపోవడంతో కొద్ది సేపు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పట్టణంలో పలు ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. ప్రధాన రోడ్డు, కొత్తపేట, ఎల్‌ఐసీ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం రోడ్డు, క్లబ్ రోడ్లపై వర్షపు నీరు ప్రవహించింది. పోస్టాఫీసు వీధిలో విద్యుత్ తీగలపై చెట్లు పడిపోవడంతో తీగలు తెగిపోయాయి. దీంతో అంధకారం నెలకొంది. కొక్కిరాపల్లి సమీపంలో పిడుగుపాటుకు గేదె మృతి చెందింది. విద్యుత్, మునిసిపల్, అగ్నిమాపక, రెవెన్యూ, శానిటరీ, పోలీసు శాఖల అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఈ వర్ష బీభత్సానికి సుమారు 20కిపైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగి ఉండవచ్చని విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నాయి.
సబ్బవరంలో...
సబ్బవరం: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలోని గాలిభీమవరం వెళ్లే మార్గంలో లగిశెట్టిపాలెం ఎస్సీ కాలనీ వద్ద విద్యుత్ లైనుపై వేప చెట్టు కూలడంతో మూడు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. సబ్బవరం- చోడవరం రోడ్డులో గొటివాడ వద్ద పాడి రైతు మడక సూర్యనారాయణ పశువుల కల్లం వద్ద ఈదురు గాలులకు భారీ టేకు వృక్షం ఆవుపై పడడంతో అది మృతి చెందింది. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని ఏపీఈపీడీసీఎల్ ఏఈ వీరేంద్ర తెలిపారు. కాగా గొలుగొండ మండలంలో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు పాడి గేదె, ఆవు మృతి చెందాయి. నర్సీపట్నం, దేవరాపల్లిలో కూడా భారీ వర్షం కురిసింది.