Share News

ఈదురు గాలుల బీభత్సం

ABN , Publish Date - Jul 09 , 2025 | 12:42 AM

మన్యంలో మంగళవారం ముసురు వాతావరణం కొనసాగింది. అయితే వర్షం కురవలేదు. కానీ ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అరకు, చింతపల్లి, అనంతగిరి మండలాల్లో పలు చోట్ల చెట్టు విరిగి రోడ్డుపై పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఈదురు గాలుల బీభత్సం
చింతపల్లి మండలం వంతలపాడు రహదారిపై కూలి పడిన భారీ వృక్షం

- అరకు, చింతపల్లి, అనంతగిరి మండలాల్లో విరిగి పడిన చెట్లు

- రాకపోకలకు అంతరాయం

పాడేరు, జూలై 8(ఆంధ్రజ్యోతి): మన్యంలో మంగళవారం ముసురు వాతావరణం కొనసాగింది. అయితే వర్షం కురవలేదు. కానీ ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అరకు, చింతపల్లి, అనంతగిరి మండలాల్లో పలు చోట్ల చెట్టు విరిగి రోడ్డుపై పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఒడిశాను ఆనుకుని ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, డుంబ్రిగుడ, జీకేవీధి ప్రాంతాల్లో తుఫాన్‌ వాతావరణం కొనసాగుతున్నది. తాజా వాతావరణంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. అయితే మంగళవారం గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులేదు. కొయ్యూరులో 30.3, చింతపల్లిలో 26.5, అనంతగిరిలో 26.1, జిమాడుగులలో 25.4, జీకేవీధిలో 23.9, పెదబయలులో 23.3, హుకుంపేటలో 23.1, పాడేరులో 22.9, అరకులోయలో 22.8, డుంబ్రిగుడలో 22.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

విరిగిపడిన వృక్షాలు

చింతపల్లి: పాడేరు-చింతపల్లి ప్రధాన రహదారి వంతలపాడు, వంగసార గ్రామ సమీపంలో రెండు భారీ వృక్షాలు రోడ్డుపై విరిగి పడ్డాయి. దీంతో మూడు గంటల పాటు రాకపోకలు స్తంభించిపోయాయి. అన్నవరం పోలీసుల చొరవతో వృక్షశకలాలను తొలగించడంతో రాకపోకలు యథావిధిగా సాగాయి. ఏజెన్సీ వ్యాప్తంగా వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం వర్షం లేకపోయినప్పటికి గాలులు అధికంగా వీచాయి. దీంతో పనసలపాడు, వంగసార గ్రామ సమీపంలో రెండు భారీ వృక్షాలు మధ్యాహ్నం రెండు, మూడు గంటల మధ్య వేర్లతో పాటు రహదారికి అడ్డంగా పడిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న అన్నవరం ఎస్‌ఐ జి.వీరబాబు, ఏపీఎస్పీ పోలీసులు పనసలపాడు గ్రామం వద్ద వృక్షాన్ని రెండు గంటలు శ్రమించి తొలగించారు. వంగసార వద్ద స్థానిక గిరిజనులు వృక్షాన్ని తొలగించారు. ఈ మార్గంలో మూడు గంటల పాటు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.

అరకులోయలో..

అరకులోయ: స్థానిక పాత పోస్టాఫీసు సమీపంలోని భారీ నీలగిరి వృక్షం కూలిపోయింది. పెదలబుడు ఎంపీటీసీ సభ్యుడు దురియా ఆనందరావు ఇంటికి సమీపంలో ఈ చెట్టు కూలడంతో ఆ ఇల్లు కొంత మేర దెబ్బతింది. వరండాలో ఉన్న వ్యాన్‌ కూడా కొంత మేర ధ్వంసమైంది.

వేంగడలో...

అనంతగిరి: మండలంలోని వేంగడ పంచాయతీ కేంద్రంలోని రోడ్డును ఆనుకుని ఉన్న విద్యుత్‌ స్తంభాలపై మంగళవారం సిల్వర్‌ ఓక్‌ చెట్టు విరిగిపడడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.. చెట్టు విరిగిపడిన ధాటికి విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. దీంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

సీలేరులో...

సీలేరు: జీకేవీధి మండలం సీలేరులో ముసురు వాతావరణం నెలకొంది. మంగళవారం కురిసిన వర్షానికి జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. రోడ్లు చిత్తడిగా మారడంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు.

Updated Date - Jul 09 , 2025 | 12:42 AM