ఈదురు గాలుల బీభత్సం
ABN , Publish Date - Jun 09 , 2025 | 01:24 AM
మండలంలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.
వడ్డాది-పాడేరు రోడ్డులో గరికబంద వద్ద కూలిన చింతచెట్టు
మూడు గంటలపాటు స్తంభించిన ట్రాఫిక్
పలుచోట్ల కూలిన విద్యుత్ స్తంభాలు
మాడుగుల రూరల్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి):
మండలంలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. వర్షం మోస్తరుగా పడినప్పటికీ పెను గాలులు వీచడంతో పలుచోట్ల చెట్టు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. అంతకుముందు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండతోపాటు ఉక్కపోత వాతావరణం నెలకొంది. సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఆకాశం మేఘావృతమైంది. తొలుత తేలికపాటి గాలులు వీచాయి. కొద్దిసేపటి తరువాత గాలుత తీవ్రత పెరిగింది. దీంతోపాటు ఉరుములు, పిడుగులతో వర్షం కురిసింది. వడ్డాది-పాడేరు ఆర్‌అండ్‌బీ రోడ్డులో తాటిపర్తి దాటిన తర్వాత గరికబంద వద్ద భారీ చింతచెట్టు రోడ్డుపై పడిపోయింది. దీంతో పాడేరు వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్‌అండ్‌బీ అధికారులను కూలీలను పురమాయించి చెట్టు కొమ్మలను నరికివేయించారు. రాత్రి ఏడు గంటలకు వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. కాగా ఎం.కోడూరు, కూర్మనాఽథపురం వద్ద విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.