Share News

పెనుగాలుల బీభత్సం

ABN , Publish Date - Oct 04 , 2025 | 12:52 AM

నగరంలో గురువారం పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. దసరా రోజు ఉదయం 11 గంటల సమయాన వీచిన గాలులు హుద్‌హుద్‌ తుఫాన్‌ను తలపించాయి.

పెనుగాలుల బీభత్సం

  • గంటకు 66 కి.మీ. వేగంతో గాలులు

  • నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, హోర్డింగ్‌లు

  • పలుచోట్ల రోడ్లపై నిలిపి ఉన్న కార్లు, ద్విచక్ర వాహనాలకు నష్టం

  • రాకపోకలకు తీవ్ర అంతరాయం

  • హుద్‌హుద్‌ను తలపించిన వైనం

విశాఖపట్నం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):

నగరంలో గురువారం పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. దసరా రోజు ఉదయం 11 గంటల సమయాన వీచిన గాలులు హుద్‌హుద్‌ తుఫాన్‌ను తలపించాయి. ఎక్కడికక్కడే చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. హోర్డింగ్‌లు కింద పడ్డాయి. కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. వీధుల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

గురువారం ఉదయం 11 గంటల సమయంలో 66 కి.మీ. వేగంతో కొద్ది నిమిషాలు వీచిన గాలులు తీవ్రనష్టం చేకూర్చాయి. ముఖ్యంగా హుద్‌హుద్‌ సమయంలో వీధుల్లో వేసిన మొక్కలు ఏపుగా పెరిగి చెట్లుగా మారాయి. పెనుగాలులకు వాటిలో అనేకం వేళ్లతో సహా కూలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో కొమ్మలు విరిగిపడ్డాయి. తూర్పు నియోజకవర్గంలోని మద్దిలపాలెం, ఎంవీపీ కాలనీ, ఇసుకతోట, శివాజీపాలెం, ఈస్ట్‌ పాయింట్‌ కాలనీ, సర్క్యూట్‌ హౌస్‌, ఉత్తర నియోజకవర్గంలో అక్కయ్యపాలెం, సీతమ్మధార, కంచరపాలెం, మాధవధార, మర్రిపాలెం, బిర్లా జంక్షన్‌ తదితర ప్రాంతాల్లో ఎక్కువ నష్టం జరిగింది.

జీవీఎంసీ అధికారుల లెక్కల ప్రకారం 80 ప్రాంతాల్లో 168కి పైగా చెట్లు నేలకూలాయి. మరికొన్ని ఒరిగిపోయాయి. జీవీఎంసీ కార్యాలయం సమీపానున్న ఒక షాపింగ్‌ కాంప్లెక్స్‌లో పెద్ద హోర్డింగ్‌ ఏర్పాటుచేయగా గాలులకు అది గోడతో సహా కూలిపోయింది. పలుచోట్ల చెట్లు పడి కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. చెట్లు, కొమ్మలు విరిగి అడ్డంగా పడడంతో వర్షం తెరిపిచ్చిన తరువాత రోడ్లపైకి వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీవీఎంసీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన రంగంలో దిగి విరిగిన చెట్లను, కొమ్మలను పక్కకు తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు. ప్రజారోగ్యం, ఉద్యానవన, మెకానికల్‌ సిబ్బంది అంతా ఇవే పనుల్లో నిమగ్నమయ్యారు. కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ దగ్గరుండి పనులు పర్యవేక్షించారు. ఇందుకోసం ఎనిమిది ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. చెట్ల తొలగింపునకు 17 జేసీబీలను తీసుకువచ్చారు. శుక్రవారం సాయంత్రానికి 145 చెట్లు తొలగించారు. మిగిలిన చెట్ల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. జీవీఎంసీ పరిధిలో తొమ్మిది విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగినట్టు గుర్తించి, వాటిని కూడా పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.

విద్యుత్‌ శాఖకు రూ.10.98 లక్షల నష్టం

65 ప్రాంతాల్లో నేలకొరిగిన స్తంభాలు

యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ

విశాఖపట్నం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):

నగరంలో వర్షాలు, పెనుగాలుల వల్ల విద్యుత్‌ శాఖకు రూ.10.98 లక్షల నష్టం వాటిల్లింది. సర్కిల్‌ పరిధిలో 65 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. విశాఖ సర్కిల్‌లో మూడు డివిజన్లు ఉండగా చాలాచోట్ల విద్యుత్‌ లైన్లపై భారీవృక్షాలు, విరిగిన కొమ్మలు పడి విద్యుత్‌ వ్యవస్థకు నష్టం వాటిల్లింది. సర్కిల్‌ పరిధిలో 33 కేవీ ఫీడర్లు మొత్తం 95 ఉండగా వాటిలో 39 దెబ్బతిన్నాయి. 11 కేవీ ఫీడర్లు 574 ఉండగా వాటిలో 120 పాడయ్యాయి. వీటన్నింటిని యుద్ధ ప్రాతిపాదికన పునరుద్ధరించామని సర్కిల్‌ ఎస్‌ఈ జి.శ్యాంబాబు శుక్రవారం తెలిపారు. సీతమ్మధార, మర్రిపాలెం, సాగర్‌ నగర్‌ ప్రాంతాలు బాగా ప్రభావితమయ్యాయని, అక్కడే ఎక్కువ నష్టం జరిగిందన్నారు.

Updated Date - Oct 04 , 2025 | 12:52 AM