ఈదురుగాలుల బీభత్సం
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:47 PM
బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో జిల్లాలో గురువారం ఈదురుగాలులతో కూడినభారీ వర్షాలు కురిశాయి. గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పాడేరు, జి.మాడుగుల మండలాల్లోని మత్స్యగెడ్డ పాయలు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, జీకేవీధి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లోని గెడ్డలకు అవతల ఉన్న పల్లెల్లోని గిరిజనం ఇళ్లకే పరిమితమయ్యారు.
గాలులతో కూడిన భారీ వర్షాలు
వరద నీటితో పొంగి ప్రవహిస్తున్న గెడ్డలు
పాడేరు డివిజన్‌లో ఏపీఈపీడీసీఎల్‌కు తీవ్ర నష్టం
గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ
చింతూరు డివిజన్‌లో తీవ్రమైన ముంపు సమస్య
పాడేరు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎగువ ప్రాంతాలైన ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల ప్రాంతాల్లో భారీ వర్షాల నేపథ్యంలో దిగువన ఉన్న గోదావరి, శబరి నదుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో చింతూరు రెవెన్యూ డివిజన్‌లో వరద ఉధృతం కావడంతో గోదావరికి రెండో హెచ్చరికను అధికారులు జారీ చేశారు. చింతూరు, ఎటపాక, వీఆర్.పురం, కూనవరం మండలాల్లో వరదల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. చింతూరు పరిసరాల్లోని శబరి, గోదావరి నదులు పొంగి ప్రవహిస్తుండడంతో సరిహద్దులోని ఒడి శా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన జాతీయ రహదారులపై సైతం వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నది. అలాగే కూనవరం మండలంలోని అధిక గ్రామాలు ముంపులో ఉండగా, పంట పొలాలు పూర్తిగా నీటి మునిగాయి. గోదావరి, శబరి నదులు ఉగ్రరూపం దాల్చడంతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం సూచించింది. అలాగే వరదలకు వై.రామవరం, వీఆర్.పురం, ఏటపాక మండలాల్లో 38 గ్రామాల్లో 587 మంది రైతులకు చెందిన 370 ఎకరాల్లో వరి, 5 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లిందని వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
విద్యుత్ పంపిణీ సంస్థకు భారీ నష్టం
ఈదురుగాలులతో కూడిన వర్షానికి పాడేరు డివిజన్‌లో ఏపీ ఈపీడీసీఎల్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏజెన్సీలో చింతపల్లి, కొయ్యూరు, జి.మాడుగుల, పెదబయలు, అనంతగిరి, అరకులోయ మండలాల్లో 30 గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలాగే 12 కేవీ విద్యుత్ స్తంభాలు 21, ఎల్‌టీ స్తంభాలు 33 కూలిపోవడంతో పాటు సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లు 10 మరమ్మతులకు గురయ్యాయి. దీంతో ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ ప్రసాద్ నేతృత్వంలో సిబ్బంది యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి, ఆయా ప్రాంతాల్లో కొత్త స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అలాగే ఈదురుగాలులకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన విద్యుత్ వైర్లు పూర్తిగా కాలిపోవడంతో గురువారం రాత్రి 11 గంటల నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆ సమయంలో సిబ్బంది సెల్‌ఫోన్ వెలుగుల్లోనే బాధితులకు అవసరమైన చికిత్సలు చేశారు. విద్యుత్ సమస్య కారణంగా జనరేటర్ సహాయంతోనే ఆస్పత్రిలో విద్యుత్‌ను అందిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ డి.హేమలతాదేవి తెలిపారు.
నిచ్చెన పైనుంచి వాగు దాటిన గిరిజనులు
అరకులోయ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):
దసరా పండుగకు వర్షం దంచికొట్టింది. గురువారం తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు కుండపోత వర్షం పడింది. దీంతో అరకులోయ నుంచి చొంపి మార్గంలోని చొంపి గెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గెడ్డ ఉధృతి తగ్గకపోవడం, మరోవైపు చీకటి కమ్ముకోవడంతో చొంపి వైపు వెళ్లే గ్రామ యువకులు పెద్ద నిచ్చెనను వేసి, నడుంకు తాడు కట్టుకొని నిచ్చెన పైనుంచి ఆవల వైపు వెళ్లారు. దసరా సందర్భంగా వర్షం కురవడంతో సందడి లేకుండా పోయింది. చివరకు వాహనాలకు పూజలు చేసేందుకు కూడా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
వనభంగిపాడు పాఠశాల భవనం నేలమట్టం
జి.మాడుగుల, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : భారీ వర్షానికి మండలంలోని పాలమామిడి పంచాయతీ వనభంగిపాడు ప్రభుత్వ పాఠశాల భవనం నేలమట్టమైంది. ఈ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో తాత్కాలిక షెడ్డులో తరగతులు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి భవనం కూలిపోయింది. శుక్రవారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం స్పందించిన నూతన పాఠశాల భవనం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
పాడేరు ఘాట్‌లో నేలకొరిన భారీ వృక్షం
పాడేరురూరల్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): వాయుగుండం నేపథ్యంలో గురువారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి పాడేరు ఘాట్‌లో భారీ చెట్టు పడిపోవడంతో మూడు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘాట్ రోడ్డులోని వంట్లమామిడి-12వ మైళ్లురాయి గ్రామాల మధ్య గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో భారీ వృక్షం ప్రధాన రహదారికి అడ్డంగా కూలిపోయింది. మూడు గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు, చిన్నపిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. స్థానికులు, ప్రయాణికులు కలిసి చెట్టు కొమ్మలను తొలగించడంతో ద్విచక్రవాహనదారులు రాకపోకలు సాగాయి. ఈ విషయం తెలుసుకున్న ఆర్‌అండ్‌బీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని చెట్టును తొలగించడంతో మూడు గంటల తరువాత వాహన రాకపోకలు ప్రారంభమయ్యాయి.
కోతకు దెబ్బతిన్న దొరగూడ రహదారి
ముంచంగిపుట్టు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు కుండ పోత వర్షం పడింది. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షం కురిసింది. గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి లక్ష్మీపురం పంచాయతీ ఉబ్బెంగుల, దొరగూడ గ్రామాల మధ్య గల ప్రధాన మట్టి రహదారి దెబ్బతింది. దొరగూడ సమీపంలో రహదారి భారీగా కోతకు గురికావడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పాదచారులు అత్యంత కష్టంపై రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఆరు కిలోమీటర్ల రహదారి రూపురేఖలు మారిపోయాయి. అలాగే లక్ష్మీపురం, బూసిపుట్టు, రంగబయలు, జోలాపుట్టు, సుజనకోట తదితర పంచాయతీల పరిధిలో పలు చోట్ల మత్స్యగెడ్డ పాయలు వరదనీటితో ఉధృతంగా ప్రవహించాయి. గెడ్డ పరివాహక ప్రాంతాల్లో జీవనం సాగించే గిరిజనులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.