Share News

మారని హోటల్స్‌ తీరు!

ABN , Publish Date - Aug 23 , 2025 | 01:08 AM

నగర పరిధిలోని అనేక హోటళ్లలో నిల్వ ఆహార పదార్థాల విక్రయం యథేచ్ఛగా సాగుతోంది.

మారని హోటల్స్‌ తీరు!

  • ఎంవీపీ కాలనీలోని ‘ఆహా ఏమి రుచులు’ రెస్టారెంట్‌లో అధికారుల తనిఖీలు

  • మూడు రోజులకుపైగా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు గుర్తింపు

  • ఫ్రిజ్‌లో 85 కిలోల పదార్థాలు నిల్వ

  • బూజుపట్టిన స్థితిలో గ్రేవీలు

విశాఖపట్నం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి):

నగర పరిధిలోని అనేక హోటళ్లలో నిల్వ ఆహార పదార్థాల విక్రయం యథేచ్ఛగా సాగుతోంది. ఈ నెల తొలివారంలో ఆహార భద్రత, ప్రమాణాల శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు హోటళ్లలో రోజుల తరబడి నిల్వ ఉన్న ఆహార పదార్థాలను గుర్తించారు. తీరు మార్చుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేయడంతోపాటు కేసులు నమోదుచేశారు. అయినప్పటికీ కొన్ని హోటళ్ల తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. తాజాగా శుక్రవారం ఆహార భద్రత, ప్రమాణాల శాఖకు చెందిన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ జీవీ అప్పారావు ఎంవీపీ కాలనీలోని మిసెస్‌ ఆహా ఏమి రుచులు రెస్టారెంట్‌లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫ్రిజ్‌లో 85 కిలోల నిల్వ ఆహార పదార్థాలను ఆయన గుర్తించారు. వీటిలో చికెన్‌ బిర్యానీ, ఫ్రై, చికెన్‌ లాలీపప్‌, న్యూడిల్స్‌, ఫ్రైడ్‌ రైస్‌, ఉడక బెట్టిన గుడ్లు, అపోలో ఫిష్‌, వెజ్‌ మంచూరియా, చికెన్‌ మంచూరియా ఉన్నాయి. ఇందులో కొన్ని ఆహార పదార్థాలు దుర్వాసన వస్తున్నాయి. వాటినే వినియోగదారులకు వేడి చేసి వడ్డిస్తున్నారు. అలాగే, అత్యంత దారుణమైన స్థితిలో 20 కిలోల గ్రేవీ (కూర పులుసు) ఉంది. గ్రేవీపై బూజు పట్టడంతోపాటు దుర్వాసన వెదజల్లుతున్నట్టు అధికారులు గుర్తించారు. వీటిపై రెస్టారెంట్‌ నిర్వాహకులను ప్రశ్నించగా రెండు రోజులు కిందటివిగా అంగీకరించారు. దీంతో కొన్ని నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. నిల్వ చేసిన ఆహార పదార్థాలను విక్రయించినట్టు నిర్ధారించి కేసు నమోదుచేశారు.

తస్మాత్‌ జాగ్రత్త..

నగర పరిధిలోని అనేక హోటళ్లు, రెస్టారెంట్స్‌లో ఇదే పరిస్థితి ఉంటోందని అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నా నిర్వాహకుల్లో మార్పు రావడం లేదని చెబుతున్నారు. ఒకేసారి పెద్దమొత్తంలో వండడం, మిగిలిపోయిన వాటిని మరుసటిరోజు, ఆ మరుసటిరోజు...ఉంచి వేడి చేసి విక్రయించడం పరిపాటిగా మారిందని అధికారులు చెబుతున్నారు. మిగిలిన ఆహార పదార్థాలను పారవేయడం వల్ల నష్టం వాటిల్లుతుందన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని అప్పారావు వెల్లడించారు. కొన్నిచోట్ల కిచెన్‌లో వాతావరణం చాలా అపరిశుభ్రంగా ఉంటున్నదని, అటువంటిచోట్ల వండిన ఆహార పదార్థాలు తినడం వల్ల అనారోగ్యం బారినపడే అవకాశం ఉందన్నారు. ఇకపోతే, కొన్ని హోటల్స్‌లో రుచికోసం, రంగుకోసం ఆరోగ్యానికి హాని కలిగించే రంగులు, రసాయనాలు వినియోగిస్తున్నారన్నారు.

Updated Date - Aug 23 , 2025 | 01:08 AM