దుకాణం తెరిచారు!
ABN , Publish Date - Oct 16 , 2025 | 01:25 AM
దీపావళి నేపథ్యంలో బాణసంచా దుకాణాల ఏర్పాటు పేరుతో కొందరు దందా ప్రారంభించేశారు. బాణసంచా వ్యాపారుల సంఘాన్ని ముందుంచి నగరానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి అనుచరులు ఇద్దరు చక్రం తిప్పుతున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంతోపాటు ఎంవీపీ కాలనీలోని ఏఎస్ రాజా మైదానంలో దుకాణాలను తామే ఏర్పాటుచేసి, అనుమతులు కూడా తెస్తామని హామీ ఇస్తున్నారు. ఒక్కో దుకాణానికి రూ.1.2 లక్షలు ధర నిర్ణయించారు. జీవీఎంసీ, పోలీస్, అగ్నిమాపక శాఖల నుంచి అనుమతులు వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం దుకాణాలను ఏర్పాటుచేయాల్సి ఉన్నాసరే, అవేవీ పట్టించుకోకుండా పనులు ప్రారంభించేశారు.
బాణసంచా షాపు రూ.1.2 లక్షలు
వ్యాపారులకు అమ్మకం
అసోసియేషన్ పేరుతో ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ కోసం ఏయూకు దరఖాస్తు
ఇంకా అనుమతులు రాకుండానే దుకాణాల ఏర్పాటు పనులు ప్రారంభం
పోలీస్, జీవీఎంసీ, అగ్నిమాపక శాఖలకు సమాచారం కరువు
చక్రం తిప్పుతున్న ప్రజా ప్రతినిధి అనుచరులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
దీపావళి నేపథ్యంలో బాణసంచా దుకాణాల ఏర్పాటు పేరుతో కొందరు దందా ప్రారంభించేశారు. బాణసంచా వ్యాపారుల సంఘాన్ని ముందుంచి నగరానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి అనుచరులు ఇద్దరు చక్రం తిప్పుతున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంతోపాటు ఎంవీపీ కాలనీలోని ఏఎస్ రాజా మైదానంలో దుకాణాలను తామే ఏర్పాటుచేసి, అనుమతులు కూడా తెస్తామని హామీ ఇస్తున్నారు. ఒక్కో దుకాణానికి రూ.1.2 లక్షలు ధర నిర్ణయించారు. జీవీఎంసీ, పోలీస్, అగ్నిమాపక శాఖల నుంచి అనుమతులు వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం దుకాణాలను ఏర్పాటుచేయాల్సి ఉన్నాసరే, అవేవీ పట్టించుకోకుండా పనులు ప్రారంభించేశారు.
దీపావళికి నగరంలో బాణసంచా విక్రయాలు భారీగా జరుగుతాయి. దీంతో కొంతమంది పండగ రెండు రోజులు దుకాణం పెట్టి ఎంతో కొంత సంపాదించుకుంటారు. గత పదేళ్లుగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలోనే బాణసంచా వ్యాపారులు దుకాణాలు ఏర్పాటుచేసుకుని విక్రయాలు సాగిస్తున్నారు. వైసీపీ హయాంలో బాణసంచా దుకాణాల ఏర్పాటులో ఆ పార్టీ నేతలు జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. దుకాణాల ఏర్పాటుకోసం నాలుగు రోజులు లీజుకు ఇవ్వాలంటూ బాణసంచా వ్యాపారుల సంఘం పేరుతో ఏయూ వీసీకి లేఖ రాయించి, ఆ తర్వాత పోలీస్, జీవీఎంసీ, ఏపీఈపీడీసీఎల్, అగ్నిమాపక శాఖల నుంచి కూడా పర్మిషన్స్ తీసుకుని స్వయంగా ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో దుకాణాలు ఏర్పాటుచేసి, వాటిని వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఈ ఏడాది దీపావళి నేపథ్యంలో ఏయూ హెలీపాడ్ మైదానంలో దుకాణాల ఏర్పాటుకు అనుమతివ్వాలంటూ ‘స్టార్స్ ఫైర్ మర్చంట్ వెల్ఫేర్ అసోసియేషన్’ పేరుతో ఒకరు గత నెల 26న జీవీఎంసీ కమిషనర్‌కు లేఖ రాశారు. దీనిపై స్పష్టత కోరుతూ జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ఈనెల ఏడున ఏయూ వీసీకి లేఖ పంపించారు. ఏయూ అధికారులు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే ఏయూ హెలీపాడ్ మైదానంలో సోమవారం నుంచే దుకాణాలు ఏర్పాటు పనులు ప్రారంభించేశారు. వాస్తవానికి దుకాణాల ఏర్పాటుకు ఏయూ మైదానం లీజుకు ఇచ్చేందుకు అంగీకరిస్తే, దుకాణం పెట్టాలనుకునే వ్యక్తి స్వయంగా నిర్ణీత రుసుం చెల్లించి జీవీఎంసీకి, పోలీస్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా దరఖాస్తులను జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు పరిశీలించి లేదంటే నేరుగా పోలీస్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకుంటే అక్కడి నుంచి జీవీఎంసీకి, అగ్నిమాపక శాఖ, ఈపీడీసీఎల్ అధికారులకు పంపించి వారి నుంచి ఎన్‌ఓసీ వచ్చిన తర్వాత అనుమతి జారీచేస్తారు. అప్పుడు అగ్నిమాపక శాఖ నిబంధనలకు అనుగుణంగా దుకాణాలను ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏయూ అధికారులు మైదానం లీజుకు ఇవ్వకముందే దుకాణాల ఏర్పాటు పనులు జరిగిపోతుండడంతో కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్ చూసి అక్కడ దుకాణాలు ఏర్పాటుచేయడానికి వీల్లేదంటూ స్పష్టంచేసి, తక్షణం తొలగించాలని ఆదేశించారు. దీంతో కూటమి ప్రజా ప్రతినిధి ఒకరు ఏయూ వీసీతో మాట్లాడి ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి ఎదురుగా ఉన్న కొత్తమైదానంలో దుకాణాలు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరడంతో బుధవారం సాయంత్రం అంగీకరించినట్టు తెలిసింది. దీంతో అక్కడ దుకాణాల ఏర్పాటుపనులు ప్రారంభించారు. ఈ విషయం పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారుల వద్ద ప్రస్తావించగా తమకు దుకాణాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి దరఖాస్తులు రాలేదని సమాధానం ఇచ్చారు. పోలీస్ అధికారుల సూచనల మేరకు సమీప ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. అలాకాకుండా దుకాణాలు ఏర్పాటుచేసిన తర్వాత తాము వెళ్లినా ఉపయోగం ఉండదని పేర్కొంటున్నారు.
ఒక్కో దుకాణం రూ.1.2 లక్షలకు విక్రయం
బాణసంచా వ్యాపారం చేయాలనుకునేవారే దుకాణం ఏర్పాటుకోసం దరఖాస్తు చేసుకోవాలి. కానీ నగరానికి చెందిన కూటమి ప్రజా ప్రతినిధి అనుచరులు ఇద్దరు మైదానం నుంచి దుకాణాల ఏర్పాటు వరకూ జీవీఎంసీ, అగ్నిమాపక, పోలీస్ శాఖ, ఏపీఈపీడీసీఎల్ నుంచి అన్ని అనుమతులు తాము తెస్తామని హామీ ఇస్తున్నారు. అందుకు రూ.1.2 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. అసోసియేషన్‌ను ముందుపెట్టి వారిద్దరే చక్రం తిప్పుతున్నారని వ్యాపారులే పేర్కొంటున్నారు. దుకాణం ఏర్పాటుకు రూ.30 వేలకు ఒకరికి కాంట్రాక్టు ఇచ్చారని, అనుమతుల కోసం మరో రూ.30 వేలు వరకు ఖర్చుపెట్టి, మిగిలిన రూ.60 వేలు తమ జేబులో వేసుకుంటారని ఆరోపిస్తున్నారు. బినామీ పేర్లతో బల్క్‌గా దరఖాస్తులు పెట్టి, అనుమతి వచ్చిన తర్వాత కావాల్సిన వారికి వాటిని విక్రయిస్తారని చెబుతున్నారు. దీనిపై కూటమి ప్రజా ప్రతినిధులు, అధికారులు లోతుగా దృష్టిసారించి దరఖాస్తు చేసుకున్న వ్యక్తే దుకాణం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.