కదంతొక్కిన ఉక్కు నిర్వాసితులు
ABN , Publish Date - Dec 09 , 2025 | 01:45 AM
తమకు ఉపాధి కల్పించాలని, లేకుంటే వన్ టైమ్ సెటిల్‌మెంట్ చేయాలనే ప్రధాన డిమాండ్‌తో స్టీల్‌ప్లాంటు నిర్వాసిత నిరుద్యోగులు సోమవారం భారీ ఎత్తున ధర్నా చేశారు.
స్టీల్‌ప్లాంటు ప్రధాన గేటు ఎదుట ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా
కుటుంబాలతో పాల్గొన్న నిరుద్యోగులు
ఉపాధి కల్పించాలని లేనిపక్షంలో వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేయాలని డిమాండ్
ఆ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ నెలకు రూ.25 వేలు భృతి కింద చెల్లించాలని డిమాండ్
ఉక్కుటౌన్‌షిప్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి):
తమకు ఉపాధి కల్పించాలని, లేకుంటే వన్ టైమ్ సెటిల్‌మెంట్ చేయాలనే ప్రధాన డిమాండ్‌తో స్టీల్‌ప్లాంటు నిర్వాసిత నిరుద్యోగులు సోమవారం భారీ ఎత్తున ధర్నా చేశారు. ప్లాంటు ప్రధానగేటు ముందు ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ బైఠాయించారు. తొలుత ప్లాంటు కొవ్వొత్తుల జంక్షన్ వద్ద ఉదయం 8 నుంచి 9 గంటల వరకూ ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. అక్కడ నుంచి ర్యాలీగా ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. నిర్వాసిత నిరుద్యోగులకు స్టీల్‌ప్లాంటు మిగులు భూముల్లో ఎకరా చొప్పున ఇవ్వాలని, వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేయాలని, ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు జీవన భృతి చట్టాన్ని అమలు చేస్తూ నెలకు రూ.25 వేల వంతున చెల్లించాలని పెద్దఎత్తున నినదించారు. అగనంపూడి, వడ్లపూడి, అప్పికొండ, పెదగంట్యాడ, నెలిముక్కు, గంగవరం తదితర ప్రాంతాల నుంచి భారీఎత్తున నిరుద్యోగులు వారి కుటుంబ సభ్యులతో ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో నిర్వాసిత నాయకులతో సమావేశం ఏర్పాటుచేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ప్రకటించారు.
న్యాయం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి..
స్టీల్‌ప్లాంటు కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులకు తీరని అన్యాయం జరిగిందని పలువురు నాయకులు పేర్కొన్నారు. నిర్వాసితుల ధర్నాకు మద్దతు తెలిపిన పలు రాజకీయ, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ నలభై ఏళ్లుగా నిర్వాసితులు ఉపాధి కోసం ఆశతో ఎదురుచూస్తున్నా, న్యాయం జరగలేదన్నారు. నిర్వాసితుల గోడును రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అర్థం చేసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ధర్నాలో నిర్వాసిత నాయకులు పితాని భాస్కరరావు, ఉమ్మిడి అప్పారావు, దేముడు, వంశీకృష్ణ, జగన్, రమణ, రాజకీయ నాయకులు తిప్పల దేవన్‌రెడ్డి, మంత్రి రవి, కోమటి శ్రీనివాసరావు, జెర్రిపోతుల ముత్యాలు, గవర వెంకటరమణ, ప్రియాంక, గాయత్రీదేవి, కార్మిక నాయకులు డి.ఆదినారాయణ, జె.అయోధ్యరామ్, మంత్రి రాజశేఖర్, ఎన్.రామారావు, పరంధామయ్య పాల్గొన్నారు.
రాజకీయ ప్రసంగాలను అడ్డుకున్న నిర్వాసితులు....
ధర్నాకు సంఘీభావం తెలిపిన కొంతమంది నాయకులు రాజకీయ విమర్శలు చేయడంతో నిర్వాసితులు వద్దని అడ్డుకున్నారు. కేవలం నిర్వాసితుల గురించి మాట్లాడాలని, రాజకీయాలు వద్దని గట్టిగా కేకలు వేయటంతో వారు ప్రసంగాలు ఆపేశారు. నిర్వాసితులకు అండగా ఉంటామని, పోరాటాల్లో పాల్గొంటామని ప్రకటించారు.
నిర్వాసితులను నిర్లక్ష్యం చేయటం తగదు..మాజీ మంత్రి
ఉక్కు నిర్వాసితులను యాజమాన్యం, ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం తగదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. నిర్వాసితులకు ఇంత అన్యాయం జరుగుతుందని నాడు అనుకోలేదని, మంచి జరుగుతుందని భావించామని వ్యాఖ్యానించారు. తన వయస్సు సహకరించినంత వరకు ఉక్కు నిర్వాసితులకు న్యాయం జరిగేలా ఉద్యమిస్తానని పేర్కొన్నారు.
భారీ పోలీస్ బందోబస్తు
నిర్వాసితుల ధర్నా నేపథ్యంలో సౌత్ ఏసీపీ వై.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. సౌత్ పరిధిలోని అన్ని స్టేషన్‌ల నుంచి సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.