Share News

ఉపాధ్యాయ బదిలీలకు రంగం సిద్ధం

ABN , Publish Date - May 13 , 2025 | 01:22 AM

ఉపాధ్యాయుల బదిలీలకు పాఠశాల విద్యా శాఖ సిద్ధమైంది. జీవో 117 రద్దు నేపథ్యంలో కొత్తగా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం త్వరలో బదిలీలు చేపట్టనున్నది.

ఉపాధ్యాయ బదిలీలకు రంగం సిద్ధం

కొత్త మార్గదర్శకాల ప్రకారం పోస్టులు కేటాయింపు

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సుమారు 250 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు మిలుగు

మోడల్‌ ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలు నియమించాలని ప్రభుత్వ ఆదేశం

స్కూలు అసిస్టెంట్‌ పదోన్నతులపై నీలినీడలు

విశాఖపట్నం, మే 12 (ఆంధ్రజ్యోతి):

ఉపాధ్యాయుల బదిలీలకు పాఠశాల విద్యా శాఖ సిద్ధమైంది. జీవో 117 రద్దు నేపథ్యంలో కొత్తగా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం త్వరలో బదిలీలు చేపట్టనున్నది. ఒకటి, రెండు రోజుల్లో బదిలీల షెడ్యూల్‌ విడుదల కానున్నది. షెడ్యూల్‌ వచ్చే నాటికి బదిలీల ప్రక్రియలో అనుసరించాల్సిన విధివిధానాలు అమలుకు విద్యా శాఖ సన్నద్ధమవుతుంది. తాజాగా విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ప్రస్తుతం ఎన్ని పోస్టులు ఉన్నాయి?, ఎంతమంది పనిచేస్తున్నారు?, ఖాళీలు ఎన్ని?, విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను సర్దుబాటు చేయగా ఎన్ని పోస్టులు మిగులుతాయి?...అనేదానిపై జిల్లా విద్యాశాఖ కసరత్తు పూర్తిచేసింది. బదిలీల జీవో వెలువడిన తరువాత దానిలో పేర్కొన్న విధంగా బదిలీలకు దరఖాస్తులు ఆహ్వానం, అభ్యంతరాలు స్వీకరణ చేపట్టి తుదిగా కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నది.

పునర్వ్యవస్థీకరణ అనంతరం ఉమ్మడి విశాఖ జిల్లాలో అందుబాటులోకి రానున్న ఏడు రకాల పాఠశాలల్లో టీచర్లను నియమించనున్నారు. ప్రస్తుతం ఉన్న పోస్టులకు అదనంగా మరిన్ని అవసరమా?, లేక తగ్గించాలా?...అనే అంశంపై ఇప్పటికే అధికారులు ఒక అవగాహనకు వచ్చారు. దీని ప్రకారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 250 వరకు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు మిగులుతున్నట్టు గుర్తించారు. కొత్తగా రానున్న 237 మోడల్‌ ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలుగా స్కూలు అసిస్టెంట్లను నియమించాలని ప్రభుత్వం ఆదేశించినందున రమారమి 15 నుంచి 20 పోస్టులే మిగిలే అవకాశం ఉంది. ఒక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా ఉపాధ్యాయులు ఉన్నపక్షంలో...అక్కడ ఖాళీగా ఉన్న పోస్టును తొలుత మిగులుగా గుర్తిస్తారు. అనంతరం ఎనిమిదేళ్లు సర్వీస్‌ పూర్తయిన టీచర్‌ పోస్టులను పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా లెక్కలు కట్టగా ఉమ్మడి జిల్లాలో తెలుగు, ఇంగ్లీష్‌, గణితం, ఫిజికల్‌ సైన్స్‌ సబ్జెక్టులలో 250 స్కూల్‌ అసిస్టెంట్లు మిగులు ఉన్నట్టు గుర్తించారు. అయితే వారిని కొత్తగా రానున్న మోడల్‌ ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వారిలో ఎక్కువమంది సర్దుబాటుకు అవకాశం ఏర్పడింది. దీంతో వచ్చే వారంలో చేపట్టనున్న స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతులపై నీలినీడలు కమ్ముకున్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీలు లేకపోవడంతో పదోన్నతులు ఎలా ఇస్తారని పలువురు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వచ్చే రెండు నెలల్లో ఎక్కువ మంది టీచర్లు పదవీ విరమణ చేయనున్నందున...అప్పుడు ఏర్పడే ఖాళీలను పరిగణనలోకి తీసుకుని స్కూల్‌ అసిస్టెంట్‌లకు పదోన్నతులు కల్పించే అవకాశం ఉందని మరికొందరు భావిస్తున్నారు.

Updated Date - May 13 , 2025 | 01:22 AM