ఊట నీరే దిక్కు
ABN , Publish Date - Apr 27 , 2025 | 10:57 PM
మండలంలోని గోమంగి పంచాయతీ కరుగొండ గ్రామంలో తాగునీటికి గిరిజనులు అల్లాడిపోతున్నారు. గ్రామంలో మంచినీటి బోరు మరమ్మతులకు గురికావడం, బావి శిథిలావస్థకు చేరడంతో కిలోమీటరు దూరంలో ఉన్న ఊట నీరే వీరికి దిక్కు అయింది.
కరుగొండ గ్రామంలో నీటి కష్టాలు
శిథిలావస్థకు చేరిన బావి
మరమ్మతులకు గురైన బోరు
తాగునీటికి అల్లాడుతున్న గిరిజనులు
కిలోమీటరు దూరం నుంచి ఊట నీరు తెచ్చుకుంటున్న వైనం
కలుషిత జలాలతో వ్యాధులు విజృంభణ
పట్టించుకోని అధికారులు
పెదబయలు, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి):
మండలంలోని గోమంగి పంచాయతీ కరుగొండ గ్రామంలో తాగునీటికి గిరిజనులు అల్లాడిపోతున్నారు. గ్రామంలో మంచినీటి బోరు మరమ్మతులకు గురికావడం, బావి శిథిలావస్థకు చేరడంతో కిలోమీటరు దూరంలో ఉన్న ఊట నీరే వీరికి దిక్కు అయింది.
కరుగొండ గ్రామంలో సుమారు 350 మంది గిరిజనులు నివాసముంటున్నారు. గ్రామంలోని బావి కొన్నేళ్ల క్రితం శిథిలావస్థకు చేరడం, మంచినీటి బోరు మరమ్మతులకు గురికావడంతో నీటి కష్టాలు మొదలయ్యాయి. దీంతో గ్రామానికి కిలోమీటరు దూరం నుంచి ఊటనీరు తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నారు. అయితే అవి కలుషిత జలాలు కావడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. తాగునీటి కష్టాలు తీర్చాలని పలుమార్లు ప్రజాప్రతినిధులను, అధికారులను వేడుకున్నా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, గర్భిణులు సైతం కిలోమీటరు దూరం నుంచి ఊటనీరు తెచ్చుకుంటున్నారని, అధికారులు ఇప్పటికైనా స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.