స్వచ్ఛ రథాలు వచ్చేస్తున్నాయ్
ABN , Publish Date - Dec 23 , 2025 | 01:40 AM
జిల్లాలో గ్రామ పంచాయతీలకు ‘స్వచ్ఛ రథాలు’ రానున్నాయి.
జిల్లాలో అందుబాటులోకి ఆరు వాహనాలు
త్వరలో ప్రతి మండలానికి ఒక వాహనం
ప్రజల నుంచి పొడి వ్యర్థాల సేకరణ
డబ్బులకు బదులు నిత్యావసర సరుకులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో గ్రామ పంచాయతీలకు ‘స్వచ్ఛ రథాలు’ రానున్నాయి. ప్రజల నుంచి పొడి చెత్తను సేకరించేందుకు ప్రతి మండలంలో ఒక వాహనం ఉండేలా పంచాయతీ అధికారులు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు. ఇంతవరకు జిల్లాకు ఆరు ‘స్వచ్ఛ రథాలు’ (వ్యాన్లు) రాగా.. త్వరలో ప్రతి మండలానికి ఒకటి చొప్పున రానున్నాయి.
గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు విపరీతంగా పేరుకుపోతున్నాయి. వీటివల్ల పలురకాల అనర్థాలు కలుగుతున్నాయి. గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతోపాటు ఇతర పొడి చెత్త సమస్యను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ రథం’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది జూలై 10వ తేదీన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్వచ్ఛ రథాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. వీటి నిర్వహణ బాధ్యతను స్థానికులకు అప్పగించింది. ఈ వాహనాల నిర్వాహకులు గ్రామాల్లో తిరుగుతూ ప్రజల నుంచి పొడి చెత్తను సేకరిస్తారు. పాత ఇనుము కిలో రూ.20, పాత న్యూస్‌పేపర్లు రూ.15, పాత పుస్తకాలు, అట్టపెట్టెలు రూ.10, ప్లాస్టిక్ సీసాలు, పాలిథిన్ కవర్లు రూ.20, గాజుసీసాలు ఒక్కొక్కటి రూ.2, స్టీల్ వస్తువులు రూ.40, అల్యూమినియం వస్తువులు రూ.120 చొప్పున విలువ కడతారు. డబ్బులకు బదులు నిత్యావసర సరుకులను అందజేస్తారు. ఇతర జిల్లాల్లో ఇప్పటికే ప్రారంభించిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలు వస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని పభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గత శనివారం తాళ్లపాలెం పంచాయతీ బంగారయ్యపేటలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. జిల్లాకు కేటాయించిన ఆరు స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ రథాల సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో ప్రతి మండలంలో ఒక వాహనం అందుబాటులో వుండేలా గతంలో ఇంటింటికీ రేషన్ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన వాహనాలను స్వచ్ఛ రథాలుగా వినియోగించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. స్వచ్ఛ రథం ప్రతి పంచాయతీకి 15 రోజులకు ఒకసారి వెళ్లేలా అధికారులు షెడ్యూల్ రూపొందిస్తారు. వాహనాల నిర్వహణకు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు చెల్లించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
చెత్త నుంచి సంపద సృష్టి
గ్రామాల్లో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపర్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం స్వచ్ఛ రథాలను కేటాయించిందని జిల్లా పంచాయతీ అధికారి సందీప్ తెలిపారు. గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రజలకు మరింత అవగాన కల్పించడమే కాకుండా వ్యర్థాల అమ్మకం ద్వారా ఆదాయం పొందాలన్నది ప్రధాన ఉద్దేశమన్నారు.