ఇసుకాసురులు రెడీ!
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:37 AM
శారదా నదిలో వరద తగ్గుముఖం పట్టడంతో ఇసుకాసురులు అక్రమ తవ్వకాలకు తెర తీస్తున్నారు. పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల వద్ద ఇసుక తవ్వకాల (అనధికారిక) కోసం వేలం పాటలు నిర్వహిస్తున్నారు. తాజాగా గవరవరంలో ఇసుక తవ్వకాలకు రెండు రోజుల క్రితం వేలం పాట నిర్వహించినట్టు సమాచారం.
శారదా నదిలో తవ్వకాలకు సన్నద్ధం
వరద తగ్గుముఖం పట్టడంతో బయటపడుతున్న ఇసుక మేటలు
గవరవరం వద్ద తవ్వకాల కోసం వేటం పాట
ఒక్కటైన అధికార, విపక్ష పార్టీల నాయకులు
ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలతో నది గట్లకు ముప్పు
చోడవరం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): శారదా నదిలో వరద తగ్గుముఖం పట్టడంతో ఇసుకాసురులు అక్రమ తవ్వకాలకు తెర తీస్తున్నారు. పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల వద్ద ఇసుక తవ్వకాల (అనధికారిక) కోసం వేలం పాటలు నిర్వహిస్తున్నారు. తాజాగా గవరవరంలో ఇసుక తవ్వకాలకు రెండు రోజుల క్రితం వేలం పాట నిర్వహించినట్టు సమాచారం.
ప్రభుత్వం కల్పించిన ఉచిత ఇసుక పథకాన్ని కొంతమంది అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వాస్తవంగా జిల్లాలో ఎక్కడా ఇసుక రీచ్‌లు లేవు. అయితే ఇళ్ల నిర్మాణాలు, మరమ్మతు పనుల కోసం స్థానికంగా వున్న నదులు, గెడ్డల్లో ఇసుకను తవ్వి, టైరు బండ్లతో తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అయితే ముందుగా స్థానిక సచివాలయంలో అనుమతులు తీసుకోవాలి. కానీ గ్రామాల్లో రాజకీయ పెత్తనం చెలాయిస్తున్న నేతలు, నదుల్లోని ఇసుక వనరులను తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరిపిస్తున్నారు. దీంతో నదిగట్లు కోతకు గురవుతున్నాయి. వంతెనలు దెబ్బతింటున్నాయి. కాజ్‌వేలు కొట్టుకుపోతున్నాయి. మండలంలోని గవరవరం వద్ద నది గర్భంలో ఇసుకను పూర్తిగా తోడేయడంతోపాటు, నది గట్లను కూడా ఇష్జారాజ్యంగా తవ్వేశారు. ఇటీవల తుఫాన్ సమయంలో వచ్చిన వరద ఉధృతికి నది ఒడ్డున ఉన్న జడ్పీ హైస్కూల్, ఇతర ప్రభుత్వ భవనాలు కూలిపోతాయేమోనని స్థానికులు ఆందోళన చెందారు.
ఇదిలావుండగా సుమారు రెండున్నర నెలల నుంచి వర్షాల కారణంగా శారదా నదిలో వరద ప్రవాహం అధికంగా వుంది. ఎగువనున్న జలాశయాలు నిండడంతో గేట్లు ఎత్తుతున్నారు. దీంతో నదిలో వరద ఉధృతి విపరీతంగా పెరిగి, ఇసుక తవ్వకాలు జరపలేని పరిస్థితి ఏర్పడింది. గత వారం సంభవించిన తుఫాన్ కారణంగా నదులు ఉధృతంగా ప్రవహించాయి. ఇదే సమయంలో పలుచోట్ల ఇసుక మేటలు వేసింది. నదిలో వరద బాగా తగ్గడంతో ఇసుకాసురులు రంగంలోకి దిగారు. ఇసుక తవ్వకాల కోసం వేలం పాటలు నిర్వహిస్తున్నారు. గవరవరంలో ఇసుక తవ్వకాలకు మంగళవారం వేలం పాట నిర్వహించినట్టు సమాచారం. ఇందులో అధికారంలో వున్న కూటమి పార్టీలతో పాటు, ప్రతిపక్ష వైపీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. వీరి తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నదిలో, రక్షణ గట్లకు సమీపంలో ఎడాపెడా ఇసుక తవ్వకాలు జరిపితే భవిష్యత్తులో శారదా నది గట్లకు గండ్లు పడి గ్రామాన్ని వరద నీరు ముంచెత్తుతుందని ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ, గనులు, జలవనరుల శాఖ అధికారులు స్పందించి, శారదా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను నిరోధించాలని గవరవరం గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.