తగ్గని వాగుల ఉధృతి
ABN , Publish Date - Oct 30 , 2025 | 11:38 PM
మండలంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో వాగులు పొంగి ప్రవహించి మధ్యాహ్నం వరకు మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి.
కొయ్యూరు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో వాగులు పొంగి ప్రవహించి మధ్యాహ్నం వరకు మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. కాకరపాడు- కొయ్యూరు ప్రధాన రహదారిలో కాకరపాడు వద్ద కాజ్‌వే పైనుంచి వరద నీరు ప్రవహించింది. శింగవరం ఐటీడీఏ కాలనీ సమీపంలో వట్టిగెడ్డ పొంగి ప్రవహించింది. అలాగే రావణాపల్లి పంచాయతీ రేవడివీధి- కొప్పుకొండల మధ్య కొండవాగు ప్రవాహంపై నిర్మించిన కాజ్‌వే కొట్టుకుపోయింది. తొంపడం జలపాతానికి వెళ్లే మార్గమధ్యంలో పెదమాకవరం సమీప గానుగుల వద్ద కొండవాగు పొంగి ప్రవహిస్తోంది. సాయంత్రానికి వాగు ఉధృతి తగ్గడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా చిట్టింపాడులో డి.సింహాచలానికి చెందిన రేకుల ఇల్లు బుధవారం రాత్రి నేలమట్టమైంది. అలాగే రావణాపల్లి పంచాయతీ రేవడివీధి గ్రామంలో మాదల రాజబాబు, పోతురాజు, గంగ, కుమారి, లక్ష్మి, బాపనమ్మ, మల్లయ్యమ్మ, శీలపల్లి లక్ష్మి, పండ్ర గంగరాజు, నూకరత్నానికి చెందిన పూరిళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
అనంతగిరిలో..
అనంతగిరి: మండలంలో గురువారం కూడా వాగులు, గెడ్డల ఉధృతి కొనసాగింది. పెదకోట-కుడియా మఽధ్యలో కాజ్‌వే పైనుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మాలింగవలస- పాతకోట రోడ్డులోని మాలింగవలస సమీపంలోని కల్వర్టు కొట్టుకుపోవడంతో నందిగుమ్మి, రేగం, తెనెపుట్టు, తలారీపాడు, తదితర గ్రామాలకు వాహనాలు వెళ్లే అవకాశం లేకపోవడంతో గిరిజనులు కాలినడకన చేరుకోవాల్సి వస్తోంది. భీంపోల్ సమీపంలోని లువ్వా కాజ్‌వే పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గుమ్మకోట, గరుగుబిల్లి పంచాయతీలోని పలు గ్రామాల గిరిజనులు ఇళ్లకే పరిమితమయ్యారు. డముకు-నిమ్మలపాడు రోడ్డులోని జెండగరువు-బొడ్డపాడుకు మధ్యలో కిలోమీటరు మేర రోడ్డు అధ్వానంగా మారింది. నిమ్మలపాడు-వేంగడ రోడ్డులోని బందవలస గ్రామ సమీపంలో రోడ్డు దెబ్బతింది.