తగ్గని వాగుల ఉధృతి
ABN , Publish Date - Aug 29 , 2025 | 01:02 AM
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో గురువారం కూడా వాగులు, గెడ్డల ఉధృతి కొనసాగింది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని జిల్లా వ్యాప్తంగా అల్పపీడన ప్రభావం కొనసాగుతున్నది. మంగళ, బుధవారాలు కురిసిన వర్షాలకు పాడేరు, జి.మాడుగుల మండలాల్లోని మత్స్యగెడ్డ ఉగ్రరూపం దాల్చింది.
- వరద నీటితో పొంగి ప్రవహిస్తున్న గెడ్డలు
- పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
- జనజీవనం అస్తవ్యస్తం
- చింతూరు డివిజన్‌లోని నాలుగు మండలాలు, పాడేరు డివిజన్‌లో మూడు మండలాల్లో వరద ప్రభావం
పాడేరు, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో గురువారం కూడా వాగులు, గెడ్డల ఉధృతి కొనసాగింది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని జిల్లా వ్యాప్తంగా అల్పపీడన ప్రభావం కొనసాగుతున్నది. మంగళ, బుధవారాలు కురిసిన వర్షాలకు పాడేరు, జి.మాడుగుల మండలాల్లోని మత్స్యగెడ్డ ఉగ్రరూపం దాల్చింది.
పాడేరు మండలంలోని మత్స్యగెడ్డ, రాయిగెడ్డ, చిలకలమామిడి గెడ్డ, పాడేరు, పెదబయలు మండలాలకు సరిహద్దున ఉన్న పరదానిపుట్టు గెడ్డ, జి.మాడుగుల మండలంలోని కోడిమామిడి గెడ్డ, మత్స్యగెడ్డ, ముంచంగిపుట్టు మండలంలో బూసిపుట్టు, లక్ష్మీపురం, రంగబయలు ప్రాంతాల్లోని గెడ్డలు, డుంబ్రిగుడలోని చాపరాయిగెడ్డ, సంపంగిగెడ్డ, లోచలిగెడ్డ వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, జీకేవీధి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో గెడ్డలకు అవతల ఉన్న పల్లెల్లోని గిరిజనులు ఇళ్లకే పరిమితమయ్యారు. జీకేవీధి మండలంలోని రంపుల ఘాట్‌లో చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడగా అధికారులు తొలగించారు. హుకుంపేట మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఓ చెట్టు భవనంపై కూలింది. అయితే సెలవు రోజు కావడంతో ఎటువంటి సమస్య తలెత్తలేదు. అలాగే పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ ఇసుకతీగలు గ్రామ సమీపంలో కొండచరియలు విరిగిపడి గ్రామంలోకి మట్టిపెళ్లలు, బురద కొట్టుకు వచ్చాయి. ఏజెన్సీలో గత కొన్ని రోజులు వర్షాలు కొనసాగుతుండడంతో పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి.
ముంపు మండలాల్లో యంత్రాంగం అప్రమత్తం
జిల్లాలోని చింతూరు రెవెన్యూ డివిజన్‌లో వరద ముంపునకు గురయ్యే చింతూరు, ఎటపాక, వీఆర్.పురం, కూనవరం మండలాల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పాడేరు డివిజన్ పరిధిలోని ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల మండలాల్లో అధిక వర్షాలతో చింతూరు డివిజన్‌లోని గోదావరి, శబరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. దీని వలన వరద ముంపు ప్రభావం అధికంగా ఉండడంతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా అధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ దినేశ్‌కుమార్, ఎస్‌పీ అమిత్‌బర్ధార్ వేర్వేరు ప్రకటనల్లో కోరారు. అలాగే ప్రమాదకరంగా ఉన్న గెడ్డలను దాటవద్దని సూచించారు.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండల పరిధిలోని వాగులు, మత్స్యగెడ్డ పాయలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆంధ్రా, ఒడిశా ప్రాంతాలకు చెందిన సుమారు 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు కురిసిన కుండపోత వర్షానికి మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో గల కర్లాపొదర్, తుమిడిపుట్టు, ఉబ్బెంగుల, మెట్టగూడ, దొరగూడ తదితర ప్రాంతాల్లో మత్స్యగెడ్డ పాయలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పంచాయతీ కేంద్రానికి వచ్చి రేషన్ సరుకులు తీసుకువెళ్లాలన్నా, వివిధ పనుల నిమిత్తం రావాలన్నా, ఇతర అత్యవసర పరిస్థితి ఏదైనప్పటికీ ఇల్లు దాటి బయటకువెళ్లలేని పరిస్థితి నెలకొంది. గురువారం దొరగూడ ప్రాంతానికి చెందిన పలువురు గిరిజనులు టైర్ల సహాయంతో గెడ్డ దాటి వెళ్లి సరుకులను కొనుగోలు చేసి వచ్చారు. తుమిడిపుట్టు, కర్లాపొదర్ ప్రాంతాల్లో గెడ్డలపై వంతెనలు నిర్మించాలని గత ప్రభుత్వంలో కలెక్టర్, పీవోలకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చామని, కానీ అవి ఇప్పటికీ ప్రారంభం కాలేదని ఆ పంచాయతీ సర్పంచ్ కె.త్రినాథ్ తెలిపారు.
హుకుంపేటలో..
హుకుంపేట: మండల పరిధిలో గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చీడిపుట్టు కాజ్‌వే పైనుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు గురువారం కూడా రాకపోకలు నిలిచిపోయాయి.
పెదబయలులో..
పెదబయలు: మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బుధవారం తెల్లవారుజామున మారుమూల గిన్నెలకోట పంచాయతీ ఇనుపతీగల గ్రామంలో చర్చి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు పోటెత్తడంతో చర్చి వద్ద రోడ్డు బురదమయంగా మారింది. అలాగే ఇనుపతీగలు గ్రామం నుంచి గిన్నెలకోట వరకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా కోతకు గురైంది. కల్వర్టు కొట్టుకుపోవడంతో బాసల గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.