తగ్గని వాగుల ఉధృతి
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:01 AM
జిల్లాలో కురుస్తున్న వర్షాలకు గెడ్డలు, వాగుల ఉధృతి తగ్గడం లేదు. అలాగే వర్షం నీరుతో పంటపొలాలు నీట మునిగాయి. గురువారం కూడా వర్షం కొనసాగింది.
పొంగి ప్రవహిస్తున్న గెడ్డలతో గిరిజనుల అవస్థలు
రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
పాడేరు, జూలై 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కురుస్తున్న వర్షాలకు గెడ్డలు, వాగుల ఉధృతి తగ్గడం లేదు. అలాగే వర్షం నీరుతో పంటపొలాలు నీట మునిగాయి. గురువారం కూడా వర్షం కొనసాగింది. దీంతో పాడేరు మండలంలోని మత్స్యగెడ్డ, రాయిగెడ్డ, చిలకలమామిడి గెడ్డ, పాడేరు, పెదబయలు మండలాలకు సరిహద్దున ఉన్న పరదానిపుట్టు గెడ్డ, జి.మాడుగుల మండలంలోని కోడిమామిడి గెడ్డ, మత్స్యగెడ్డ, ముంచంగిపుట్టు, పెదబయలు, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లోని గెడ్డల ఉధృతి ఏ మాత్రం తగ్గలేదు. పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, డుంబ్రిగుడ మండలాల్లో గెడ్డలకు అవతల ఉన్న జనం పల్లెలకే పరిమితమవుతున్నారు. తాజా వాతావరణంతో ముఖ్యంగా జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది.
ముంచంగిపుట్టులో అత్యధిక వర్షపాతం
ఏజెన్సీలో ముంచంగిపుట్టులో గురువారం 80.2 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదుకాగా, హుకుంపేటలో 46.8, పెదబయలులో 39.4, జి.మాడుగులలో 37.4, అరకులోయలో 32.6, చింతపల్లిలో 28.8, డుంబ్రిగుడలో 20.8లో మిల్లీమీటర్లు, మిగిలిన మండలాల్లో 20 మిల్లీమీటర్ల లోపు వర్షం కురిసింది.
డుంబ్రిగుడలో..
డుంబ్రిగుడ: మండలంలో వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పోతంగి పంచాయతీ కోసంగి గ్రామ గిరిజనులు నిత్యావసర సరుకులు, అత్యవసర పనులకు గెడ్డ దాటాల్సిన పరిస్థితి ఉంది. గురువారం ఉదయం కురిసిన భారీ వర్షానికి గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తున్నా కోసంగి గ్రామ గిరిజనుడు తప్పనిసరి పరిస్థితి గెడ్డ దాటి ఇవతలి ఒడ్డుకు వచ్చాడు. వంతెన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పాడు.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండలంలో గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మారుమూల గ్రామాల గిరిజనులు ఇళ్లకే పరిమితమయ్యారు. కుమడ, దొడిపుట్టు, బూసిపుట్టు, వనుగుమ్మ, రంగబయలు, బుంగాపుట్టు గెడ్డలు, వాగులు పొంగాయి. వనగుమ్మ పంచాయతీ తర్లగూడ కల్వర్టు పైనుంచి భారీగా వరద నీరు పారుతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయా గ్రామాల గిరిజన మహిళలు రాకపోకలు సాగించారు.
పెదబయలులో..
పెదబయలు: మండలంలోని అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గుల్లెలు, జామిగూడా, కిముడుపల్లి, కుంతుర్ల పంచాయతీల్లోని పలు గ్రామాల గిరిజనులు ఇళ్లకే పరిమితమయ్యారు.
పొంగి ప్రవహిస్తున్న కొత్తపల్లి జలపాతం
జి.మాడుగుల: మండలంలో కురుస్తున్న వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గురువారం మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం అయిన కొత్తపల్లి జలపాతం వరద నీటితో పొంగి ప్రవహించింది. మద్దిగరువులో జరిగిన వారపు సంత వినియోగదారులు లేక వెలవెలబోయింది.