దారి ఘోరం.. ప్రయాణం దుర్లభం
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:25 PM
మండల కేంద్రానికి సుదూర పంచాయతీ మఠం భీమవరం ప్రధాన రహదారి అధ్వానంగా ఉండడంతో 11 మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అధ్వానంగా మఠంభీమవరం రోడ్డు
11 మండలాల ప్రజల అవస్థలు
కొయ్యూరు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రానికి సుదూర పంచాయతీ మఠం భీమవరం ప్రధాన రహదారి అధ్వానంగా ఉండడంతో 11 మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ పరిధిలోని సుమారు 166 గ్రామాల ప్రజలు ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంటారు. మఠంభీమవరం నుంచి చిలకలపాలెం మీదుగా వై.రామవరం ప్రధాన రహదారి 15 కిలోమీటర్ల పొడవున కోతకు గురై, కనీసం నడవడానికి కూడా అనువుగా లేకుండా ఉంది. గత రెండు దశాబ్దాలుగా రహదారి దుస్థితిపై ఆయా గ్రామాల ప్రజలు పాలకులకు, అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. జిల్లా విభజనకు పూర్వం ఈ రహదారి నిర్మాణానికి ఉమ్మడి విశాఖపట్నం, జిల్లా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రోడ్లు భవనాలశాఖ, అటవీశాఖాధికారులు సర్వేలు నిర్వహించి ఫారెస్టు భూమి ఏ మేరకు అవసరమో గుర్తించారు. అనంతరం ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. అయితే, ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన అటవీశాఖ అధికారులు రిజర్వు ఫారెస్టు భూమిపై పూర్తిస్థాయిలో నివేదికలు ఇచ్చినప్పటికీ అప్పటి తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం అసంపూర్తి సమాచారంతో నివేదికలివ్వడంతో ఈ ఫైల్‌ను వెనక్కి పంపింది. దీంతో ఈ రహదారి నిర్మాణానికి తిరిగి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆ తరువాత జిల్లాల విభజన జరగడంతో గతంలో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న రంపచోడవరం, గుర్తేడు, చింతూరు తదితర ప్రాంతాలు అల్లూరి జిల్లాలో విలీనం కావడంతో ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగించే 11 మండలాలకు చెందిన సుమారు 140 గ్రా మాల ప్రజలకు కష్టాలు తప్పడం లేదు.
అదనంగా 160 కిలో మీటర్ల ప్రయాణం
ఈ రహదారి పూర్తిగా శిథిలం కావడంతో ఆయా 11 మండలాల వాసులు జిల్లా కేంద్రానికి రావాలంటే అదనంగా మరో 160 కిలోమీటర్లు తిరిగి ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. అంతకన్నా ప్రధానంగా మండలానికి చెందిన మఠం భీమవరం పంచాయతీలో చేరిన 26 గ్రామాల ప్రజలు మండల కేంద్రం రావాలంటే అదనంగా మరో 140 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. అత్యవసర సమయాల్లో ఈ గ్రామాల ప్రజలు తీవ్ర రవాణా కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు చొరవ చూపి అటవీశాఖ అడ్డంకులు తొలగించి, రహదారి నిర్మాణం చేపట్టాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.