Share News

దారి ఘోరం.. ప్రయాణం దుర్లభం

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:47 AM

మండలంలోని పినగాడి- కె.కోటపాడు రోడ్డు పలు చోట్ల గోతులమయంగా ఉంది. ఏడాదిగా ఈ రోడ్డు అధ్వానంగా తయారుకావడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దారి ఘోరం.. ప్రయాణం దుర్లభం
పినగాడి- కోటపాడు మార్గంలో పినగాడి జంక్షన్‌ సమీపంలో గోతులమయంగా రోడ్డు

- గోతులమయంగా పినగాడి- కె.కోటపాడు రోడ్డు

- ప్రమాదాలకు గురవుతున్న వాహనచోదకులు

- పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు

సబ్బవరం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పినగాడి- కె.కోటపాడు రోడ్డు పలు చోట్ల గోతులమయంగా ఉంది. ఏడాదిగా ఈ రోడ్డు అధ్వానంగా తయారుకావడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పినగాడి జంక్షన్‌ సమీపంలో కోటపాడు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఇటీవల భారీ నిర్మాణాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న గెడ్డలను వ్యాపారులు పూడ్చేశారు. గెడ్డలు పూడ్చేయడమే కాకుండా రోడ్డుకు ఇరువైపులా మట్టితో కప్పేసి కాంక్రీటు తాపడాలతో ఎత్తు చేయడంతో పినగాడి జంక్షన్‌ నుంచి కోటపాడు వెళ్లే రోడ్డు లోతట్టుగా మారింది. దీంతో వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయి గోతులు ఏర్పడ్డాయి. ఈ మార్గంలో రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో మరింత అధ్వానంగా తయారైంది. అదే విధంగా మలునాయుడుపాలెం గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ఆర్‌అండ్‌బీ స్థలాలు ఆక్రమించుకొని కప్పేయడంతో వరద నీరు ప్రవహించే మార్గం లేక ఆ నీరు రోడ్డుపై ప్రవహించి పలు చోట్ల ధ్వంసమైంది. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు, ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి పినగాడి-కె.కోటపాడు రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని, రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Sep 14 , 2025 | 12:47 AM