దారి ఘోరం
ABN , Publish Date - May 21 , 2025 | 11:40 PM
రహదారి అంతా గోతులమయం. రాకపోకలు సాగించాలంటే నరకం. ఇటుగా ప్రయాణిస్తే ఒళ్లు హూనం కావలసిందే.. ఇదీ బొర్రా- కోనాపురం రోడ్డు పరిస్థితి. కొన్నేళ్లుగా రహదారి నిర్వహణను గాలికి వదిలేయడంతో ఈ దుస్థితి నెలకొంది.
అధ్వానంగా బొర్రా- కోనాపురం రోడ్డు
20 గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు
పట్టించుకోని అధికారులు
అనంతగిరి, మే 21(ఆంధ్రజ్యోతి): రహదారి అంతా గోతులమయం. రాకపోకలు సాగించాలంటే నరకం. ఇటుగా ప్రయాణిస్తే ఒళ్లు హూనం కావలసిందే.. ఇదీ బొర్రా- కోనాపురం రోడ్డు పరిస్థితి. కొన్నేళ్లుగా రహదారి నిర్వహణను గాలికి వదిలేయడంతో ఈ దుస్థితి నెలకొంది.
పదిహేడేళ్ల క్రితం గిరిజన సంక్షేమశాఖ నిధులతో అనంతగిరి, అరకులోయ మండలాలను కలుపుతూ బొర్రా నుంచి కోనాపురం మీదుగా లోతేరు, గన్నెల, ఇరగాయి పంచాయతీలకు రహదారి నిర్మించారు. అయితే అప్పటి నుంచి కనీస మరమ్మతులకు నోచుకోకపోవడంతో రోడ్డంతా ఎక్కడికక్కడ గోతులమయంగా మారింది. మరికొన్ని చోట్ల రోడ్డంతా కొట్టుకుపోయి ప్రయాణానికి వీలు లేకుండా తయారైంది. దీని వల్ల కితలింగి, కరాయిగుడ, బోందుగుడ తదితర సుమారు 20 గ్రామాల గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రహదారికి మరమ్మతులు చేయాలని పలు గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు, అధికారులను వేడుకుంటున్నా ఫలితం లేకపోయింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఈ రహదారికి మరమ్మతులు చేయాలని సర్పంచ్ గుబాయి అప్పలమ్మ, చిలకలగెడ్డ ఎంపీటీసీ సభ్యుడు తెడబారికి మితుల, పలువురు గిరిజనులు కోరుతున్నారు.