రహదారి ఇలా.. ప్రయాణమెలా?
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:51 AM
మండలంలోని పర్యాటక ప్రాంతమైన యర్రవరం జలపాతానికి వెళ్లే ప్రధాన రహదారి వర్షాలకు అధ్వానంగా తయారైంది. నిర్మాణ దశలో ఉన్న రహదారి వర్షాలకు కోతకు గురైంది. తారు రోడ్డు నిర్మాణానికి ప్రాథమికంగా చేపట్టిన వెట్‌మిక్స్ వర్షపు నీటి ప్రవాహానికి పలు చోట్ల కొట్టుకుపోయింది. ప్రస్తుతం పర్యాటకులు, స్థానిక ఆదివాసీలు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు.
అధ్వానంగా యర్రవరం జలపాతం రోడ్డు
వర్షాలకు కోతకు గురికావడంతో రాకపోకలకు ఇబ్బందులు
ఆదివాసీలు, పర్యాటకులకు తప్పని అవస్థలు
చింతపల్లి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): మండలంలోని పర్యాటక ప్రాంతమైన యర్రవరం జలపాతానికి వెళ్లే ప్రధాన రహదారి వర్షాలకు అధ్వానంగా తయారైంది. నిర్మాణ దశలో ఉన్న రహదారి వర్షాలకు కోతకు గురైంది. తారు రోడ్డు నిర్మాణానికి ప్రాథమికంగా చేపట్టిన వెట్‌మిక్స్ వర్షపు నీటి ప్రవాహానికి పలు చోట్ల కొట్టుకుపోయింది. ప్రస్తుతం పర్యాటకులు, స్థానిక ఆదివాసీలు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు.
మండలంలోని గొందిపాకలు పంచాయతీ పరిధిలోని యర్రవరం జలపాతం ఉంది. ఈ జలపాతానికి ఆనుకుని ఎనిమిది గిరిజన గ్రామాలు ఉన్నాయి. జలపాతాన్ని సందర్శించేందుకు ప్రతి ఏడాది పర్యాటక సీజన్‌లో అత్యధిక సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. ప్రస్తుతం శుక్ర, శని, ఆదివారాల్లో వందల సంఖ్యలో పర్యాటకులు జలపాతం వద్ద ప్రకృతి అందాలను వీక్షించేందుకు వస్తున్నారు. దీనికి తోడు జలపాతానికి ఆనుకుని వున్న ఎనిమిది గ్రామాల గిరిజనులు ఈ రహదారిపైనే రాకపోకలు సాగిస్తున్నారు. గతంలో సమగిరి నుంచి యర్రవరం జలపాతం వరకు కేవలం కాలిబాట మాత్రమే ఉండేది. దీంతో ప్రతి ఏడాది పర్యాటకులు, ఆదివాసీలు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పర్యాటక ప్రాజెక్టులో భాగంగా యర్రవరం జలపాతం వరకు నాలుగు కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణానికి రూ.రెండు కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను మంజూరు చేసింది. నిర్మాణ బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్ పలు చోట్ల కల్వర్టులు నిర్మించారు. తారు రోడ్డు నిర్మాణానికి ఎర్త్ వర్కు పూర్తి చేసి వెట్‌మిక్స్ వేశారు. అయితే వర్షాల వలన పనులు ఆలస్యమయ్యాయి. కాగా గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు రహదారి అత్యంత అధ్వానంగా తయారైంది. వర్షపు నీరు ప్రధాన రహదారిపై నుంచి ఉధృతంగా ప్రవహించడం వల్ల పలుచోట్ల రహదారి కోతకు గురైంది. వెట్‌మిక్స్ వర్షపు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ప్రస్తుతం రహదారి ఆనవాళ్లు కనిపించడం లేదు. సమగిరి నుంచి యర్రవరం జలపాతం వరకు వెళ్లేందుకు ఆదివాసీలు, పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలకు రహదారి అసౌకర్యంగా ఉంది. ద్విచక్రవాహనాల్లో ప్రయాణించే పర్యాటకులు, ఆదివాసీలు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు, కలెక్టర్ స్పందించి సాధ్యమైనంత త్వరగా తారు రోడ్డు నిర్మించి రవాణా కష్టాలు తీర్చాలని పర్యాటకులు, ఆదివాసీలు కోరుతున్నారు.