దారి ఘోరం.. ప్రయాణం ప్రమాదకరం
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:00 AM
మండలంలోని చింతపల్లి- సీలేరు అంతర్రాష్ట్ర ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. లంకపాకలు నుంచి జీకేవీధి వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర ప్రధాన రహదారిపై భారీ గోతులు, బురద ఏర్పడింది. దీంతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు.
- అధ్వానంగా అంతర్రాష్ట్ర రహదారి
- లంకపాకలు నుంచి జీకేవీధి వరకు భారీ గోతులు, బురద
- ప్రమాదాలకు గురవుతున్న వాహనచోదకులు
గూడెంకొత్తవీధి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చింతపల్లి- సీలేరు అంతర్రాష్ట్ర ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. లంకపాకలు నుంచి జీకేవీధి వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర ప్రధాన రహదారిపై భారీ గోతులు, బురద ఏర్పడింది. దీంతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు.
చింతపల్లి- సీలేరు ప్రధాన రహదారిలో భద్రాచలం, మల్కన్‌గిరి, ఛత్తీస్‌గఢ్, హైదరాబాద్ ప్రాంతాలకు ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రహదారిలో ఆర్‌వీనగర్ నుంచి లంకపాకలు వరకు పూర్తిగా పాడైపోయింది. రహదారిపై భారీ గోతులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు గోతులను మట్టితో పూడ్చి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈ రహదారి బురదగా మారిపోయింది. దీంతో ఈ మార్గం గుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనాలు కూడా తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేయడం గాని, లేదా కొత్తగా రహదారి నిర్మాణం చేపట్టడం గానీ చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.