Share News

ఇ-ఆటోల మొరాయింపు

ABN , Publish Date - Aug 10 , 2025 | 01:05 AM

పారిశుధ్య నిర్వహణకు ఉపయోగిస్తున్న ఇ- ఆటోలు తరచూ మొరాయిస్తున్నాయి. గత ప్రభుత్వంలో క్లాప్‌ పథకంలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా నర్సీపట్నం మునిసిపాలిటీకి అరటన్ను సామర్థ్యం గల 10 ఇ-ఆటోలను రూ.40 లక్షలతో కొనుగోలు చేశారు. అయితే వినియోగంలోకి రాక ముందే నాలుగు వాహనాలకు స్టార్టింగ్‌ సమస్య వచ్చింది. బ్యాటరీల సామర్థ్యం తగ్గి పోయి స్టార్టింగ్‌ సమస్య ఉత్పన్నమై ఇబ్బంది పెడుతున్నాయి.

  ఇ-ఆటోల మొరాయింపు
పాత మునిసిపల్‌ కార్యాలయంలో ఇ-ఆటోలు

- 10 వాహనాలకు గాను ఐదు మూలకు చేరిన వైనం

- మూడు, నాలుగు రోజులకోసారి చెత్త సేకరణ

- దుర్గంధంతో జనం ఇబ్బందులు

నర్సీపట్నం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి) : పారిశుధ్య నిర్వహణకు ఉపయోగిస్తున్న ఇ- ఆటోలు తరచూ మొరాయిస్తున్నాయి. గత ప్రభుత్వంలో క్లాప్‌ పథకంలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా నర్సీపట్నం మునిసిపాలిటీకి అరటన్ను సామర్థ్యం గల 10 ఇ-ఆటోలను రూ.40 లక్షలతో కొనుగోలు చేశారు. అయితే వినియోగంలోకి రాక ముందే నాలుగు వాహనాలకు స్టార్టింగ్‌ సమస్య వచ్చింది. బ్యాటరీల సామర్థ్యం తగ్గి పోయి స్టార్టింగ్‌ సమస్య ఉత్పన్నమై ఇబ్బంది పెడుతున్నాయి. ఇటీవల ఆటో బ్యాటరీలు పని చేయకపోవడంతో మూడు ఆటోలు మూలకు చేరాయి. వాటిని రిపేరు చేయించి వినియోగంలోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఐదు ఆటోలను మాత్రమే చెత్త రవాణాకు వాడుతున్నారు. మరో ఐదు ఆటోలు స్టార్టింగ్‌ సమస్య కారణంగా మూలకు చేరాయి. వార్డుల్లోని ఇరుకు రోడ్లలో ట్రాక్టర్లతో చెత్త సేకరణ కష్టం కాబట్టి ఆటోలు అందుబాటులో ఉంటే ఉపయుక్తంగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నాయి.

రోజూ 30 టన్నుల చెత్త ఉత్పత్తి

మునిసిపాటీలోని 28 వార్డుల్లో 19,646 ఇళ్ల నుంచి చెత్త సేకరణ చేయాల్సి ఉంటుంది. నర్సీపట్నం, పెదబొడ్డేపల్లి, బలిఘట్టంలోని కూరగాయల మార్కెట్లు, మెయిన్‌ రోడ్డు షాపులు, వార్డులలో ఇంటింటికి తిరిగి సేకరించిన చెత్త కలిపి ప్రతీ రోజు 30 టన్నులు ఉత్పత్తి అవుతుంది. చెత్తను బలిఘట్టంలోని ఘన వ్యర్థాల నిర్వహణ యార్డుకు తరలించాలి. ఇంటింటికి వెళ్లి తడి, పొడి, ప్రమాదకర చెత్త సేకరణకు కేవలం ఒక సాధారణ ఆటో, 5 ఎలకా్ట్రనిక్‌ ఆటోలు తిరుగుతున్నాయి. మెయిన్‌ రోడ్లు, మార్కెట్లు, బలిఘట్టం కంపోస్ట్‌ యార్డుకి చెత్తను తరలించడానికి ఆరు ట్రాక్టర్లు వినియోగిస్తున్నారు. దీంతో ప్రతి రోజూ తడి, పొడి, ప్రమాదకర చెత్త సేకరణ సరిగ్గా జరగడం లేదు. డ్రైనేజీల్లో పూడిక 10 రోజులకు ఒకసారి కూడా తీసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో స్వచ్ఛాంధ్రా కార్పొరేషన్‌ ద్వారా మునిసిపాలిటీకి మంజూరైన 10 ఇ-ఆటోలు ఉపయోగపడితే వార్డులలో చెత్త సేకరణ మరింత సులభంగా ఉండేది. ఈ ఆటోలు తరచూ మరమ్మతులకు గురికావడంతో వార్డులలో చెత్త సమస్య తప్పడం లేదు. మూడు, నాలుగు రోజులకు ఒకసారి చెత్త సేకరణ జరుగుతోంది. దీంతో స్థానికులు దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇ-ఆటోలు అన్నీ వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Aug 10 , 2025 | 01:05 AM