చింతలవీధి వాసులు రాస్తారోకో
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:29 AM
మండలంలోని చింతలవీధిలో వినాయక చవితి ఊరేగింపులో జనంపైకి వ్యాన్ దూసుకొచ్చిన ఘటనలో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామస్థులు సోమవారం పాడేరు- అరకులోయ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్
ఎస్‌పీ అమిత్‌బర్ధార్ హామీతో ఆందోళన విరమణ
పాడేరు, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చింతలవీధిలో వినాయక చవితి ఊరేగింపులో జనంపైకి వ్యాన్ దూసుకొచ్చిన ఘటనలో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామస్థులు సోమవారం పాడేరు- అరకులోయ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వ్యాన్ నడిపి ఇద్దరు మృతికి, ఆరుగురు తీవ్రగాయాలకు కారకుడైన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సుమారుగా ఎనిమిది కుటుంబాలు వీధిన పడిన ఈ ఘటనపై గిరిజన సంఘాలు తమకు అండగా నిలవలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు జాతీయ రహదారిపై చింతలవీధి వాసులు రాస్తారోకో చేయడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాడేరు నుంచి అరకులోయ, ముంచంగిపుట్టు, పెదబయలు మార్గాలకు వెళ్లే వాహనాలను దారి మళ్లించి వేరే మార్గంలో పంపించారు.
బాధితులకు అండగా ఆందోళనలో పాల్గొన్న కూటమి నేతలు
బాధితులు చేపడుతున్న ఆందోళనకు కూటమి నేతలు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పాంగి రాజారావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతికుమారి, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొర్రా విజయరాణి, పీఏసీఎస్ చైర్మన్ డప్పోడి వెంకటరమణ, తదితరులు అండగా నిలిచారు. ఆందోళనకారులతో కలిసి వారంతా రాస్తారోకోలో పాల్గొన్నారు. ప్రమాద బాధితులకు సంపూర్ణంగా న్యాయం జరగాలని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారకులైన వ్యక్తులు స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకు చెందిన వారు కావడంతోనే ఆయన బాధితులను పరామర్శించలేదని ఆరోపించారు. జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్ధార్, కూటమి నేతలు, బాధిత కుటుంబాలతో చర్చలు జరిపి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సాయంత్రం ఐదున్నర గంటలకు ఆందోళన విరమించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ డి.దీనబందు, ఎస్‌ఐ సురేశ్, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.