Share News

వివాహేతర సంబంధమే కారణం

ABN , Publish Date - May 04 , 2025 | 12:17 AM

నగరంలో కలకలం రేపిన భీమిలి పోలీస్‌ స్టేషన్‌ పరిధి దాకమర్రి శివారులోని ఫార్చ్యూన్‌ హిల్స్‌ వుడా లేఅవుట్‌లో సగం కాలిన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలితో వివాహేతర సంబంధం కలిగి ఉన్న వ్యక్తే ఆమెను హత్య చేసినట్టు నిర్ధారించారు. పోలీస్‌ కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

వివాహేతర సంబంధమే కారణం
హత్యకు గురైన వెంకటలక్ష్మి (ఫైల్‌ ఫొటో)

దాకమర్రి లేఅవుట్‌లో సగం కాలిన

మహిళ మృతదేహం కేసుని ఛేదించిన పోలీసులు

హతురాలు మారికవలస

రాజీవ్‌ గృహకల్పకు చెందిన వివాహిత

అదే ప్రాంతంలో ఉంటున్న వ్యక్తితో వివాహేతర సంబంధం

నిందితుడికి ఇద్దరు భార్యలు..

తనతో ఎక్కువ సమయం ఉండాలని మృతురాలి ఒత్తిడి

ఆమెను వదిలించుకునేందుకు పథకం ప్రకారం హత్య

విశాఖపట్నం/భీమునిపట్నం రూరల్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): నగరంలో కలకలం రేపిన భీమిలి పోలీస్‌ స్టేషన్‌ పరిధి దాకమర్రి శివారులోని ఫార్చ్యూన్‌ హిల్స్‌ వుడా లేఅవుట్‌లో సగం కాలిన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలితో వివాహేతర సంబంధం కలిగి ఉన్న వ్యక్తే ఆమెను హత్య చేసినట్టు నిర్ధారించారు. పోలీస్‌ కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 38 ఏళ్ల మహిళ (వెంకటలక్ష్మి) భర్త చనిపోవడంతో ఇద్దరు కుమారులతో కలిసి మారికవలసలోని రాజీవ్‌ గృహకల్ప బ్లాక్‌ నంబర్‌-121లో ఎస్‌ఎఫ్‌-4లో నివాసం ఉంటుంది. ఒడిశాలోని రాయగడ జిల్లా కాంపోమల్లిగాంకు చెందిన శరాతి కాంతికుమార్‌ (25)కు మొదటిభార్య ఉండగానే రెండో వివాహం చేసుకున్నాడు. తొలి భార్య, పిల్లలు తగరపువలసలో ఉంటుండగా, రెండో భార్యను నాలుగేళ్ల కిందట రాజీవ్‌ గృహకల్పలో మృతురాలు ఉంటున్న ఇంటి పక్కనే ఉంచాడు. ఈ క్రమంలో మృతురాలికి కాంతికుమార్‌కు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయమై రెండో భార్య గొడవ పడడంతో ఆమెను అదే కాలనీలోని మరో బ్లాక్‌కు మార్చాడు. ఇటీవల కాలంలో మృతురాలు తనతో ఎక్కువ సమయం ఉండాలని ఒత్తిడి చేస్తోంది. అప్పటికే ఇద్దరు భార్యలతో గొడవలు జరుగుతుండడంతో మృతురాలిని

ఎలాగైనా వదిలించుకోవాలని కాంతికుమార్‌ భావించాడు. ఈ క్రమంలో ఈ నెల ఒకటో తేదీ రాత్రి 8 గంటల సమయంలో మృతురాలు వెంకటలక్ష్మికి ఫోన్‌ చేసి సిటీలోకి వెళదామని చెప్పాడు. దీంతో ఆమె ఫంక్షన్‌కు వెళ్లి వస్తానని ఇంట్లో వారికి చెప్పి బయటకు వెళ్లింది. కాంతికుమార్‌ ముందుగానే చాకుని తీసుకుని బైక్‌పై వెళ్లి మృతురాలిని ఎక్కించుకున్నాడు. తీరంలోని తెన్నేటి పార్కు వద్ద కాసేపు ఐస్‌క్రీమ్‌ తిన్నాక బైకులో పెట్రోల్‌ అయిపోయిందని బెంక్‌కు వెళ్లారు. కొంత పెట్రోల్‌ను బైక్‌లో వేయించి, మరికొంత తనతో తెచ్చుకున్న బాటిల్‌లో వేయించాడు. బాటిల్‌లో పెట్రోల్‌ ఎందుకని మృతురాలు ప్రశ్నించగా, తన ఇంటి వద్ద బైక్‌ నుంచి పెట్రోల్‌ చోరీ చేస్తున్నారని, దీంతో ఉదయాన్నే డ్యూటీకి వెళ్లడానికి ఇబ్బంది అవుతుందని చెప్పడంతో మృతురాలికి అనుమానం రాలేదు. అక్కడ నుంచి తిమ్మాపురం సమీపంలోని రామాద్రి బీచ్‌వద్దకు వెళ్లి నూడిల్స్‌ తిన్నారు.

అనంతరం దాకమర్రి రఘు కాలేజీ రోడ్డులో టీ టైమ్‌ దగ్గర ఆగి ఇద్దరూ కాఫీ తాగారు. ఆ తరువాత అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో శారీరకంగా కలుద్దామని నమ్మించి ఆమెను ఫార్చ్యూన్‌లేఅవుట్‌లోకి తీసుకువెళ్లాడు. అక్కడకు వెళ్లాక చీకట్లో చాకుతో మృతురాలి మెడను కోసి హత్య చేశాడు. ఆ తరువాత ఆమె మెడలోని ఆభరణాలు, చెవిదిద్దులను తీసుకుని బాటిల్‌తో తెచ్చిన పెట్రోల్‌ను పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. ఆ మర్నాడు సగం కాలిన మహిళ మృతదేహం ఉన్నట్టు సమాచారం అందగానే సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు నార్త్‌ ఏసీపీ అప్పలరాజు ఆధ్వర్యంలో భీమిలి సీఐ తిరుమలరావు, ఆనందపురం సీఐ వాసునాయుడు నేతృత్వంలో ప్రత్యేక బృందాలను విచారణ కోసం ఏర్పాటు చేశారు. ఘటనా స్థలిలో లభ్యమైన దుస్తులు, ఇతర వస్తువులు, ఆనవాళ్లను పోలీసులు సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేయడంతో మృతురాలి ఆచూకీ లభ్యమైంది. మృతురాలి ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా నిందితుడైన కాంతికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నేరం అంగీకరించడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీపీ వెల్లడించారు. హత్యకు సంబంధించిన సమాచారం అందిన ఆరు గంటల వ్యవధిలోనే మృతురాలితో పాటు నిందితుడిని గుర్తించడం, నిందితున్ని అరెస్టు చేశామన్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని సీపీ శంఖబ్రత బాగ్చి అభినందించారు.

Updated Date - May 04 , 2025 | 12:17 AM